18న రైతులతో కలెక్టర్ ముఖాముఖి
భూమి కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల
మచిలీపట్నం / చిలకలపూడి : బందరు పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు వారం రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కలెక్టర్ బాబు.ఎ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పోర్టు భూముల భూసేకరణ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోర్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు.
ఎటువంటి పొరపాట్లూ జరగకుండా పోర్టు నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను, ఎంపీ కొనకళ్ల పోర్టు భూసేకరణకు సంబంధించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వారు భూమిని అప్పగించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారన్నారు. ఈ నెల 18న అంబేద్కర్ భవన్‌లో కలెక్టర్ బాబు.ఎ పోర్టు భూసేకరణకు సంబంధించిన రైతులతో చర్చిస్తారన్నారు. రైతుల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు కృషిచేయనున్నట్టు చెప్పారు.
ఖాళీ అయ్యే గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...
పోర్టు నిర్మాణంలో రెండు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని క్యాంప్‌బెల్‌పేట, పల్లెపాలెం గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని రవీంద్ర చెప్పారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు భూసేకరణకు సంబంధించి భూముల సర్వే పూర్తయిందన్నారు. సేకరించిన భూములకు సంబంధించి రైతులకు మంచి ధర పరిహారంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
పోర్టు భూసేకరణకు నోటిఫికేషన్...వారం రోజుల్లో
Published Sat, May 16 2015 5:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement