లబ్ధిదారుల సంఖ్యను భారీగా పెంచే యోచనలో సంక్షేమ శాఖలు
ప్రస్తుతం బీసీల్లో ఏటా 300 మందికే అందుతున్న ఆర్థిక సాయం
తీవ్ర డిమాండ్ ఉన్నా.. పరిమిత సంఖ్యలో అమలుతో నిరుత్సాహం
ఎస్టీల్లో 100, ఎస్సీల్లో 210 మంది మాత్రమే... కానీ క్రమంగా పెరుగుతున్న డిమాండ్
దీంతో మూడు సంక్షేమ శాఖలకు అర్హుల సంఖ్య పెంచాలని వినతులు
సీఎం కార్యాలయానికి చేరిన ప్రతిపాదనలు.. అతి త్వరలోనే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.
పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు
విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.
ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment