ఇందిర ‘జలభ్రమ’
- ఐదేళ్లుగా నత్తనడకన పనులు
- వేసిన బోర్లు 873.. పని చేస్తున్నవి వందలోపే..
- విద్యుత్ కనెక్షన్లు, మోటర్ల బిగింపు అంతంతే..
- అమలుకు అడ్డంకిగా..విద్యుత్‌శాఖ తీరు, నిధుల మంజూరు
ఆదిలాబాద్ అర్బన్ : బీడు భూముల్లోనూ రతనాలు పండించవచ్చని ఆశించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. దళితులు, గిరిజనులను సాగుదారులుగా చేయడంతో పాటు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఉపాధి హామీ, నాబార్డు నిధులతో చేపట్టే ఈ కార్యక్రమం ఐదేళ్లు గడచినా నత్తనడకన పనులతో ముందుకు సాగని పరిస్థితి. పలుమార్లు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించినా పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా ఉన్న భూములను కొన్ని బ్లాకులుగా విభజించారు. వీటి ద్వారా ఇందిర జలప్రభ కింద వ్యవసాయ భూముల్లో బోర్లు వేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 18 మండలాల్లో ఈ పథ కం కింద వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకాలు జరిపారు. అధికారులు వేసిన బోర్లలో మొత్తం 873 బోర్ల విజయవంతమై పుష్కలంగా నీళ్లు పడ్డాయి. వీటన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి మోటర్లు బిగించి వ్యవసాయ భూముల్లో సాగు నీరు పారియాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 873 బోర్ల విజయవంతమైతే అందులోంచి 730 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులు విద్యుత్ శాఖకు నివేదించారు.
సంబంధిత అధికారులు కేవలం 587 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగతా 143 బోర్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అధికారుల వద్ద ఉన్న లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన 398 బోర్లకు మాత్రమే మోటర్లు బిగించారు. ఇందులోనూ వందలోపే ప్రస్తుతం పని చేస్తున్నాయని అధికారుల వద్ద సమచారం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.12.75 కోట్లకుపైగా ఖర్చు చేసి దాదాపు 50వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ విద్యుత్ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో జాప్యంతో సాగుదారులుగా మారనున్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కూడా ఈ పథకానికి సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో మరింత వెనుకబడింది. పథకం పూర్తికి ఇంకెంత కాలం పడుతుందని, బీడు భూముల్లో వ్యవసాయం చేసుకునేదెప్పుడోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సాగుదారులుగా మారేదెప్పుడో..
దళిత, గిరిజన రైతులు సాగుదారులుగా మారే పరిస్థితి ఇప్పట్లో కన్పించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకే సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బోర్లు వేసినా.. వాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ కనెక్షన్లు, మోటర్లు బిగించకపోవడంతో పథకం సత్ఫలితాలు కన్పించడం లేదు. సాగునీరందక వ్యవసాయ భూములు సైతం బీడుగా మారి నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ పథకంపై పలుసార్లు చర్చించారు. ముందుగా వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, మోటర్లు బిగించడం వంటి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులు పూర్తయ్యే వరకు కొత్తగా బోర్లు వేయరాదని జిల్లా మంత్రులు గతంలో అధికారులకు సూచించడంతో అప్పటి నుంచి కొత్త బోర్ల తవ్వకాలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ పనులు పూర్తయితేనే మిగతా బోర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు భావించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పథకం ‘ఇందిరా జలభ్రమ’గా మారిందని పలువురు పేర్కొనడం గమనార్హం.