పచ్చ పన్నాగం.. కుట్ర కేసులు | TDP Plotting Conspiracy Cases On Ysrcp Leaders | Sakshi
Sakshi News home page

పచ్చ పన్నాగం.. కుట్ర కేసులు

Published Thu, Apr 4 2019 11:20 AM | Last Updated on Thu, Apr 4 2019 11:21 AM

TDP Plotting Conspiracy Cases On Ysrcp Leaders - Sakshi

సాక్షి, నెల్లూరు: ఓటమి ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో బెంబేలెత్తిన అధికార పార్టీ అరాచకానికి తెగబడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజుకో కుట్రలతో కొత్త డ్రామాలతో రాజకీయ రగడ సృష్టిస్తోంది. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని అధికారులు, పోలీసుల సాయంతో కేసులు, వేధింపులు, కుట్రల పర్వం కొనసాగిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ డైరెక్షన్‌లో ఓవరాక్షన్‌ మొదలు పెట్టారు.

తాజాగా నెల్లూరు నగర వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌పై ఎడిటింగ్‌ చేసిన వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. అది కూడా ఎడిటింగ్‌ చేసిన వీడియోను మంత్రి నారాయణ క్యాంపు ద్వారా ట్రోల్‌ చేయించి పచ్చ మీడియాలో హడావుడి చేయించారు. అధికారులు దాన్ని గుర్తించి సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చిత్రీకరించారు. గతేడాదిలో ఒక సభలో మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసిన వీడియోపై వాస్తవాలను చూడకుండా హడావుడిగా పోలీసులు కేసు నమోదు చేయడం తీవ్ర చర్చనీయంశంగా మారింది.  

నెల్లూరు నగర అసెంబ్లీ స్థానానికి అధికార పార్టీ నుంచి మంత్రి నారాయణ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే అధికారాన్ని మొత్తం ఉపయోగించి, పోలీసులను, అధికారులను పావులుగా వాడుకుంటూ గెలుపు కోసం అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కుతున్నారు. తెర వెనుక చేరి అభ్యర్థితో తమకు సంబంధం లేనట్లుగా వారితో తీవ్ర అసత్య ప్రచారం చేయిస్తున్నారు. అదే అధికార పార్టీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బెదిరించినా, నానా యాగీ చేసిన పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకుండా పచ్చపాతం చూపిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌ను లక్ష్యంగా కుట్రలు అనేకం చేస్తున్నారు. గత నెలలో అయితే పోలీసులు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు విధులకు ఆటంకం కలిగించారంటూ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు అరెస్ట్‌ చేశారు.

పూర్తిగా మంత్రి నారాయణ కనుసన్నల్లో, నారాయణను గెలిపించటం కోసమే అనే రీతిలో కొందరు పోలీసులు పని చేస్తున్నారు. గతేడాది జవనరి 5వ తేదీన జిల్లా యువజన విభాగం నేతృత్వంలో నగరంలోని టౌన్‌ హల్‌లో సమావేశం జరిగింది. అందులో సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో యువతను ఉత్తేజపరిచేలా మాట్లాడారు.  అందులో ఎక్కడా ఉద్రేక పర్చడం, రెచ్చగొట్టిన వ్యాఖ్యలు లేవు. ఇదంతా జరిగి 15 నెలల క్రితం వ్యవహారం. దీన్ని మంత్రి నారాయణ వర్గం ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటల అర్థం మారేలా పూర్తిగా ఎడిట్‌ చేసి ట్రోల్‌ చేశారు. మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వేదికగా దీనిని అనేక మందికి వాట్సప్‌ ఇతర సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడంతో పాటు బాగా ట్రోల్‌ అయ్యేలా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. నగర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న తెలుగుగంగ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌  ఆ వీడియోను చూసి దానిని నగర డీఎస్పీకి ఫార్వర్డ్‌ చేసినట్లు ఆయన దానిని సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేసినట్లు పక్కాగా చిత్రీకరించారు.

ఇందులో మంత్రి నారాయణ తన కుట్ర బయట పడకుండా ఉండేలా ఈ విధంగా సిద్ధం చేసిన డైరెక్షన్‌లో అందరూ బాగా పనిచేశారు. అయితే కేసు నమోదు చేసే ముందు కనీస విచారణ జరపాలి. ఇప్పుడు మాట్లాడిందా, గతంలో మాట్లాడిందా ఏ సందర్భంలో  మాట్లాడారు. ఇలా అన్ని అంశాలను చూడాలి. మరో వైపు మంగళవారం నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించి ఇదంతా కుట్ర అని ఆధారాలతో సహా మాట్లాడారు. కానీ పోలీసులు ఇవేమి పట్టించుకోకుండా కేసు నమోదు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. జిల్లా పోలీసు చరిత్రలో ఈ తరహాలో వీడియో ఆధారంగా చేసుకొని నమోదు చేసిన కుట్ర కేసు కూడా ఇదే మొదటిది కావడం గమనార్హం. గురువారం నెల్లూరు నగరంలో జగన్‌ ఎన్నికల సభ ఉన్న క్రమంలో ఈ తరహా కుట్రల ద్వారా అడ్డుకోవాలని చూస్తుండడంపై విమర్శలు చెలరేగుతున్నారు.

పట్టాభి వీరంగం చేసినా పోలీసులు నోరుమెదపరు
మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు, షాడో మంత్రిగా నగరంలో పెత్తనం చేస్తున్న పట్టాభి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నానా వీరంగం చేసి, పోలీసుల్ని తిట్టినా మాత్రం నోరు విప్పరు. మార్చి 25వ తేదీన నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఓటర్లకు డబ్బు పంచడానికి డివిజన్లల్లో తిరుగుతున్న క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పట్టాభి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని అక్కడ ఉన్న సిబ్బంది అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం విధులకు ఆటంకం కలిగించారని సదరు స్టేషన్‌ సిబ్బంది ఫిర్యాదు చేయని పరిస్థితి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు వాటి వీడియోలు చూసి సుమోటో కేసు నమోదు చేయించని పరిస్థితి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement