మంత్రిపై తమ్ముళ్ల గుర్రు
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పి.నారాయణపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. తమనెవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వెళుతున్నారని సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర తనకు ఉన్న పలుకుబడితో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌చార్జిలను పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల తరువాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు ముందు వరకు శాసనసభలో, శాసన మండలిలో కానీ సభ్యత్వం లేని నారాయణకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జిల్లా పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో నిస్సహాయులైన వారంతా చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదించక తప్పలేదు.
ఇదే సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదివిని దక్కించుకునేందుకు నారాయణ వేసిన ఎత్తులను టీడీపీ జిల్లా నాయకులు కొందరు గండికొట్టారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరిగిన రోజునే నారాయణను రాజధాని కమిటీ కో-ఆర్డినేటర్‌గా నియమించి చంద్రబాబు బాసటగా నిలిచారు. దీంతో నారాయణను నేరుగా ఇప్పుటికిప్పుడే ఢీకొట్టలేమని ఆ పార్టీ నాయకులు అవకాశం కోసం ఎదురుచూశారు.
ఇప్పుడు అటువంటి అవకాశం రావడంతో తమ్ముళ్లు కొందరు మంత్రిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలిసింది. రెండు రోజులు కిందట మంత్రి నారాయణ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో జరిపిన పర్యటనను కొందరు నాయకులు అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి బీద మస్తాన్‌రావుకు సమాచారం లేకుండానే మంత్రి ఈ రెండు నియోజకవర్గాల్లో అధికారిక పర్యటన జరపడం ఆ పార్టీలో దుమారం రేపింది.
ఈ రెండు చోట్ల మంత్రి వెంట అధికారులే కీలకంగా వ్యవహరించారు. జలదంకి మండలంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వర్గీయులు మంత్రి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. కావలిలో కొంత మంది టీడీపీ నాయకులు మంత్రి వెంట ఉన్నారు. అయితే మంత్రి వెంట వెళ్లిన వారిపై బీద మస్తాన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆరు నెలలుగా పార్టీలో లోలోపల జరుగుతున్న అసంతృప్తి జ్వాలలు ఎన్నో రోజులు దాగే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
అదే విధంగా మంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రస్తుతానికి నోరు మెదపడంలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో శాసన మండలిలో కొన్ని ఖాళీలు రానున్న నేపథ్యంలోనే ఆయన మౌనానికి కారణమని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వాటిలో స్థానం సంపాదించుకోవడం కోసం సోమిరెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
అందులో భాగంగానే ఇటీవల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను తన నివాసానికి పిలిపించుకుని మర్యాదలు చేశారని టీడీపీ నాయకులు కొందరు చర్చించుకుంటున్నారు. పదవి వచ్చేంత వరకు సోమిరెడ్డి తన వర్గీయులు ఎక్కడా నోరు జారకుండా కట్టడి చేసినట్లు సమాచారం. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అవకాశం ఆశిస్తున్నారు.
ఇక ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, బల్లి దుర్గా ప్రసాద్, పరసారత్నం తదితర నాయకులకు కూడా ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని ఆశిస్తున్న వారే. అందుకే వీరంతా మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పదవుల పందేరం పూర్తయ్యాక మంత్రి నారాయణపై బహిరంగంగానే తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.