కృష్ణా జిల్లాలో టీడీపీ నిర్వహించిన జనచైతన్య యాత్ర గందరగోళానికి దారి తీసింది. ఈ యాత్రలోని టీడీపీ కార్యకర్తలు పెద్దకర అగ్రహారం రైతులపై దాడులకు పాల్పడ్డారు.
కృష్ణా: కృష్ణా జిల్లాలో టీడీపీ నిర్వహించిన జనచైతన్య యాత్ర గందరగోళానికి దారి తీసింది. ఈ యాత్రలోని టీడీపీ కార్యకర్తలు పెద్దకర అగ్రహారం రైతులపై దాడులకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోర్టు అనుబంధ సంస్థలకు తమ భూములు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని ఇక్కడి రైతులు గత కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ వస్తున్నారు.
అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోపాటు తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఆద్వర్యంలో మంగళవారం తమ ప్రాంతంలో జరుగుతున్న జన చైతన్య యాత్రలో తమ వాణిని వినిపించేందుకు భారీ సంఖ్యలో రైతులు చేరుకున్నారు. కానీ, అందుకు మంత్రి అనుమతించకపోవడంతో వారు నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాటిల్లో తమ డిమాండ్ పేర్కొన్నారు. దీంతో తమ యాత్రను అడ్డుకుంటారా అంటూ టీడీపీ కార్యకర్తలు వారిపై ఒక్కసారిగా దాడులకు దిగారు. ఈ దాడుల్లో తమ మెడలోని బంగారు గొలుసులు టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి తొలిరోజే టీడీపీ జన చైతన్యయాత్ర ప్రజాగ్రహానికి గురైంది.