కష్టాల్లో ముంచేను
కష్టాల్లో ముంచేను
Published Tue, Mar 21 2017 11:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కూతవేటు దూరంలోనే గోదావరి ప్రవహిస్తోంది. పంట కాలువల్లో మాత్రం నీరు అడుగంటుతోంది. ఫలితంగా వరి చేలకు సాగునీరు అందక అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. పంటల్ని గట్టెక్కించేందుకు వంతులవారీ విధానం అమలు చేస్తున్నా.. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లోని శివారు ఆయకట్టుకు నీరందక వరి చేలు ఎండి బీటలు వారుతున్నాయి. వరి దుబ్బులు పొట్ట, ఈనిక దశలో ఉన్న కీలక తరుణంలో సాగునీరు ఇవ్వకపోతే నిండా నష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
యలమంచిలి/ఆచంట : యలమంచిలి మండలం వడ్డిలంక చానల్ పరిధిలోని కాజ బ్రాంచి కాలువపై ఆధారపడిన ఆయకట్టు పరిధిలోని వరి చేలకు వెంటనే సాగునీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కాలువపై ఆధారపడి సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చేలన్నీ ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీటితడి ఇవ్వకపోతే గింజ పాలుపోసుకోక తప్పలుగా మారిపోయే ప్రమాదం ఉందని కలగంపూడి, కాజ తూర్పు గ్రామాలకు చెందిన రైతులు తోటకూర శ్రీనివాసరాజు, గుంటూరు నాగరాజు, పాలంకి వెంకటేశ్వరరావు తదితరులు చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు ఎరువులు, గుళికలు, పురుగు మందులు వాడాల్సి రావడం వల్ల ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అయ్యిందన్నారు. ఇప్పటికిప్పుడు నీరు పెట్టకపోతే కంకులన్నీ చొప్పలుగా మారి పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు చల్లడం, కీలక తరుణంలో నీరు అందకపోవడంతో మందు కసరు కంకుల తలకు ఎక్కి వరి దుబ్బుల ఎగువ చివరి భాగంలో ఎరుపు రంగు వస్తోందని వివరించారు. ఇది ఎక్కువైతే కంకులు పూర్తిగా బయటకు రావని, చేనంతా గడ్డిగా మారిపోతుం దని ఆందోళన చెందుతున్నారు. వంతులవారీ విధానంలో సక్రమంగా నీరివ్వకపోవడమే దీనికి కారణమని వాపోతున్నారు. సాగునీటి కోసం కోసం డెల్టా లస్కర్ ఫోన్ చేస్తుంటే మూడు రోజులు నుంచి స్పందించడం లేదని తెలిపారు. కాలువకు ఎగువన ఉన్న ఆర్యపేట, యలమంచిలి రైతులు వరి మానేసి మినుము, పెసర చల్లుతుంటే తాము కూడా అపరాల సాగు వైపు మొగ్గు చూపామని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇరిగేషన్, వ్యవసాయ అధి కారులు వచ్చి కాలువ పై భూముల్లో సాగు లేదు కాబట్టి దిగువ భూములకు పుష్కలంగా నీరిస్తామని, వరి సాగు చేయాలని చెప్పడంతో నాట్లు వేశామని కాజ తూర్పు, కలగంపూడి గ్రామాల రైతులు వివరించారు. సాగునీటి ఎద్దడి ఏర్పడిన తరుణంలో నీరి వ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఆచంట నియోజకవర్గంలోనూ ఇదే సమస్య
ఆచంట నియోజకవర్గ పరిధిలోనూ ఇదే సమస్య నెలకొంది. ఆచంట మండలం భీమలాపురం, ఆచంట వేమవరం, వల్లూరు గ్రామాల్లో శివారు ఆయకట్టు నీరందటం లేదు. సుమారు 500 ఎకరాల్లో పంట ఎండిపోయే దుస్థితి దాపురించింది. రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. పెనుగొండ మండలం వడలి, రామన్నపాలెం, తామరాడ గ్రామాల్లో ఇప్పటికే వరిచేలు బీటలు వారాయి. ఈ మూడు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట ఎండిపోతోంది. సాగునీరివ్వలంటూ అక్కడి రైతులు రోడ్డెక్కి ఆం దోళనలు చేయగా.. సమస్యను పరిష్కరించాలి్సన ప్రభుత్వం ఆ పని మానేసి సాగునీరు అడిగిన రైతులపై కేసులు నమోదు చేయించింది. ఇదిలావుంటే.. పెనుమంట్ర మండలం ఎస్.ఇలి్లందల పర్రు, మల్లిపూడి, జుత్తిగ గ్రామాల్లోని ఆయకట్టుకు నీరందక 300 ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. మరోవైపు అటు పాలకొల్లు, ఇటు ఆచంట నియోజకవర్గాల పరిధిలో గల పోడూరు మండలంలోని కవిటం, తూర్పుపాలెం, వద్దిపర్రు, గుమ్ములూరు, పెనుమదం గ్రామాల్లోనూ సాగునీటి ఎద్దడి నెలకొంది. పంట పాలుపోసుకునే కీలక దశలో నీటి సమస్య మొదలైంది. మరో 10 రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగితే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగునీరిచ్చి 15 రోజులైంది
యలమంచిలి మండలం కాజ బ్రాంచి కాలువపై ఆధారపడి సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఈ భూములకు సాగునీరిచ్చి 15 రోజులైంది. ప్రస్తుతం చేలన్నీ ఈనిక, పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు నీరు పెట్టకపోతే ఒక్క గింజలో కూడా పాలు గట్టిపడవు. అదే జరిగితే పెట్టిన సొమ్ముంతా నష్టపోతాం. వెంటనే సాగునీరు ఇచ్చి పంటల్ని కాపాడాలి.
– బొక్కా పురుషోత్తం, కౌలు రైతు, కలగంపూడి, యలమంచిలి మండలం
అధికారులు స్పందించడం లేదు
దాళ్వా ప్రారంభంలో అధికార యంత్రాంగమంతా వచ్చి వరి సాగు చేయమని బతిమలాడారు. తీరా సాగు చేశాక నీరందక రైతులంతా అల్లాడుతుంటే ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మేమంతా కలసి పాలకొల్లు లాకుల వద్దకు వెళితే ఒక్క అధికారి కూడా దొరకలేదు. ఫోన్ చేస్తుంటే ఎవరూ తీయడం లేదు.
– చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, రైతు, కాజ, యలమంచిలి మండలం
Advertisement