అధికార దాష్టీకం
మచిలీపట్నం : శాలివాహనులకు మచిలీపట్నం పంపులచెరువు, శివగంగ డ్రెయిన్‌కు మధ్య 180, 181 సర్వే నంబర్లలో 22 ఎకరాల భూమిని 1971 ఆగస్టు 3న అప్పటి ఆర్డీవో కుండలు, ఇతరత్రా పనులు చేసుకుని జీవించేందుకు ఇచ్చారు. కొంత భూమిలో ఇటుక బట్టీలు, కుండలు తయారు చేస్తుండగా మరికొంత భూమిని మట్టిని తవ్వేందుకు వినియోగిస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టినతరువాత ఈ భూమిలో స్టేడియం నిర్మాణం చేయాలని పాలకులు తలపెట్టారు. అనుకున్నదే తడవుగా ఈ భూమిని ఖాళీ చేయాలని మునిసిపల్, రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు పంపారు.
పోలీసులు, అధికారుల అత్యుత్సాహం :
తమ భూమిని స్వాధీనం చేసుకోవద్దని కోరుతూ విజయవాడ–మచిలీపట్నం రహదారిపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న కుమ్మరి గూడెం వాసులు, వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను అక్కడి నుంచి తొలగించేందుకు పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నా వద్దకు తొలుత మునిసిపల్ కమిషనర్ జస్వంతరావు, ఇన్‌చార్జి టీపీవో నాగేంద్రప్రసాద్, తహసీల్దార్ నారదముని వచ్చారు. ఈ సందర్భంగా తాము జీవనం సాగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పూడ్చే ప్రయత్నం చేయవద్దని శాలివాహనులు వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, భూమిని పూడ్చివేయడంతో పాటు మిగిలిన భూమిని ఖాళీ చేయాలని అధికారులు చెప్పటంతో వాగ్వాదం జరిగింది. భూమిని పూడ్చే పనిని తాము చేపడతామని అధికారులు చెప్పారు.
ఈ దశలో వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ అంశంపై ఇరువైపులా వాగ్వాదం జరిగింది. చివరకు అధికారులు నిరాకరించటంతో పలువురు మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ధర్నాలో కూర్చున్న వారంతా అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డు పైకి వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించారు. ధర్నా విరమించకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పేర్ని నానితో పాటు కౌన్సిలర్లు, సీపీఎం నాయకులను బలవంతంగా పోలీసుజీపు, వ్యాన్‌లలోకి ఎక్కించారు. ఈ సమయంలో తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. కొందరు మహిళలను పోలీసులు వ్యాన్‌లోకి విసిరేశారు. దీనిని గమనించిన కుమ్మరిగూడెం మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మంత్రి కొల్లు రవీంద్రను మహిళలు తమదైన శైలిలో తిట్టిపోశారు.
చివరకు ఆందోళనకారులను పోలీసులు రెండు వాహనాలలో గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పరిస్థితిని సమీక్షించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, కౌన్సిలర్లు అచ్చేబా, అస్గర్, సుబ్బన్న, నాయకులు మారుమూడి విక్టర్‌ప్రసాద్, బొర్రా విఠల్, ధనికొండ శ్రీనివాస్, చిటికిన నాగేశ్వరరావు, లంకా సూరిబాబు, బందెల థామస్‌నోబుల్, సీపీఎం నాయకులు దాసరి సాల్మన్‌రాజు, చిరువోలు జయరాజు తదితరులు మద్దతు ప్రకటించారు.
నానితో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు
మచిలీపట్నం : ప్రజల జీవనానికి భంగం కలిగిస్తున్నారనే కారణంతో ఇనుగుదురుపేట పోలీసులు పది మందిపై సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇనుగుదురుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద కుమ్మరిగూడెంవాసులు మచిలీపట్నం – విజయవాడ రహదారి వెంబడి «సోమవారం దర్నా నిర్వహించారు. పోలీసులు చెప్పినా ధర్నా విరమించకపోవటంతో ప్రజాజీవనానికి భంగం కలిగిస్తున్నారనే కారణంతో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, కుమ్మరిగూడెంకు చెందిన నారగాని సుబ్బారావు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.