పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలంటూ హెచ్చరిక
మచిలీపట్నం: రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సైకిల్‌పై పట్టణంలో పర్యటించారు. కోనేరుసెంటర్ నుంచి సైకిల్‌పై బయలుదేరిన ఆయన బస్టాండ్‌సెంటర్, జిల్లాకోర్టుసెంటర్, లక్ష్మీటాకీస్‌సెంటర్ మీదుగా మూడో వార్డులోని పెయింటర్స్‌కాలనీ, నీలగిరికాలనీల్లో పర్యటించారు.
మంత్రి పట్టణంలోని మురికివాడల్లో పారిశుద్ధ్య సిబ్బంది విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నదీ, సక్రమంగా విధులకు హాజరవుతున్నదీ లేనిదీ ఆరా తీయడంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక ఆరా తీశారు. పెయింటర్స్‌కాలనీ వాసులు తమ ప్రాంతంలో డ్రైనేజీ వసతి సరిగా లేదని, వర్షాకాలంలో కాలనీ మొత్తం తటాకంలా తయారవుతుందని మంత్రి ఎదుట వాపోయారు. కాలనీకి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రైనేజీల అనుసంధానానికి మొదటి విడతగా రూ. 18 కోట్ల నిధులు మంజూరయినట్లు కాలనీ వాసులకు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులందితే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు బత్తిన దాసు, నారగాని ఆంజనేయప్రసాద్, లోగిశెట్టి వీరాస్వామి పాల్గొన్నారు.