TDP Leaders Attacks Rise In Punganur Assembly Constituency - Sakshi
Sakshi News home page

TDP Attacks: పుంగనూరులో తారస్థాయికి చేరిన టీడీపీ ఆగడాలు

Published Tue, Jan 10 2023 3:43 PM | Last Updated on Tue, Jan 10 2023 6:47 PM

TDP Leaders Attacks Rise in Punganur Assembly Constituency - Sakshi

దాడులకు ఎగబడుతున్న టీడీపీ శ్రేణులు (ఫైల్‌)

14 ఏళ్లు అధికార మదంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అవసరాలను అవకాశంగా చేసుకుని ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఇప్పుడు వీటన్నింటికీ చెక్‌ పడడంతో ఏమిచేయాలో దిక్కుతోచక వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాటను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారు. తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో పచ్చని పల్లెల్లో నిప్పురాజేసి రాక్షస క్రీడకు ఆజ్యం పోస్తున్నారు. అభిమానంతో ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. అడ్డుకున్న కార్యకర్తలు, ప్రజలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. హాకీ స్టిక్‌లు, రాళ్లతో దాడులు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పుంగనూరు నియోజకవర్గ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతోందన్న అక్కసుతో దాడులకు తెగబడుతున్నారు. ఏంచేయాలో దిక్కుతోచక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించివేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అడ్డుకుంటున్న కార్యకర్తలు, ప్రజలపై విక్షణారహితంగా దాడులు చేస్తూ రచ్చకీడుస్తున్నా రు. తర్వాత వాటన్నింటినీ ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపైకి నెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలమైన పత్రికలు, మీడియాలో అసత్య కథనాలు వళ్లిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.  

దాడులు ఎందుకంటే.. 
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల్లో పుంగనూరు నియోజకవర్గం కూడా ఉంది. 14 ఏళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర వాటిని టీడీపీ కార్యకర్తకో, వారి కుటుంబ సభ్యులకో మంజూరు చేయడం రివాజుగా మారేది. లేదంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిప్పడం.. ఆపై మొండిచేయి చూపడం అటవాటుగా మారింది. ఆ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే రోడ్లు, ఇతర పథకాలు మంజూరయ్యేవి.  ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. 2019 సాధారణ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతా సంక్షేమ పాలన మొదలైంది. 

ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు మెచ్చి పుంగనూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీకి జై కొడుతున్నారు. ఆయన అనేక మందికి తనవంతు సాయం చేస్తుండడంతో ఆ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు సైతం వైఎస్సార్‌సీపీ జెండా కిందకు వస్తున్నాయి. ప్రస్తుతం పల్లెబాట పేరుతో ఊరూరా తిరుగుతున్న మంత్రికి అనూహ్య స్పందన లభిస్తుండడంతో.. నియోజకవర్గంలో అక్కడక్కడా మిగిలిపోయిన టీడీపీ నేతలు సైతం వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయి.  

రెచ్చిపోతున్న తమ్ముళ్లు 
మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట నేపథ్యంలో రొంపిచర్ల మండలంలోని బొమ్మయ్యగారిపల్లె, పెద్దగొట్టిగల్లు, బోడిపాటివారిపల్లెకు చెందిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబ డ్డారు. రెండు రోజుల క్రితం రొంపిచెర్ల క్రాస్‌లో వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలను చించివేశారు. అలాగే ఈనెల 1వ తేదీ రాత్రి చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె పంచాయతీ, తెల్లనీళ్లపల్లిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్‌రెడ్డి (చిట్టి), అతని అనుచరులు కలిసి ఎంపీటీసీ శ్రీరాములును చితకబాదారు. ఆ గ్రామంలో బ్యానర్లు కట్టకూడదని దౌర్జన్యానికి ఒడిగట్టారు. అదేవిధంగా ఈనెల 3న దిగువపల్లె పంచాయతీ భవానీనగర్‌లో భూ విషయమై టీడీపీ వర్గాలు రెండు ఘర్షణకు దిగాయి. దీన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా ద్వారా అతస్య కథనాలు రాయించడం కొసమెరుపు.  


బరితెగిస్తూ.. నియోజకవర్గంలో ‘చల్లా’యిస్తూ.. 

ఇటీవల టీడీపీ నియోజకవర్గ నేత చల్లా బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ‘ఇందేం ఖర్మ’ కార్యక్రమా న్ని చేపట్టారు. గత శుక్రవారం పీలేరు, కలికిరి నుంచి ర్యాలీగా సోమల మండలానికి చేరుకున్నా రు. పెద్ద ఉప్పరపల్లి మీదుగా సోమల దళితవాడకు చేరుకున్న టీడీపీ ర్యాలీని స్థానికులు అడ్డుకున్నారు. ‘టీడీపీ ప్రభుత్వంలో మాకేం చేశారు..’ అంటూ ఎదురుతిరిగారు. తమ గ్రామంపై ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.

ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు వికృతచేష్టలకు ఒడిగట్టారు. అడ్డు తప్పుకోకపోతే వాహనాలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే స్థానికులకు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహించలేని టీడీపీ శ్రేణులు స్థానికులపై హాకీ స్టిక్స్, రాళ్లతో దాడికి దిగారు. వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పీఎల్‌ఆర్‌ రాజారెడ్డిపై దాడిచేశారు. ఆయన కాలు, చేయిని విరగ్గొట్టి పంతం నెగ్గించుకున్నారు. చివరకు సోమల ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. (క్లిక్ చేయండి:  టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement