గాయపడిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజు
ఓటమి ఖాయమని నిర్థారణకు వచ్చేశారేమో... ఎక్కడికక్కడే అల్లర్లకు తెరతీశారు. ఐదేళ్లపాటు సాగించిన దౌర్జన్యకాండ సరిపోలేదనుకున్నారేమో... ఎన్నికల వేళ తెగ రెచ్చిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడి అనేకచోట్ల పోలింగ్ కేంద్రాల్లో గొడవలకు దిగారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పలుచోట్ల అన్యాయంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అంతేనా... రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని ఓటర్లు తమ ఓటుద్వారా గురువారం చూపించారు. టీడీపీ పూర్తిగా ఓటమి అంచుకు చేరిందని ఓటర్ల ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీ వారికి సైతం అర్థమయ్యింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలన్న కాంక్షతో అలజడులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దొంగ ఓట్లు కూడా వేయించారు. అక్కడికీ శాంతించక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. పోలింగ్‌కు వచ్చిన వారిని సైతం భయపెట్టి సెల్‌ఫోన్‌లు లాక్కుని వెనక్కి పంపించారు. ఇంత చేస్తున్నా తాము ఓటమి పాలౌతున్నామనే బాధనుంచి బయటపడలేకపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు హత్యారాజకీయాలకు తెర తీశారు.
రిగ్గింగ్‌ను అడ్డుకోబోతే...
పోలింగ్ బూత్ నంబర్ 152లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందన్న సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజు గురువారం మధ్యాహ్నం పరిశీలనకు వెళ్లారు. బూత్ వద్దకు చేరుకున్న ఆయన్ను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకుని భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన పరీక్షిత్‌రాజు అక్కడినుంచి వెనక్కి వచ్చేశారు. ఈ విషయాన్ని సాక్షి ప్రతినిధి బోణం గణేష్‌కు పరీక్షిత్‌రాజు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్‌కు తెలియజేశారు. అక్కడ రిగ్గింగ్ జరిగినందున పోలింగ్ నిలిపేసి రీపోలింగ్ జరపాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని కోరేందుకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన భర్త పరీక్షిత్‌తో కలసి పోలింగ్ స్టేషన్‌కు మధ్యాహ్నం వెళ్లారు.
ఆమె రాకను గమనించిన టీడీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసి భర్త డొంకాడ రామకృష్ణ వారిపై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి హతాశురాలైన ఎమ్మెల్యే దంపతులు అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీలు పడలేదు. పథకం ప్రకారం అక్కడకు చేరుకున్న స్థానికులు, మహిళలు వారిపై దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యేను గాయపరిచారు. ఎమ్మెల్యే అనుచరులు, అక్కడున్న కొంతమంది పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించి పరిస్థితి చేయిదాటిపోతుండడంతో తిరిగి పోలింగ్ బూత్‌లోకే పంపించేశారు. కేంద్రాన్ని వందలాది జనం చుట్టుముట్టి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న సాక్షి ప్రతినిధి కూడా పోలింగ్ కేంద్రంలో చిక్కుకున్నారు.
పోలింగ్ సిబ్బందితో పాటు మొత్తం 25 మంది వరకు పోలింగ్ కేంద్రంలో ప్రాణభయంతో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు తన సొంత తమ్ముడి కుమారుడు, కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసి కూడా ఏమాత్రం వారిని రక్షించే ప్రయత్నం చేయకపోగా వారిపై దాడి చేసేలా టీడీపీ కార్యకర్తలను పురిగొల్పారు. ఇదే అదనుగా కార్యకర్తలు గొడ్డళ్లు, కర్రలు, కత్తులు పట్టుకుని పోలింగ్ కేంద్రంపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ కొంతమంది పోలీసు బలగాలను సంఘటనా ప్రాంతానికి పంపించారు. కాని ఎమ్మెల్యే దంపతులను హతమార్చాలనే ప్రణాళికతో ఉన్న టీడీపీ నేతలు ఇతర గ్రామాల నుంచి మరికొందరిని పోలింగ్ కేంద్రం వద్దకు హుటాహుటిన తరలించి ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించారు. పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు మరిన్ని బలగాలను పంపించాలని జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆదేశించారు.
మరోవైపు విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వెంటనే స్పందించి పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతే గాకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లారు. పార్టీ పెద్దలు రాష్ట్ర డీజీపీకి విషయం తెలియజేసి ఎమ్మెల్యే దంపతులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గార్గ్ హుటాహుటిన మరిన్ని బలగాలను తీసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోగానే ఎమ్మెల్యే దంపతులను, వారితో పాటు ఉన్నవారిని హతమార్చేందుకు టీడీపీ నాయకులు పురిగొల్పిన వారి వర్గీయులు పోలింగ్ కేంద్రం తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు.
విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్సీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాదమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు.
సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే
చినమేరంగిలోని తమ ఇంటికి చేరిన ఎమ్మెల్యే దంపతులకు భారీ సంఖ్యలో వారి కార్యకర్తలు, అభిమానులు ఎదురొచ్చి తమ మద్దతు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వవద్దని తమపై ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా సంయమనం పాటించాలని ఎమ్మెల్యే దంపతులు తమ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. పోలీసు, మీడియా ప్రతినిధులు అండగా ఉండబట్టే తాము ప్రాణాలతో బయటపడ్డామని ఈ సందర్భంగా వారు అన్నారు. తమపై హత్యాయత్నానికి జనాన్ని ఉసిగొల్పిన వారెవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా వారిని శిక్షించేలా పోరాడతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment