సుకుమార్‌రెడ్డిపై దాడికి యత్నం | TDP Kavali MLA Candidate Kotam Reddy Vishuvardhan Reddy Try To Attack Sukumar Reddy | Sakshi
Sakshi News home page

సుకుమార్‌రెడ్డిపై దాడికి యత్నం

Published Tue, Apr 2 2019 11:06 AM | Last Updated on Tue, Apr 2 2019 11:08 AM

 TDP  Kavali MLA Candidate Kotam Reddy Vishuvardhan Reddy Try To Attack Sukumar Reddy - Sakshi

కావలి: కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవహారశైలిపై ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమయ్యాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కావలి నియోజకవర్గంలో ఆ పార్టీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మన్నెమాల సుకుమార్‌రెడ్డిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మండల కేంద్రమైన అల్లూరులో గ్రామదేవత పోలేరమ్మ తల్లి సాక్షిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అనుచర నేర గ్యాంగ్‌ దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణు అనుచర నేర గ్యాంగ్‌కు సంబంధించిన 25 మంది ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే శనివారం రాత్రి కావలిరూరల్‌ మండలం అన్నగారిపాలెం మాజీ సర్పంచ్, మత్స్యకార నాయకుడు నరసింహంను కాళ్లు విరగ్గొడతామని విష్ణువర్ధన్‌రెడి కుమారుడు హెచ్చరించారు.

వివరాలు.. ఆదివారం అర్ధరాత్రి అల్లూరులో పోలేరమ్మ గుడి పక్కవీధిలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం చుట్టూ విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన నేర గ్యాంగ్‌ చిత్తుగా మద్యం సేవించి ద్విచక్రవాహనాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆ సమయంలో పార్టీ నాయకులతో కలిసి అటుగా కారులో వెళుతున్న మన్నెమాల సుకుమార్‌రెడ్డిని గమనించిన సదరు గ్యాంగ్, పోలేరమ్మ గుడి ఎదురుగా ద్విచక్రవాహనాన్ని కారుకు అడ్డంగా పెట్టి ఆపేశారు. ఎవరు మీరు.. ఎందుకు వచ్చారని.. మాటలు కలిపి కారులో ఉన్న సుకుమార్‌రెడ్డిని కిందకు దిగేలా చేశారు. వెంటనే సుకుమార్‌రెడ్డి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ బలవంతంగా లాగేసుకున్నారు. అడ్డుకోయిన ఆయన వ్యక్తిగత సహాయకుడైన యువకుడిపై కూడా దాడి చేశారు. ఇంతలో కారులో ఉన్న పార్టీ నాయకులు కిందకు దిగి వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కర్రలు తీసుకురండి అంటూ కేకలు వేసిన నేర గ్యాంగ్‌తో మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు సౌమ్యంగా మాట్లాడడంతో వారు వెనక్కి తగ్గి వెళ్లిపోయారు.

 నరసింహానికి బెదిరింపులు
ఇదిలా ఉండగా శనివారం రాత్రి కావలిరూరల్‌ మండలం అన్నగారిపాలెం మాజీ సర్పంచ్, మత్స్యకారుల నాయకుడు నరసింహం మండలంలోని మత్స్యకారులను వెంటపెట్టుకొని అల్లూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్చారు. అనంతరం వెనుదిరిగి కావలికి తన బుల్లెట్‌ వాహనంపై నరసింహం వస్తుండగా అల్లూరులో విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు విక్రమాదిత్యరెడ్డి అడ్డుకొని బుల్లెట్‌ తాళం లాగేసుకున్నాడు. కావలి వాళ్లకు అల్లూరులో ఏం పని.. ఈ సారి కావలి వాళ్లు అల్లూరులో కనిపిస్తే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించాడు. ఈ ఘనటలపై మన్నెమాల సుకుమార్‌రెడ్డి సోమవారం అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన నేరపూరితమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు వక్రభాష్యం చెబుతూ టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మున్ముందు ఇంకా చాలా ఉందని, తాను ఎంత దూరమైనా పోతానని ఎమ్మెల్యేను బెదిరించారు. విష్ణు గ్యాంగ్‌ దుశ్చర్యలను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆందోళన చెందుతున్నారు.

నేనేంటో మున్ముందు చూపిస్తా ... ఎమ్మెల్యేకు విష్ణు వార్నింగ్‌
కావలి: ‘నా సంగతి తెలియదేమో.. చెప్తా.. ఇంకా టైముంది.. ఎంత దూరం చెప్పాలో అంత దూరం చెప్తా.. పిచ్చి వాగుడు వాగొద్దు.. నేనేందో చూపిస్తా.. నా సంగతి అందరికీ తెలుసు.. చిన్నచిన్న వాళ్లను పెట్టుకొని పిచ్చి వాగుడు వాగుతూ ప్రచారం చేయవద్దు.. ఇదే ఆఖరి వార్నింగ్‌.. టీడీపీ అధ్యక్షుడు నన్ను గౌరవించి నాకు కావలి టిక్కెట్‌ ఇచ్చాడు’ అంటూ ఎమ్మెల్యే, కావలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వార్నింగ్‌ ఇచ్చి తన నైజాన్ని బయటపెట్టేశాడు. అసాంఘికశక్తులకు అంటకాగుతారని, ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి కుయుక్తులు పన్నుతున్నారని కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గురించి నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని దగదర్తిలో సోమవారం మీడియా ఆయనను ప్రశ్నించగా వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇళ్లల్లోకి ఎందుకుపోతున్నారని తన అహంభావాన్ని చాటుకున్నారు.  

రౌడీయిజాన్ని ప్రజలు హర్షించరు 
కావలి నియోజకవర్గ ప్రజలు రౌడీయిజాన్ని అంగీకరించరు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ముఠా మా పార్టీ నాయకులపై రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అలాగే అల్లూరులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులను రానివ్వకూడదని, వారితో తిరగవద్దని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలనీల్లోని గిరిజనులు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఇలాంటి చర్యల ద్వారా ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవాలనుకోవడం అవివేకం.
కావలి ఎమ్మెల్యే  రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement