అమలాపురం: మైదానంలో డెల్టా ప్రాంతాలకు.. మెట్టలో సాగునీటి సౌలభ్యమున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొబ్బరి సాగు.. ఇకనుంచీ కొండకోనల్లోనూ జోరుగా సాగనుంది. గిరి సీమల్లో సిరులు కురిపించడం ద్వారా గిరిపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. మొట్టమొదటిగా తూర్పు కనుమల్లో విశాఖ మన్యంలో కొబ్బరి సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీపీసీఆర్‌ఐ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా విశాఖ మన్యంలో 100 ఎకరాలకు సరిపడే కొబ్బరి మొక్కలను గిరి రైతులకు అందించనుంది. అన్నీ సవ్యంగా సాగితే విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొబ్బరిసాగుకు సీపీసీఆర్‌ఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కొండ ప్రాంతాల్లో సాగుకు చేయూత..
కొబ్బరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కేరళే. అక్కడ పశ్చిమ కనుమల విస్తీర్ణం ఎక్కువైనప్పటికీ కొబ్బరి సాగు పెద్దఎత్తున సాగుతుండడం విశేషం. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కేవలం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లోని మైదాన, మెట్ట ప్రాంతాల్లో సుమారు 3.01 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కేరళలో వర్షపు నీటిని నిల్వ చేయడం.. బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేషన్), ఆచ్ఛాదన(మల్చింగ్) విధానాలతో కొండ ప్రాంతాల్లో కొబ్బరిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లను నిర్మించి.. వాటి ద్వారా నీటిని మళ్లించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇదే విధానంతో రాష్ట్రంలోనూ కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కేరళలోని కాసర్‌ఘోడ్‌లోని సీపీసీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం ముందుకొచ్చింది. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పాలెం చౌడప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా విశాఖ మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఎంపిక చేసిన రైతులకు వచ్చేనెలలో ఆరువేల కొబ్బరి మొక్కలను ఉచితంగా అందించనున్నారు. ఎకరాకు 60 మొక్కల చొప్పున వంద ఎకరాల్లో కొబ్బరితోట సాగు చేసేలా గిరిజన రైతులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలతోపాటు కాపు వచ్చేవరకు ఎరువులు, బిందు సేద్యం పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తెస్తారు. కొబ్బరిలో కోకో, పోక, ఏజెన్సీలో సాగు జరిగే కాఫీ, డ్రాగన్ ఫ్రూట్, అనాస వంటి పంటల్నీ సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఇక్కడ సాగు విజయవంతమైతే.. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేస్తారు.
నీరు నిల్వ చేస్తూ.. కొండలపై సాగు చేస్తూ...
కేరళ రైతులు వర్షం రూపంలో పడిన ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నీటిని నిల్వ చేసుకోవడం, దానిని తోటలకు మళ్లించడం ద్వారా అక్కడి రైతులు సముద్ర తీరప్రాంతమైన ఇసుక నేలలు, కొండవాలు ప్రాంతాల్లోనూ కొబ్బరి పంటను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇళ్లు, ఇతర భవంతులపై పడే వర్షపు నీటిని ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులకు మళ్లించి.. దీన్నుంచి డ్రిప్ ద్వారా కొబ్బరి, ఇతర మొక్కలకు నీటిని ప్రవహింపచేస్తున్నారు. ఇదే రీతిలో కొండవాలు ప్రాంతాల్లో పడే వర్షపు నీటిని దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నీరు ట్యాంకులోకి వెళ్లేందుకు అనువుగా గట్లు వేస్తూ.. ట్యాంకులోకి నీరు వెళ్లేచోట అడుగున వెడల్పుగా బ్లాక్‌మెటల్ వేస్తారు. తొలుత ఇళ్లు, భవనాలన ఉంచి వచ్చే నీటిని, తరువాత దిగువన నిర్మించిన ట్యాంకు నీటిని కొబ్బరి సాగుకోసం వినియోగిస్తున్నారు.
దీర్ఘకాలికంగా మంచి ఆదాయం...
ఏజెన్సీలో కొబ్బరిసాగు చేస్తే గిరి రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందుతారు. కాఫీ, మామిడి, జీడి మామిడి కన్నా కొబ్బరి ఎక్కువకాలం పంట. నెలనెలా దిగుబడి రూపంలో ఆదాయం వస్తుంది. కొబ్బరితోపాటు దీనిలో విలువైన అంతర పంటలను కూడా సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాగుకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాం. కేరళ తరహాలోనే బిందు సేద్యం పద్ధతిలో ఏజెన్సీలోనూ కొబ్బరిసాగు చేయవచ్చు.
–పాలెం చౌడప్ప, డైరెక్టర్ సీపీసీఆర్‌ఐ, కాసరఘోడ్, కేరళ
Comments
Please login to add a commentAdd a comment