మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్‌గా ఏపీ
ఎగుమతయ్యే మత్స్య ఉత్పత్తుల్లో 36 శాతం ఏపీ నుంచే
ఆంధ్రప్రదేశ్ తర్వాతే తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలు
2014–19 మధ్య రాష్ట్రం నుంచి ఏటా సగటున 2.28 లక్షల టన్నులు ఎగుమతి
ఏటా సగటున రూ. 13 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జన
2019–24 మధ్య ఏటా 3.15 లక్షల టన్నులు ఎగుమతి.. ఏటా రూ.18 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జన
ఆక్వా కల్చర్ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమే కారణం
ఆక్వా రంగానికి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏపీ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో రికార్డులు తిరగరాస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో విస్తీర్ణం, దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో మూడొంతులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళ్తున్నాయి.
ఆక్వా రంగానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో రికార్డులు తిరగరాస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విస్తీర్ణం, దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో మూడొంతులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళ్తున్నాయి. 2014–19 మధ్యలో జాతీయస్థాయిలో రూ.1.93 లక్షల కోట్ల విలువైన 59 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతయ్యాయి.
ఆ సమయంలో ఏపీ నుంచి ఏటా సగటున రూ.13 వేల కోట్ల విలువైన 2.28 లక్షల టన్నులు ఎగుమతి జరిగింది. అంటే అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో రూ.65,312 కోట్ల విలువైన సుమారు 11 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగుమతులు రికార్డు స్థాయికి పెరిగాయి. 2019–24 మధ్య జాతీయ స్థాయిలో రూ.2.72 లక్షల కోట్ల విలువైన 73 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవగా.., అదే సమయంలో ఏపీ నుంచి కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదురొడ్డి మరీ ఏటా సగటున రూ.18 వేల కోట్ల విలువైన 3.15 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయి.
ఆ ఐదేళ్లలో సుమారు రూ.90,234 కోట్ల విలువైన 15.74 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2014 నుంచి 2019 మధ్య బాబు ప్రభుత్వ హయాంలో పెరిగిన ఎగుమతుల విలువ రూ.1,154 కోట్లు కాగా.., వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఏకంగా రూ.4,524 కోట్ల మేర ఎగుమతులు పెరిగాయి. అంటే మత్స్య ఎగుమతులు దాదాపు మూడింతలు పెరిగాయి. ఏపీ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్)కే జరిగాయి.
12.74 శాతం చైనాకు, 4.54 శాతం యూరోపియన్ దేశాలకు, 3.51 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 2.92 శాతం సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు జరిగాయని ఎంపెడా ప్రకటించింది. ఫ్రోజెన్ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20 శాతం ఏపీ నుంచే జరగడం గమనార్హం.
అందనంత ఎత్తులో ‘ఏపీ’
మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరే రాష్ట్రానికి అందనంత ఎత్తులో ఉంది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక్క ఏపీ వాటానే 36 శాతం. రెండో స్థానంలో ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల వాటా 13 శాతం. 10 శాతంతో గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఎగుమతుల విలువ చూస్తే 24 శాతంతో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ది 18 శాతం.
కేరళ వాటా 14 శాతం. జాతీయ స్థాయిలో జరిగిన ఎగుమతుల్లో 29.7 శాతం ఉత్పత్తులు విశాఖపట్నం నుంచే జరిగాయి. 2014–19 మధ్య ఏపీ నుంచి జాతీయ స్థాయిలో రూ.53 వేల కోట్ల మత్స్య ఉత్పత్తులు ఎగుమతవగా, 2019–24 మధ్య ఏకంగా రూ.76 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహం
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా), ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్టులను తీసుకొచ్చింది.
రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి చెరువుల్లో, 54 వేల హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్ విస్తీర్ణం ఉండగా, 1.75 లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39 లక్షల నుంచి 51 లక్షల టన్నులకు పెరగ్గా, రొయ్యల దిగుబడులు 4.54 లక్షల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment