* పురోగతిని ప్రతినెలా పరిశీలిస్తాం
* ప్రాజెక్ట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రాన్ని నిధులడిగాం
* నిర్వాసితులకు అన్యాయం చేయం
* భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ
పోలవరం/పోలవరం రూరల్/బుట్టాయగూడెం : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగిరపరుస్తా మని.. ప్రాజెక్ట్‌ను 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతతో కలసి శుక్రవారం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ట్విన్ టన్నెల్స్, స్పిల్‌వే, ఎర్త్ కం ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజెన్సీ ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయం వద్ద నిర్వాసితులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారని చెప్పారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు చెప్పామన్నారు. నిర్వాసితులు త్యాగం చేస్తున్నారని, వారికి న్యాయం చేసేందుకు సమర్థవంతమైన అధికారులను నియమించామని పేర్కొన్నారు. ముందుగా ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను మంత్రి ఆదేశించారు.
జిల్లాలోనే ఇటీవల కలిసిన వేలేరుపాడు, కుకునూరు మండలాల నిర్వాసితుల సమస్యలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులు తీరు, నిర్వాసితుల సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేలోగా కుడికాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించేందుకు వీలుగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఇప్పటికే కోరారన్నారు. ఇకపై ప్రాజెక్టు పనులను ప్రతినెలా తాను పరిశీలిస్తానని చెప్పారు. మంత్రులు ముందుగా ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకోగా, ఎస్‌సీ వీఎస్ రమేష్‌బాబు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనుల వివరాలను వారికి వివరించారు.
నిర్వాసితుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించండి
నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను మంత్రి ఆదేశించారు. నిర్వాసిత కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, నిర్వాసితులు ఇళ్లు కట్టుకునేందుకు వీలుగా బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించాలన్నారు.
పరిహారం తక్కువ ఇచ్చారు
పోలవరం మండలంలో ముందుగా ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల నిర్వాసితులతోపాటు కుకునూరు, వేలేరుపాడు మండలాల నిర్వాసితులు ఇక్కడకు చేరుకుని మంత్రికి తమ సమస్యలను చెప్పుకున్నారు. గిరిజనేతర నిర్వాసితుల నుంచి గతంలో సేకరించిన భూములకు తక్కువ నష్టపరిహారం ఇచ్చారని, ఎకరానికి కనీసం రూ.5 లక్షలు ఇవ్వాని విజ్ఞప్తి చేశారు. ఏపీఎల్, బీపీఎల్‌గా విభజించకుండా నిర్వాసితుల అందరినీ ఒకే విధంగా గుర్తించాలన్నారు. గతంలో అధికారులు గ్రామ సభలు పెట్టి నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేవారని, ఇప్పుడు పోలీసులను పంపి తమను భయభ్రాంతులు చేస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని వాపోయారు.
ఇతర మండల్లాలో నిర్వాసితులకు ఇచ్చిన భూముల్లో సాగు చేసుకోనివ్వకుండా బయట వ్యక్తులు అడ్డుపడుతున్నారని తెలిపారు. ముంపునకు గురయ్యే 23 గ్రామాల్లో ఏ విధమైన అభివృద్ది పనులు చేపట్టడం లేదని వాపోయారు. కనీస వసతులు కూడా కల్పించడం లేదన్నారు. 108 వాహనం కూడా కొన్ని గ్రామాల్లోకి రాని పరిస్థితి ఉందని తెలిపారు. అధికారులను కలవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కలెక్టర్ ఏలూరులోను, స్పెషల్ కలెక్టర్ రాజమండ్రిలోను, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కొవ్వూరులో ఉంటారని, వారిని ఎలా కలవాలని ప్రశ్నించారు. పైడిపాక సొసైటీలో రైతులకు రూ.కోటి అప్పు ఉందని, దానిని మాఫీ చేసినట్టు చెప్పినా బకాయిలు అలానే ఉండిపోయాయన్నారు.
నిర్వాసితులు బొరగం శ్రీనివాసరావు, కుంచే దొరబాబు , కారం చల్లాయమ్మ, కొవ్వాసి శ్రీనివాసరావు, బర్ల వెంకటేశ్వరరావు, దట్టి రాంబాబు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన మట్టిపల్లి గంగరాజు, సహదేవుడు తమ సమస్యలను వివరించారు. అనంతరం మంత్రి పట్టిసీమ సమీపంలో ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్; కలెక్టర్ కె.భాస్కర్, జేసీ టి. బాబూరావునాయుడు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, బూరుగుపల్లి శేషారావు, కె.జవహర్, కలవపూడి శివ, నీటిపారుదల శాఖ ఓఎస్‌డీ పాపారావు, స్పెషల్ కలెక్టర్ డి.సుదర్శన్ ఉన్నారు.
పోలవరం పనులను వేగిరపరుస్తాం
Published Sat, Nov 29 2014 2:58 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement