పెడన : టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత రుణమాఫీ తక్షణం అమ లు చేయకపోతే చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని ముట్టడిస్తామని వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రసాద్ హెచ్చరించారు. స్థానిక 16వ వార్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనంద్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు చేనేత రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వటం వలన చేనేత కార్మికులు రుణాలు చెల్లించలేదని చెప్పారు.
రుణాలకు వడ్డీలు పెరిగిపోవటంతోపాటు బ్యాంకర్ల ఒత్తిళ్లు పెరగటం వలన రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, దావు భైరవలింగం, పార్టీ మండల పరిషత్ ప్రతిపక్ష నేత రాజులపాటి అచ్యుతరావు, పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు పిచ్చిక సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.