కర్నూలు సీక్యాంప్: సొంత పొలం కోసం వెళ్లిన వ్యక్తులపై దారుణంగా దాడి చేసిన ఘటన ఆర్‌కే దుద్యాలలో ఆదివారం చోటు చేసుకుంది. ‘మా నాయకుడి ఇలాకాలోనే పంచాయితీ పెడతారా’ అంటూ తెలుగు దేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన బోయ రాముడు, లక్ష్మీదేవి దంపతులు కొన్నాళ్ల క్రితం గ్రామాన్ని వీడి లక్ష్మీదేవి స్వగ్రామమైన నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చేరుకున్నారు.
వీరికి చెందిన 12 ఎకరాల పొలాన్ని గ్రామానికి చెందిన శేఖర్, బాలచంద్రుడు, రంగయ్య, నగేశ్, లక్ష్మన్న కుటుంబీకులు ఆక్రమించుకుని పంటలు సాగు చేస్తున్నారు. వారం క్రితం లక్ష్మీదేవి దంపతులు దుద్యాలకు చేరుకుని తమ పొలం తమకివ్వాలని కోరారు. అయితే పెద్దల సమక్షంలో పంచాయితీ పెడదామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం లక్ష్మీదేవి తన సోదరులు బి. చంద్రస్వామి, రామస్వామిని వెంట తీసుకెళ్లింది.
ఆర్.కొంతలపాడు, తులశాపురం, ఆర్.కె.దుద్యాల వాసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని లక్ష్మీదేవి పొలం ఆమెకు ఇచ్చేలా పంచాయితీ చేశారు. దీనిని జీర్ణించుకోలేని శేఖర్, బాల చంద్రుడు, రంగయ్య, నగేశ్,కుటుంబ సభ్యులు బి.చంద్రస్వాములు, బి.రామస్వామిపై కత్తులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తాము విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులమని, తమ నాయకుడి ఇలాకాలో పంచాయితీ పెడతారా అంటూ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తాలుకా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment