తొలిరోజే సెగ !
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన జన్మభూమి కార్యక్రమం తొలిరోజు సోమవారం జిల్లాలో పలు చోట్ల రసాభాసగా మారింది. ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలని పలుచోట్ల స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించగానే ఏడాది క్రితం తాము రేషన్‌కార్డులు, వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఎందుకు మంజూరు చేయలేదని ఆయా వర్గాల ప్రజలు నిలదీశారు. జన్మభూమి సభలలో గొడవలు జరుగుతాయని భావించిన చోట ప్రభుత్వం ముందుగానే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది.
జన్మభూమి కమిటీలు రద్దు చేయాలంటూ ధర్నా...
జగ్గయ్యపేట మండలం అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల్లో జన్మభూమి– మాఊరు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం నాయకులు పలువురు జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్ (తాతయ్య), అధికారుల సమక్షంలోనే ధర్నాకు దిగారు. ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న వారిని అధికారులు బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి ధర్నా చేస్తున్న వారిని పక్కకు తోసేశారు. అర్హులైన వారికి కూడా పింఛన్లు, తెల్లకార్డులు అందకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు బహిరంగంగానే విమర్శించారు.కార్యక్రమంలో తహసీల్దార్ కె. నాగేశ్వరరావు, ఎంపీడీవో వై . శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ నాయకులు నెల్లూరి గోపాలరావు, పిడికిటి కోటేశ్వరరావు, గింజుపల్లి శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు డోర్నాల నాగయ్య, అరుణ్‌కుమార్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల పహరాలో....!
విజయవాడ 23వ డివిజన్ కృష్ణలంక ఏపీఎస్‌ఆర్‌ఎం స్కూల్‌లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తారనే అనుమానంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు ఎవరువస్తున్నారో నిఘాపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ సభ ముగిసిందని అనిపించడంతో ప్రజలు పెదవివిరిచారు. జిల్లాలో పలుచోట్ల పోలీసు బందోబస్తు నడుమే తొలిరోజు జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి.
రేషన్ కార్డులకు బదులు ప్రొసీడింగ్స్ ....
జిల్లాలో తొలిరోజు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పలుచోట్ల స్థానికులు పాల్గొని తాము ఏడాది క్రితం తెల్లరేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నామని ఇప్పటి వరకు ఇవ్వలేదందటూ అధికారుల్ని నిలదీశారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కార్డుల మంజూరు ప్రొసీడింగ్స్‌ను ఇచ్చి పంపారు. బందరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా ఆయనకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్ల సెగ తగిలింది. పలువురు పేదలు తాము ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పింఛన్లు, తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని చెప్పారు. దీంతో వారికి మంత్రి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.