
రిలే దీక్ష చేస్తూ మున్సిపల్ కార్మికుడి మృతి
పుట్టపర్తిలో ఘటన
సమ్మెపై సర్కారు మొండి వైఖరి
మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాష్ట్ర సర్కారు మొండి వైఖరి కారణంగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమ్మె ఉధృతరూపం దాల్చుతోంది. పట్టణాల్లో చెత్త సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన కొనసాగించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రిలే నిరాహారదీక్ష చేపట్టిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుడు వెన్నమ నాయుడు(32) గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మద్దతు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో భిక్షాటన, తిరుపతిలో స్కూటర్ ర్యాలీ, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఆందోళనకు లోక్‌సత్తా జిల్లా శాఖ సంఘీభావం తెలిపింది. విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పీడిగ రాజన్నదొర కార్మికులను కలిసి మద్దతు ప్రకటించారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం, సీపీఐ రాష్ర్ట కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ అరెస్టు అయిన కార్మికులను పరామర్శించారు. చర్చల ద్వారా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి: సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో మనకు సంబంధం లేదని, వారిని పనిలో నియమించిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్‌లు, చైర్మన్‌లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు జరిపారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
నేడు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్, మలేషియా, జపాన్‌లపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ సిబ్బందిపై లేదని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) ధ్వజమెత్తింది. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అన్ని మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి తెలిపారు.