ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యం
కైకలూరు :
ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక సీఎన్నార్ గార్డెన్‌లో శనివారం 12వ ఆక్వా టెక్ ఎక్స్‌ఫో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ ఆక్వా మందులు, యంత్ర పరికరాల తయారీ కంపెనీలు 50 స్టాల్స్‌లో ఉత్పత్తులను ప్రదర్శించాయి. కైకలూరు ఆక్వా మందుల దుకాణదారులు ఏర్పాటు చేసిన చేప వంటకాలు ఆకట్టుకున్నాయి. మంత్రి రవీంద్ర స్టాల్స్‌ను పరిశీలించారు. ఆక్వా టెక్ చీఫ్ ఎడిటర్ కోనా జోసఫ్ ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల రైతులతో సమీక్ష జరిపారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చేపల రైతులకు రెండు హెక్టార్లకు రూ.3.75కే విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ జలాల కారణంగా కొల్లేరు సరస్సులో సహజసిద్ధ చేపలు మరణిస్తున్నాయన్నారు. రిజర్వాయర్లలో విడిచిపెట్టే చేప పిల్లల టెండర్లలో అవినీతిని అరికట్టాలని మంత్రిని కోరారు. అంతకు ముందు జరిగిన ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని కోరారు. గుడివాడకు చెందిన రొయ్యల రైతు కనుమూరి భాస్కరరాజు, ముదినేపల్లికి చెందిన చేపల రైతు రావిశెట్టి హనుమంతరావులకు ఉత్తమ ఆక్వా రైతు అవార్డులను మంత్రి అందించారు. చీఫ్ ఆర్గనైజర్ జోసఫ్ మాట్లాడుతూ ఆక్వా టెక్ మాసపత్రిక ద్వారా చేపల రైతులకు విలువైన సమాచారం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్రామయ్య, కైకలూరు, మచిలీపట్నం జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి, లక్ష్మణప్రసాద్, ఎంపీపీ బండి సత్యవతి, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, సభ్యులు చింతపల్లి అంకినీడు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్‌పర్సన్ వీరరాజరాజేశ్వరీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాజు, కైకలూరు సర్పంచ్ అప్పారావు, సీఐఎఫ్‌ఏ అధికారి గిరి, ప్రొఫెసర్ పి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.