
బాలయ్య పవరేంటో తెలియదా?
‘‘ఫ్లూటు జింక ముందు ఊదు..! సింహం ముందు కాదు..!!’’ ఓ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ఇది. అవే పంచ్ డైలాగ్‌లతో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రికి సినిమా (చుక్కలు) చూపించారట. ఇంతకీ బాలయ్య ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రికి ఎందుకు సినిమా చూపించారంటే... ఇటీవల ఎకై సజ్ శాఖలో బదిలీలు జరిగాయి. బాలయ్య ఆశీస్సులతో ఉత్తరాంధ్ర జిల్లాలో పనిచేస్తున్న ఎక్సైజ్ ఉన్నతాధికారిణి ఒకరికి రాయలసీమలో ఓ జిల్లాకు బదిలీ చేశారు.
ఈ బదిలీ గురించి తనకు తెలియకుండా జరిగిందని ఆ జిల్లాకు చెందిన ఇటీవల కాలంలో తరచూ యూటర్న్‌లు తీసుకుంటున్న రాయలసీమ ప్రాంత సీనియర్ మంత్రి ఒకరు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కినుక వహించారు. సదరు ఉన్నతాధికారికి కీలక వ్యక్తి ఒకరు సిఫారసు చేయడంతోనే అక్కడకు బదిలీ చేశామని ఎకై ్సజ్ మంత్రి వివరణ ఇచ్చుకున్నారట.
ఈ బదిలీపై ఇటీవల విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు కూడా. సదరు ఎక్సైజ్ ఉన్నతాధికారిణిపై పలు ఆరోపణలున్నాయని, అందువల్లే బదిలీ చేశామని అబ్కారీ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే సదరు అధికారిణి బదిలీ అయిన జిల్లాకు ఉత్తరాంధ్ర మంత్రి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో సదరు అధికారిణిని అక్కడ్నుంచి బదిలీ చేయాలని ఉత్తరాంధ్ర మంత్రి పట్టుబడుతున్నారట.
ఆమె ఉత్తరాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అమాత్యుని ఆదేశాలను అసలు పట్టించుకోకపోవడమే ఉత్తరాంధ్ర మంత్రిగారి కోపానికి కారణమట. రాయలసీమ ప్రాంతానికి బదిలీ జరిగినా.. ఉత్తరాంధ్ర మంత్రి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుండటంతో సదరు అధికారిణి బాలయ్యను ఆశ్రయించారట. దీంతో ఆగ్రహోదగ్రుడైన బాలయ్య ‘ఏంటి ఈ కాలిక్యులేషన్స్...!’ తమాషాలొద్దు అంటూ మంత్రిపై ఇంతెత్తు లేచారట. ‘అయిన వాళ్లకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా స్పందిస్తానేమో..! అదే ఏ ఆడపిల్లకు కష్టమొచ్చినా అరక్షణం ఆగను...!’ అంటూ వార్నింగ్ ఇవ్వడంతో మంత్రిగారు కిమ్మనలేదట.