
హోరెత్తిన నిరసనలు
విజయవాడ బ్యూరో: సమస్యల సాధన కోసం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో సోమవారం కలెక్టరేట్‌లను ముట్టడించారు. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలతోపాటు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం వంటి నిరసనలు నిర్వహించారు.
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) నిర్ణయించింది. అత్యవసర సేవలైన మంచినీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని యూనియన్‌లు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.