అమ్మ సన్నిధిలో అరాచకశక్తి!
► ఇంద్రకీలాద్రిపై ‘చంటి’ హవా
► మంత్రి ఉమా అండదండలు
► నిబంధనలకు విరుద్ధంగా దుకాణం
► దేవస్థానం విషయాల్లో జోక్యం
సాక్షి, విజయవాడ : విజ్ఞానయాత్ర నుంచి తిరిగొస్తూ విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన అధికార తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి)పై అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. నగర మహిళలు, మహిళా సంఘాలతోపాటు దుర్గమ్మ భక్తులు కూడా ఆయన ప్రవర్తనను ఖండిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై చంటి హవా నడుస్తుండడంతో అమ్మవారి సన్నిధిలో ఇలాంటి అరాచకశక్తులు ఉండడంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మ సన్నిధిలో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నందున భవిష్యత్తులో ఉమ్మడి చంటి కొండపై వ్యాపారం చేయకుండా నిషేధించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి ఉమా అండదండలు
మహిళతో అసభ్యంగా వ్యవహరించిన ఉమ్మడి చంటికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై జరిగే ప్రతి వ్యవహారంలోనూ చంటి జోక్యం చేసుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొండకు ఎప్పుడొచ్చినా ఆయన పక్కనే ఉండడంతో చంటి అంటే దేవస్థానం సిబ్బంది భయపడతారు. దేవస్థానంలో ఆయనకు ఒక దుకాణం ఉంది. ఆయన బినామీలకు మరో రెండు దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అన్నప్రసాదానికి వెళ్లే మార్గంలో ఉమ్మడి చంటికి సంబంధించిన వ్యక్తి దుకాణం కాలపరిమితి ముగిసినా తొలగించకుండా మంత్రి ఉమాతో ఈవోపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా పక్కనే ఉన్న దుకాణదారుడు ఇబ్బందిపడ్డాడు. ఆ దుకాణదారుడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు బంధువు కావడంతో ఆయన నేరుగా జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాతా దుకాణం తీసివేసినా అక్కడ విక్రయాలు చేయించడం మాత్రం చంటి అనుచరులు ఆపలేదు.
అధికార పార్టీ నేతలు రాగానే
ఎంపీ కేశినేని నాని, టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఇంద్రకీలాద్రిపైకి రాగానే ఉమ్మడి చంటి హడావుడి ప్రారంభమవుతుందని సిబ్బంది చెబుతున్నా రు. వారికి ఆలయ మర్యాదలు ఏవిధంగా చేయాలో దేవస్థానం సిబ్బందికి చెబుతూ నేతల దృష్టిని ఆకర్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ పరపతినే పెట్టుబడిగా పెట్టుకుని దేవస్థానంలోని ప్రతి టెండర్‌లోనూ తన మార్కు ఉండేలా, తాను సూచించినవారికే టెండర్లు దక్కే విధంగా ప్రయత్నిస్తారని సమాచారం. ముఖ్యంగా హాకర్లకు దుకాణాల కేటాయింపులో జోక్యం చేసుకుని వారి ద్వారా నాలుగురాళ్లు సంపాదించి అధికారపార్టీ నేతలకు అందిస్తారని సమాచారం.
తనకు ఇష్టం లేని సిబ్బంది, అధికారుల గురించి మంత్రి ఉమాతోపాటు ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి అధికారులకు వార్నింగ్‌లు ఇప్పిస్తారనే ఆరోపణలున్నాయి. దేవస్థానంలో చీమ చిటుక్కుమన్నా ఆ కబుర్లను చేరవేయడంతో ప్రజాప్రతినిధులు కూడా చంటికి ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది. ఆయన హవా ఇంద్రకీలాద్రిపై పూర్తిగా సాగుతోందని అంటున్నారు. మహిళల్ని వేధించే ఇటువంటి అరాచకశక్తులను ఇప్పటికైనా ఇంద్రకీలాద్రిపైకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.