పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం
నరసాపురం రూరల్ : ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్, బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం లక్ష్మణేశ్వరం గ్రామం నక్కావారిపూటలో మహాత్మా జ్యోతిరావ్ పూలే ఏపీ గురుకుల బాలికల పాఠశాల నూతన ప్రాంగణాన్ని ఆయన డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పేద విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేందుకు గురుకుల విద్యాలయాలు తోడ్పడుతున్నాయని చెప్పారు.
పతి నిరుపేదకూ చదువును అందుబాటులోకి తీసుకువచ్చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్టు తెలిపారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థల సేకరణ చేయాల్సిందిగా స్థానిక ఎమ్యెల్యే బండారు మాధవనాయుడుకు సూచించారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌కు అంచనాలు రూపొందిస్తే సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన విద్యాసామగ్రిని మంత్రి అందించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులందరికీ ఫీజురీయింబర్స్‌మెంటును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ యువత విలువైన కాలాన్ని వృథా చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని దేశానికి మంచి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్‌పర్సన్ రత్నమాల, ఆర్డీవో జె. ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు.