Minister devineni umamaheswara rao
-
మంత్రి ఇలాకాలో మైనింగ్ మాఫియా
-
రైతులంటే అంత చులకనా?
మండపేట: వరి సాగు చేసే రైతులు సోమరిపోతులంటూ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. ‘ఎండనక, వాననక, రేయనక, పగలనక, ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర నేతలు కొవ్వూరి త్రినాథరెడ్డి, వెంకటేశ్వరరావు, రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వరి, సుబాబుల్ పండించే రైతులు సోమరిపోతులంటూ మంత్రి ఉమ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. త్రినాథరెడ్డి మాట్లాడుతూ, గతంలో వ్యవసాయం దండగని చెప్పిన సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో వరిసాగు నానాటికీ తగ్గిపోతోందని, ఖరీఫ్‌లో 17.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను 14.33 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని చెప్పారు. రబీలో 8 లక్షల హెక్టార్లలో సాగుకు వీలుండగా 5.7 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారన్నారు. ఈ పరిస్థితి పాడి, పౌల్ట్రీ, రైస్, తవుడు మిల్లులు, చేపల పెంపకం తదితర అనుబంధ పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తోందని త్రినాథరెడ్డి వివరించారు. వరికి బదులుగా డెల్టా భూముల్లో మెట్ట భూముల్లో పండించే పంటలను పండించాలని మంత్రి ఉమ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికే కంది, పెసలు, మినుము, సుబాబుల్, యూకలిప్టస్ తదితర పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు అగచాట్లు పడుతున్నారన్నారు. ప్రకాశం కుడి కాలువ పరిధిలో నాలుగేళ్లుగా పంటలు లేవని, ఎడమ కాలువలోను సాగు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ, రైతులు వరి పండించడం మానేస్తారని, ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అన్నదాతలను మోసగించేవిధంగా చంద్రబాబు సర్కారు పని చేస్తోందని అన్నారు. రాజుబాబు మాట్లాడుతూ, రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చులకన భావనను అందరూ గమనించాలన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి ఉమను డిమాండ్ చేశారు. సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి (చినకాపు), పార్టీ నాయకులు మహంతి అసిరినాయుడు, శెట్టి నాగేశ్వరరావు, తాడి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రాజెక్టుల్లో బాబు మనిషే ప్రధాన కాంట్రాక్టర్
దేవినేనిపై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రధాన కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనిషేనన్న విషయాన్ని పక్కనపెట్టి, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ జలదీక్ష చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేయడం తగదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ దీక్ష పట్ల దేవినేని అక్కసు వెళ్లగక్కడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రధాన కాంట్రాక్టరైన నవయుగ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి కాదా? ఆయనకు అవసరమైనవి సమకూర్చేది, విమానం ఏర్పాటు చేసేది వారి డబ్బుతోనే కదా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, దేవినేనికి దమ్ముంటే కేసీఆర్‌పై పోరాడి పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని ఆయన సవాలు విసిరారు. ఎంపీ మిథున్‌రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుల్లో రూ. వేల కోట్ల కాంట్రాక్టులు జగన్ ఇప్పించారని దేవినేని అబద్ధపు విమర్శలు చేయడం దుర్మార్గమని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. తాము చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైతం తాము రోడ్డు నిర్మాణ పనులు, హంద్రీ-నీవా సుజల స్రవంతిలో మూడు ప్యాకేజీల పనులు చేస్తున్నామని.. అలాగని సీఎంతో లాలూచీ పడినట్లా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. -
అమ్మ సన్నిధిలో అరాచకశక్తి!
► ఇంద్రకీలాద్రిపై ‘చంటి’ హవా ► మంత్రి ఉమా అండదండలు ► నిబంధనలకు విరుద్ధంగా దుకాణం ► దేవస్థానం విషయాల్లో జోక్యం సాక్షి, విజయవాడ : విజ్ఞానయాత్ర నుంచి తిరిగొస్తూ విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన అధికార తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి)పై అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. నగర మహిళలు, మహిళా సంఘాలతోపాటు దుర్గమ్మ భక్తులు కూడా ఆయన ప్రవర్తనను ఖండిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై చంటి హవా నడుస్తుండడంతో అమ్మవారి సన్నిధిలో ఇలాంటి అరాచకశక్తులు ఉండడంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మ సన్నిధిలో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నందున భవిష్యత్తులో ఉమ్మడి చంటి కొండపై వ్యాపారం చేయకుండా నిషేధించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఉమా అండదండలు మహిళతో అసభ్యంగా వ్యవహరించిన ఉమ్మడి చంటికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై జరిగే ప్రతి వ్యవహారంలోనూ చంటి జోక్యం చేసుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొండకు ఎప్పుడొచ్చినా ఆయన పక్కనే ఉండడంతో చంటి అంటే దేవస్థానం సిబ్బంది భయపడతారు. దేవస్థానంలో ఆయనకు ఒక దుకాణం ఉంది. ఆయన బినామీలకు మరో రెండు దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అన్నప్రసాదానికి వెళ్లే మార్గంలో ఉమ్మడి చంటికి సంబంధించిన వ్యక్తి దుకాణం కాలపరిమితి ముగిసినా తొలగించకుండా మంత్రి ఉమాతో ఈవోపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా పక్కనే ఉన్న దుకాణదారుడు ఇబ్బందిపడ్డాడు. ఆ దుకాణదారుడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు బంధువు కావడంతో ఆయన నేరుగా జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాతా దుకాణం తీసివేసినా అక్కడ విక్రయాలు చేయించడం మాత్రం చంటి అనుచరులు ఆపలేదు. అధికార పార్టీ నేతలు రాగానే ఎంపీ కేశినేని నాని, టీడీపీకి చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఇంద్రకీలాద్రిపైకి రాగానే ఉమ్మడి చంటి హడావుడి ప్రారంభమవుతుందని సిబ్బంది చెబుతున్నా రు. వారికి ఆలయ మర్యాదలు ఏవిధంగా చేయాలో దేవస్థానం సిబ్బందికి చెబుతూ నేతల దృష్టిని ఆకర్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ పరపతినే పెట్టుబడిగా పెట్టుకుని దేవస్థానంలోని ప్రతి టెండర్లోనూ తన మార్కు ఉండేలా, తాను సూచించినవారికే టెండర్లు దక్కే విధంగా ప్రయత్నిస్తారని సమాచారం. ముఖ్యంగా హాకర్లకు దుకాణాల కేటాయింపులో జోక్యం చేసుకుని వారి ద్వారా నాలుగురాళ్లు సంపాదించి అధికారపార్టీ నేతలకు అందిస్తారని సమాచారం. తనకు ఇష్టం లేని సిబ్బంది, అధికారుల గురించి మంత్రి ఉమాతోపాటు ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి అధికారులకు వార్నింగ్‌లు ఇప్పిస్తారనే ఆరోపణలున్నాయి. దేవస్థానంలో చీమ చిటుక్కుమన్నా ఆ కబుర్లను చేరవేయడంతో ప్రజాప్రతినిధులు కూడా చంటికి ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది. ఆయన హవా ఇంద్రకీలాద్రిపై పూర్తిగా సాగుతోందని అంటున్నారు. మహిళల్ని వేధించే ఇటువంటి అరాచకశక్తులను ఇప్పటికైనా ఇంద్రకీలాద్రిపైకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
చెక్‌డ్యామ్‌ల ద్వారా వృథా నీటి నిల్వ
మంత్రి ఉమా విజయవాడ : సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని చెక్‌డ్యాం నిర్మాణాల ద్వారా నిల్వ చేయటానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన నిపుణుల కమిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజీ దిగువన పాత రైల్వే పిల్లర్స్ వద్ద యనమలకుదురు ఐల్యాండ్‌లో నీటి నిల్వ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. దీనిపై సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు నిర్మించబోయే చెక్‌డ్యాం నిర్మాణానికి, అప్రాన్కు ఎటువంటి నష్టం కలుగకుండా నిర్మాణం చేపట్టే విధంగా పరిశీలిస్తున్నామన్నారు. 2009లో వచ్చిన వరదల వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్లకు, అప్రాన్కు నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం బ్యారేజీ గేట్లు, అప్రాన్కు మరమ్మతులు నిర్విహ స్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని పుష్కరాల నాటికి విద్యుద్దీపాలతో అలంకరించి ఐకాన్‌గా నిలుపుతామన్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీరు వై.ఎస్.సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీరు సి.రామకృష్ణ, నిపుణుల కమిటీ సభ్యులు ఐ.ఎస్.ఎన్.రాజు, చెరుకూరి వీరయ్య, రోశయ్య పాల్గొన్నారు. -
చిన్న చిన్న పొరపాట్లు వాస్తవమే
► ఉమాతో పోరు లేదు ► బ్రహ్మయ్య లింగం చెరువు అభివృద్ధికి చర్యలు ► ఎమ్మెల్యే వంశీ వెల్లడి గన్నవరం : గన్నవరం-ఆగిరిపల్లి మండలాల మధ్య ఉన్న బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. ‘మట్టి పోరు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్థానిక తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. చెరువులో మట్టి తవ్వకాల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, తనకు ఎటువంటి పోరూ లేదన్నారు. చెరువులో పూడికలను తొలగించి, ఆక్రమణలను ప్రక్షాళన చేయటం, గ ట్లను బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రస్తుతం పనులు చేపట్టామని తెలిపారు. దీనిని రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు సీఎంతో పాటు మంత్రి ఉమా అంగీకరించారని చెప్పారు. పుష్కరాలకు రోడ్ల నిర్మాణం... రానున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జక్కంపూడి నుంచి గొల్లనపల్లి వరకు పోలవరం కాలువ కట్టపై నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని వంశీ తెలిపారు. పాయకాపురం వైపుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ముస్తాబాద మీదుగా కేసరపల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు విస్తరణకు రూ.21 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. -
రెండు గంటలు ట్రాఫిక్ స్తంభన
ప్రకాశం బ్యారేజీపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు నరకం అనుభవించారు. బ్యారేజీని పరిశీలించేందుకు వంశధార ట్రిబ్యునల్కమిటీ సభ్యులు రావడంతో కొద్దిసేపు ఇరువైపులా రాకపోకలు నిలిపివేశారు. కమిటీ పరిశీలన అనంతరం వాహనాలను వదలడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. కమిటీ సభ్యులు, మంత్రి దేవినేని ఉమా వాహనాలతో పాటు అంబులెన్స కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. రెండు గంటలు ట్రాఫిక్ స్తంభన ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక అంబులెన్స్‌లో మహిళ ప్రసవ వేదన అనుభవించింది. అయినా.. పోలీసులు అరగంట వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేయలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ సతీష్ చంద్ర , మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్నారు. -
చింతమనేనికి ముఖ్యమంత్రి రక్ష!
తహసీల్దార్‌పై దాడి కేసును నీరుగార్చే యత్నం * పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు * మంత్రి ఉమ రాజీయత్నాలు సాక్షి, విజయవాడ బ్యూరో: ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి వ్యవహారం రోజురోజుకీ ఉద్ధృత రూపం దాలుస్తుండడం, ప్రభుత్వం పరువు బజారున పడడంతో సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బయటపడేసేందుకు రక్షగా నిలిచిన బాబు అధికారులను దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దాలని మంత్రి దేవినేని ఉమకు సీఎం బాధ్యతలు అప్పగించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి ఉమ శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నేతలు మోడల్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి ఉమతో చర్చల్లో పాల్గొన్నారు. వనజాక్షికి నచ్చజెప్పి కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. పుష్కరాల విధులకు హాజరు కావాలని, ఆందోళన విరమించాలనే ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆందోళన విరమించాలి: మంత్రి ఉమ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని దేవినేని ఉమ మీడియాతో అన్నారు. తహసీల్దార్‌పై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు. చర్చల్లో రెవెన్యూ అసోసియేషన్ నేతలు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టారు. చింతమనేని అరెస్టు, ఆయన అనుచరుల అరెస్టు, సంఘటన స్థలంలో ఉండి మహిళా అధికారిపై దాడి జరుగుతున్నా పట్టించుకోని ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్ చేశారు. చింతమనేని అరెస్టు మినహా మిగిలిన రెండు డిమాండ్లను నెరవేర్చేందుకు మంత్రి.. కృష్ణా, పశ్చిమ గోదావరి ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. చింతమనేనిని అరెస్టు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. సోమవారం వరకు ఆగాలని, సీఎం నిర్ణయం తీసుకుంటారని ఉమ నచ్చజెప్పారు. సోమవారం రండి మాట్లాడుకుందాం జరిగిన ఘటనపై సోమవారం మాట్లాడుకుందామని, హైదరాబాద్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు సూచించినట్లు సమాచారం. బాధితురాలు వనజాక్షి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ఆయన వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా, మహిళా అధికారిపై దౌర్జన్యం చేసిన ఘటనలో ముసునూరు పోలీస్ స్టేషన్లో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైన సంగతి తెల్సిందే. నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పటికీ చింతమనేనిని అరెస్టు చేయకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు దాటవేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వనజాక్షిపై దాడికి నిరసనగా కృష్ణా జిల్లాలో అన్ని తహసీల్దార్ కార్యాలయాకు శుక్రవారం తాళాలు వేశారు. సోమవారం నాటికి చింతమనేనిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు వనజాక్షిపై చింతమనేని దాడి ఘటనపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగ సంఘాలు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలు చింతమనేనిని అరెస్టు చేసి విప్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. -
ఆందోళన తీవ్రతరం
పట్టుబిగించిన రెవెన్యూ ఉద్యోగులు చింతమనేని అరెస్ట్‌కు డిమాండ్ మంత్రి ఉమాతో చర్చలు విఫలం సోమవారం చర్చిద్దామన్న సీఎం జిల్లాలో స్తంభించిన పాలన విజయవాడ : తహశీల్దార్ వనజాక్షిపై దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన జరిపారు. నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బందరు కలెక్టరేట్‌ను మూసివేసి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందీ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని ఆందోళనకు మద్దతు ప్రకటించారు. నగరంలో హడావుడి నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రెవెన్యూ ఉద్యోగులు, ఎన్జీవో నాయకులు హడావుడి చేశారు. ఉదయం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఏపీఆర్ఎస్ఏ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇంద్రకీలాద్రి వద్ద ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్‌హౌస్‌కు తహశీల్దార్ వనజాక్షి, ఇతర తహశీల్దార్లు, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు చర్చలు జరిగాయి. వనజాక్షిని అవమానించి, ఆమెపై దాడిచేసిన చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందేనని ఉద్యోగులు తేల్చిచెప్పారు. మంత్రి ఉమాతో చర్చలు విఫలం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఏపీఆర్ఎస్ఏ, ఎన్జీవో నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చింతమనేని ప్రభాకర్‌తో పాటు తహశీల్దార్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే అంగరక్షకులు, అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనను చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించిన ముసునూరు ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే, ఇందులో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులను అరెస్ట్ చేసేందుకు, ఎస్ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకుమ మాత్రమే మంత్రి హామీ ఇవ్వడంతో చర్యలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లు శుక్రవారం సాయంత్రానికి అమలు కావాలని యూనియన్ నేతలు మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే అరెస్ట్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సీఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వనజాక్షి, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజుతో కూడా జరిగిన సంఘటనపై సీఎంతో మాట్లాడారు. దాడిని ఖండించిన ఆయన ఇటువంటి సంఘటనలు బాధాకరమన్నారు. దీనిపై తాను సోమవారం చర్చిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం నుంచి ఆందోళన ఉధృతం శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం నుంచి ఆందోళనా కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. అయితే, ముఖ్యమంత్రి సోమవారం అసోసియేషన్‌తో చర్చించేందుకు హామీ ఇచ్చినందున అంతవరకు వేచి చూడాలనే ధోరణి ఉద్యోగ సంఘాల నేతల్లో ఉంది. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వేదన తహశీల్దార్లో ఉన్నట్లు మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద శుక్రవారం రెండు గంటల పాటు జరిగిన పరిణామం స్పష్టం చేసింది. మంత్రి దేవినేనితో చర్చలు విఫలం కాగానే బయటకు వచ్చిన వనజాక్షి నేరుగా కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కారు తలుపు రాకపోవడంతో ఏపీఆర్ఎస్ఏ నాయకులు వనజాక్షికి నచ్చజెప్పి మీడియాతో మాట్లాడించారు. చర్చల్లో మంత్రి వ్యవహరించిన తీరు నచ్చక ఆమె బాధతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడి ఉద్యమ నాయకులు ఆమెను వారించి అందరితో పాటు తీసుకువెళ్లారు. -
మంత్రి ఉమాకు ‘నీరు-చెట్టు’ ముడుపులు
మహిళా తహశీల్దార్‌పై దాడి సిగ్గుమాలిన చర్య దాడి చేసిన ఎమ్మెల్యే సహా అందరిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విజయవాడ : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో రోజువారీ ముడుపులు అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలసు పార్థసారథి విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారికి మంత్రి ఉమా ప్రత్యక్షంగా కొమ్ముకాస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్థసారథి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముసునూరు మండల తహశీ ల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీధి రౌడీ తరహాలో దాడి చేయటం సిగ్గుమాలిన చర్యని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు నిసిగ్గుగా ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడి అందరినీ బెదిరిస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ ఎంపీ ఒకరు దేశాన్ని రక్షించే సైన్యాన్ని కించపరిచేలా సిగ్గులేకుండా మాట్లాడారని, నేడు ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్ అక్రమాలను అడ్డుకోవడానికి వెళ్లిన తహశీల్దార్‌పై దాడిచేయడం గర్హనీయమన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం అవినీతిమయంగా మారిందని తాము కలెక్టర్‌కు విన్నవించినా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా పనిచేస్తోందని పేర్కొనారు. ఎమ్మెల్యే ప్రభాకర్, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు -
ఇక పచ్చ కాంట్రాక్టర్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కార్యకర్తలు మరో కొత్త అవతారం ఎత్తారు. నిన్నమొన్నటి వరకు పార్టీ జెండా మోసిన అనేక మంది కార్యకర్తలు రేషన్‌షాపులు, ఎల్ఈడీ బల్బుల డీలర్లుగా మారిపోయారు. వారిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని కార్యకర్తలు తమ సంగతేమిటని నేతల్ని ప్రశ్నించడంతో రానున్న ఖరీఫ్‌లో సాగునీటి, మురుగునీటి కాల్వల మరమ్మతులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలు నయా కాంట్రాక్టర్లుగా మారి హల్చల్ చేస్తున్నారు. ఎలాంటి అనుభవం, అర్హతలు లేకపోయినా రూ.5 లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై చేయడానికి జలవనరుల శాఖ అవకాశం కల్పించింది. ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాను అందరిలాంటి మంత్రిని కానని, తన శాఖలో నామినేషన్‌పై పనులు ఉండవని ప్రకటించి, దాదాపు 10 నెలల పాటు నామినేషన్ విధానాన్ని నిలువురించారు. ఏమైందో ఏమోగాని కాల్వల మరమ్మతులను నామినేషన్‌పై ఇవ్వడానికి అనుకూలంగా ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలోని సాగునీటి కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం రూ.8.64 కోట్లు కేటాయించింది. సాగునీటి కాల్వల్లోని పరిస్థితులకు అనుగుణంగా 440 పనులకు జలవనరుల శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి రెండు నెలల క్రితం పంపింది. వాటిని ఆమోదిస్తూ టెండర్లకు బదులు నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కాల్వలకు నీటిని విడుదల చేయడానికి రెండున్నర నెలల సమయం ఉందని, ఈ సమయంలో టెండర్లు ఆహ్వానించడం, ఖరారు చేయడం, పనులు ప్రారంభించడం వంటివి ఆలస్యమవుతాయని, యూజర్ కమిటీలకు వాటిని అప్పగించాలని ఆదేశించింది. యూజర్ కమిటీలను మండల రెవెన్యూ అధికారి ధృవీకరించే అధికారాన్ని అప్పగించారు. గ్రామంలోని రైతులు, వ్యవసాయ కార్మికులకు ఈ కమిటీలో తప్పకుండా స్థానం కల్పించాలని ఆదేశించారు. దీంతో ఏర్పాటుకానున్న యూజర్ కమిటీల్లో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీకి చెందిన రైతులే ఉంటున్నారు. ఈ కమిటీని ఎంఆర్వో ధ్రువీకరించి జలవనరుల శాఖకు పంపితే, ఆ కమిటీకి రూ.5 లక్షల్లోపు విలువైన పనిని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కేటాయిస్తారు. ఈ మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యూజర్ కమిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటవు తున్నాయి. ఈ కమిటీలకే జలవనరుల శాఖ పనులు కేటాయించనుండటంతో టీడీపీ కార్యకర్తలు నయా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ ఇంజినీర్లు వివరణ ఇస్తూ ఎంఆర్ఓ ధ్రువీకరించిన యూజర్ కమిటీలకు నామినేషన్ విధానంపై పనులు కేటాయించనున్నామని, ఈ కమిటీల పరిశీలన జరుగుతోందని, త్వరలో పనులు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. పనుల నాణ్యతపై సందేహాలు ... కాగా, ఈ విధానంలో పనులు జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి అర్హత లేని వారికి ఈ పనులు అప్పగించే అవకాశాలు ఉండటంతో షట్టర్ల మరమ్మతులు, రివిట్మెంట్లు వంటి పనుల నిర్వహణకు వారికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడతో వాటిని సక్రమంగా చేయలేరనే అభిప్రాయం వినపడుతోంది. అధికార బలం వారికి వెన్నంటి ఉండటంతో నాణ్యత లేని పనులను ప్రశ్నించే అధికారాన్ని జల వనరులశాఖ ఇంజినీర్లు కోల్పోయే అవకాశం ఉంది. మొత్తం మీద నామినేషన్ విధానంలో రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ గా కనపడుతున్నాయి. -
పోలవరం పనులను వేగిరపరుస్తాం
* పురోగతిని ప్రతినెలా పరిశీలిస్తాం * ప్రాజెక్ట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రాన్ని నిధులడిగాం * నిర్వాసితులకు అన్యాయం చేయం * భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పోలవరం/పోలవరం రూరల్/బుట్టాయగూడెం : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగిరపరుస్తా మని.. ప్రాజెక్ట్‌ను 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతతో కలసి శుక్రవారం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ట్విన్ టన్నెల్స్, స్పిల్‌వే, ఎర్త్ కం ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ కార్యాలయం వద్ద నిర్వాసితులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారని చెప్పారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు చెప్పామన్నారు. నిర్వాసితులు త్యాగం చేస్తున్నారని, వారికి న్యాయం చేసేందుకు సమర్థవంతమైన అధికారులను నియమించామని పేర్కొన్నారు. ముందుగా ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోనే ఇటీవల కలిసిన వేలేరుపాడు, కుకునూరు మండలాల నిర్వాసితుల సమస్యలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులు తీరు, నిర్వాసితుల సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేలోగా కుడికాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించేందుకు వీలుగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఇప్పటికే కోరారన్నారు. ఇకపై ప్రాజెక్టు పనులను ప్రతినెలా తాను పరిశీలిస్తానని చెప్పారు. మంత్రులు ముందుగా ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకోగా, ఎస్సీ వీఎస్ రమేష్‌బాబు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనుల వివరాలను వారికి వివరించారు. నిర్వాసితుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించండి నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను మంత్రి ఆదేశించారు. నిర్వాసిత కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, నిర్వాసితులు ఇళ్లు కట్టుకునేందుకు వీలుగా బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించాలన్నారు. పరిహారం తక్కువ ఇచ్చారు పోలవరం మండలంలో ముందుగా ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల నిర్వాసితులతోపాటు కుకునూరు, వేలేరుపాడు మండలాల నిర్వాసితులు ఇక్కడకు చేరుకుని మంత్రికి తమ సమస్యలను చెప్పుకున్నారు. గిరిజనేతర నిర్వాసితుల నుంచి గతంలో సేకరించిన భూములకు తక్కువ నష్టపరిహారం ఇచ్చారని, ఎకరానికి కనీసం రూ.5 లక్షలు ఇవ్వాని విజ్ఞప్తి చేశారు. ఏపీఎల్, బీపీఎల్‌గా విభజించకుండా నిర్వాసితుల అందరినీ ఒకే విధంగా గుర్తించాలన్నారు. గతంలో అధికారులు గ్రామ సభలు పెట్టి నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేవారని, ఇప్పుడు పోలీసులను పంపి తమను భయభ్రాంతులు చేస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని వాపోయారు. ఇతర మండల్లాలో నిర్వాసితులకు ఇచ్చిన భూముల్లో సాగు చేసుకోనివ్వకుండా బయట వ్యక్తులు అడ్డుపడుతున్నారని తెలిపారు. ముంపునకు గురయ్యే 23 గ్రామాల్లో ఏ విధమైన అభివృద్ది పనులు చేపట్టడం లేదని వాపోయారు. కనీస వసతులు కూడా కల్పించడం లేదన్నారు. 108 వాహనం కూడా కొన్ని గ్రామాల్లోకి రాని పరిస్థితి ఉందని తెలిపారు. అధికారులను కలవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కలెక్టర్ ఏలూరులోను, స్పెషల్ కలెక్టర్ రాజమండ్రిలోను, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కొవ్వూరులో ఉంటారని, వారిని ఎలా కలవాలని ప్రశ్నించారు. పైడిపాక సొసైటీలో రైతులకు రూ.కోటి అప్పు ఉందని, దానిని మాఫీ చేసినట్టు చెప్పినా బకాయిలు అలానే ఉండిపోయాయన్నారు. నిర్వాసితులు బొరగం శ్రీనివాసరావు, కుంచే దొరబాబు , కారం చల్లాయమ్మ, కొవ్వాసి శ్రీనివాసరావు, బర్ల వెంకటేశ్వరరావు, దట్టి రాంబాబు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన మట్టిపల్లి గంగరాజు, సహదేవుడు తమ సమస్యలను వివరించారు. అనంతరం మంత్రి పట్టిసీమ సమీపంలో ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్; కలెక్టర్ కె.భాస్కర్, జేసీ టి. బాబూరావునాయుడు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, బూరుగుపల్లి శేషారావు, కె.జవహర్, కలవపూడి శివ, నీటిపారుదల శాఖ ఓఎస్డీ పాపారావు, స్పెషల్ కలెక్టర్ డి.సుదర్శన్ ఉన్నారు.