సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ నోటిఫికేషన్‌కు అనుగుణంగా సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని కింది కోర్టు పెంచినప్పుడు, ఆ పెంపుదల సబబా? కాదా? అన్న విషయంపై అధికరణ 226 కింద హైకోర్టుకున్న న్యాయసమీక్షాధికారం చాలా స్వల్పమని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం అప్పీల్ దాఖలుకు అత్యుత్తమ మార్గం ఉందని చెప్పింది.
దీని ప్రకారం రంగారెడ్డి జిల్లాలో వివిధ గ్రామాల పరిధిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్) కోసం సేకరించిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని పెంచుతూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకోవాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం పెంపుపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అధికరణ 226 కింద కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు కొట్టేశారు.
రంగారెడ్డి జిల్లాలో డీఆర్‌డీఎల్ కోసం 4వేల నుంచి 5వేల ఎకరాల భూమిని భూ సేకరణ నోటిఫికేషన్ ద్వారా 2004లో కేంద్రం సేకరించింది. 2007లో చదరపు గజానికి రూ.600 పరిహారంగా నిర్ణయించింది. దీన్ని పెంచాలంటూ భూ యజమానులు దిగువ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పరిహారాన్ని 600 నుంచి 1,250కి పెంచింది. మరికొందరి భూముల విషయంలో పరిహారాన్ని రూ.4వేలకు పెంచింది.
కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్రం, డీఆర్‌డీఎల్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. పరిహారం పెంచే ముందు భూ సేకరణ లబ్ధిదారులైన డీఆర్‌డీఎల్ అధికారులకు కింది కోర్టు నోటీసులు జారీ చేయకపోవడాన్ని తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment