సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు ముగిశాక ప్రజలపై భారీగా విద్యుత్ చార్జీల భారం పడే ప్రమాదముందని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రూ. 9,970.98 కోట్లకు ఎగబాకిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆదాయ లోటు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించాయి. దీన్ని పూడ్చుకోవడానికి డిస్కం లు ఎన్నికలయ్యాక ‘ట్రూ అప్’పేరుతో చార్జీలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అనుమ తించొద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. గత రెండేళ్లుగా డిస్కంలు కావాలనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదని, దీనివల్ల ఉత్పన్నమైన భారీ ఆదాయ లోటును పూడ్చుకోవడానికి ట్రూ అప్‌ల పేరుతో చార్జీలు పెంచడానికి డిస్కంలకు అధికారం లేదని స్పష్టం చేశాయి. 2018–19కి సంబం ధించి డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక ఆదా య అవసరాల (ఏఆర్‌ఆర్) నివేదికపై సోమ వారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణలో వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని తమ అభ్యంతరాలు, సలహాలు, సూచలను తెలియజేశారు.
సర్‌చార్జీల వాత పెడితే పెట్టుబడులు కష్టం: ఫ్యాప్సీ
క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీల పేరుతో వేస్తున్న కోట్లాది రూపాయల భారాన్ని పరిశ్రమలు భరించలేకపోతున్నా యని, ఇలా అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారుతుందని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ పద్ధతి కింద బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిపే పరిశ్రమలపై యూనిట్‌కు రూ. 2.06 పైసలు చొప్పున అదనపు సర్‌చార్జీలు విధించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి రాక ముందే ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు ఉండేవని, ఇప్పుడు కొత్తగా అదనపు సర్‌చార్జీలను విధించడం సరికాదని ఫ్యాప్సీ ప్రతినిధి టి.సుజాత పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కేటగిరీ సృష్టించి తక్కువ చార్జీలు విధించాలని సూచించారు. ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపై అదనపు సర్‌చార్జీలను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజనీర్ జీవీ మల్లికార్జునరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీలో రైల్వేకు తక్కువ విద్యుత్ చార్జీలున్నాయని, అందువల్ల తెలంగాణలోనూ చార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
అదనపు విద్యుత్ కొనుగోళ్లు ఎందుకు
మిగులు విద్యుత్ ఉందంటూనే మళ్లీ అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్‌రావు ప్రశ్నించారు. రూ. వేల కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంపై డిస్కంలు వివరణ ఇవ్వాలన్నారు. జెన్‌కోలో విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్) 70 శాతానికి తగ్గిందని, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసమే జెన్‌కోలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా 2,300 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవడం వెనక చీకటి కోణాలున్నాయని..అధికారంలో ఉన్న వారికి, ప్రైవేటు డెవలపర్లకు దోచి పెట్టడానికే ఈ సౌర విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రూ.2.50 నుంచి రూ.3లకు యూనిట్ చొప్పున సౌర విద్యుత్ విక్రయించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నా రాష్ట్రంలో రూ. 6 నుంచి రూ. 6.50 ధరతో కొనుగోళ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీంతో 25 ఏళ్లపాటు ప్రజలు దోపిడీకి గురికానున్నారన్నారు.
రైతుల పొలాల్లో బలవంతంగా టవర్లు
పరిహారం చెల్లించకుండానే రైతుల పొలాల్లో బలవంతంగా విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులు తెచ్చిన టెలిగ్రాఫ్ చట్టాన్ని సాకుగా చూపి పొలాల్లో భారీ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ తెలిపారు. కలెక్టర్లు పరిహారం ఇప్పించకపోతే రైతులు ఈఆర్సీలో అప్పీల్ చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment