
మద్య నిషేధం హామీ మరచిన బాబు
► ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ,
► వెఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి
పట్నంబజారు (గుంటూరు) : అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సంతకం సాక్షిగా నేడు రాష్ట్రంలో 40 వేలకు పైగా బెల్టుషాపులు భేషుగ్గా నడుస్తున్నాయని ఆరోపించారు. మద్య నిషేధం ఊసే మరిచి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంచినీరు దొరకని గ్రామాలు ఉన్నాయని కానీ, మద్యం దొరకని పల్లెలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క జిల్లాలో కూడా డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కనీసం మద్యపాన నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో తాజాగా మద్య నిషేధం విధిస్తుంటే మన పాలకులు నిస్సిగ్గుగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని సాక్షాత్తూ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవలే విజయవాడలో మీడియాతో వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వార రూ.10,250 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం అది రూ.12,674 కోట్లకు చేరిందని తెలిపారు.
ఇది చాలదన్నట్లు పేద, మధ్యతరగతి వర్గాలను మరింతగా మద్యం మత్తులో ముంచి లక్షలాది కుటుంబాల ఉసురు తీసేలా టెట్రా ప్యాక్‌లో సరికొత్తగా చీప్ లిక్కర్ ప్రవాహానికి గేట్లు బార్లా తెరవాలని నిర్ణయించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖకు టార్గెట్ పెట్టి మరీ వెయ్యి కోట్ల ఆదాయాన్ని అదనంగా పెంచుకోవాలని చూస్తున్న ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారు. ఈ పద్ధతిని తక్షణం విడనాడాలని వారు హితవు పలికారు. లేదంటే మహిళా లోకం తిరగబడుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలో పోరుబాట పట్టి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు.