
పోర్టు భూసేకరణం
మచిలీపట్నం : రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి 29 వేల ఎకరాలను స్వాధీనంచేసుకున్న ప్రభుత్వం, బందరు పోర్టు పేరుతో మరో 30 వేల ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. మూడు రోజుల క్రితం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరుల సమావేశంలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించారు. శని వారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మచిలీపట్నం మం డలంతో పాటు పెడన మండలంలో రెండు గ్రామాల్లో భూముల వివరాలను రెవెన్యూ అధికారులు కంప్యూటరీకరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం ఈ నెల 31వ తేదీతో ముగినుంది. ఈ నేపథ్యంలో తొలి విడత 18 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్‌ను జారీ చేయనుందని తెలుస్తోంది.
30 వేల ఎకరాలు అవసరమా!
బందరు పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఫిబ్రవరిలో ప్రభుత్వానికి కలెక్టర్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. 524 ఎకరాలు పోర్టు భూములు ఉండగా మిగిలిన 4,800 ఎకరాలు ప్రైవేటు, ప్రభుత్వ భూమిని సేకరించాలని అధికారులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా పక్కనపెట్టారు. భూసేకరణ చట్టం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండటంతో తమ పంథాను మార్చుకున్న పాలకులు ఏకంగా 30వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించి రెవెన్యూ అధికారులను పరుగులు పెట్టించడం వెనుక ఏదో మతలబు ఉందనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది.
19 గ్రామాల్లో...
బందరు మండలంలోని పల్లెతుమ్మలపాలెం, రుద్రవరం, గుండుపాలెం, బందరువెస్ట్, పోలాటితిప్ప, గోకవరం, మంగినపూడి, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, పోతేపల్లి, కరగ్రహారం, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, చిలకలపూడి, గోపువానిపాలెం, కోన, పెడన మండలంలో కాకర్లమూడి, నందమూరులో 30 వేల ఎకరాల సేకర ణకు రెవెన్యూ అధికారులు రికార్డులు రూపొంది చేస్తున్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలను ఆర్డీవో కార్యాలయానికి రప్పించి ఆయా గ్రామాల్లో భూముల సర్వే నంబర్లు, అనుభవదారులు వివరాలు, ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా అన్న సమచారం నమోదు చేస్తున్నారు. 24 గంటల్లో ఈ వివరాలు సేకరించి తమకు అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావటంతో రెవెన్యూ సిబ్బంది యుద్ధప్రాతి పదికన ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. తొలి విడతలో 18 వేల ఎకరాలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని బందరు ఆర్డీవో పి.సాయిబాబు ‘సాక్షి’కి తెలిపారు.
మడ అడవుల్లో పరిశ్రమలా..!
బందరు మండలంలో సముద్రతీరం వెంబడి వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో మడ అడవులు ఉన్నాయి. ఈ అడవులను దాటి మరికొంత ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) పరిధిలో ఉంది. తుపానులు సంభవించినప్పుడు తీరప్రాంత గ్రామాలు ముంపుబారిన పడకుండా మడ అడవులు రక్షణ కవచంగా పనిచేస్తున్నాయి. సరైన రవాణా వసతిలేని, సముద్రం ఆటు, పోట్లకు గురయ్యే ఈ చిత్తడి నేలల్లో పరిశ్రమలు స్థాపించి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందువస్తారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. స్థాపించే పరిశ్రమలు ఏవి, వాటికి ఎన్ని ఎకరాలు కావాలి అన్న వివరాలు లేకుండా భూసేకరణ చేస్తామని పాలకులు ప్రకటించడం, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అభిప్రాయం తీసుకోరా అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు.