రైతుల నుంచి స్పందన కరువు
సాగునీరు ఎప్పుడిస్తారో చెప్పకుండా కార్యక్రమం నిర్వహించడంపై మండిపాటు
పేలవంగా కార్యక్రమం
పార్టీ నేతలు, అధికారులకే పరిమితం
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమం జిల్లాలో పేలవంగా జరిగింది. సోమవారం జిల్లాలో పలుచోట్ల జరిగిన ఏరువాక కార్యక్రమం కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే పరిమితం అయింది. జిల్లాలో రైతులకు సాగునీరు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ఏరువాక కార్యక్రమంపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో టీడీపీ కార్యకర్తలు నాయకుల మెప్పు కోసం గ్రామాల్లో రైతులను పోగు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో, మరో మంత్రి కొల్లు రవీంద్ర బందరు మండలం చిట్టిపాలెంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముదినేపల్లి మం డలం చిగురుకోటలో ఏరువాక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రైతులు ఆశించిన రీతిలో పాల్గొనలేదు.
ప్రసంగించకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే...
నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో రైతులు ఎవరూ ఏరువాక కార్యక్రమంలో పాల్గొనకపోవటంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసహనం వ్యక్తం చేశారు. రైతులను సమీకరించలేకపోయారంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె ఈ కార్యక్రమంలో ప్రసంగించకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. తిరువూరు నియోజకవర్గం లక్ష్మీపురంలో కూడా ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. నూజివీడు నియోజకవర్గం తూర్పుదిగవల్లిలో అధికారులకే పరిమితమైంది. రైతులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపలేదు.