ఆందోళన తీవ్రతరం
పట్టుబిగించిన రెవెన్యూ ఉద్యోగులు
చింతమనేని అరెస్ట్‌కు డిమాండ్
మంత్రి ఉమాతో చర్చలు విఫలం
సోమవారం చర్చిద్దామన్న సీఎం
జిల్లాలో స్తంభించిన పాలన
విజయవాడ : తహశీల్దార్ వనజాక్షిపై దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన జరిపారు. నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తహశీల్దార్‌లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బందరు కలెక్టరేట్‌ను మూసివేసి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందీ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
నగరంలో హడావుడి
నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రెవెన్యూ ఉద్యోగులు, ఎన్జీవో నాయకులు హడావుడి చేశారు. ఉదయం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఏపీఆర్‌ఎస్‌ఏ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇంద్రకీలాద్రి వద్ద ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్‌హౌస్‌కు తహశీల్దార్ వనజాక్షి, ఇతర తహశీల్దార్‌లు, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు చర్చలు జరిగాయి. వనజాక్షిని అవమానించి, ఆమెపై దాడిచేసిన చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందేనని ఉద్యోగులు తేల్చిచెప్పారు.
మంత్రి ఉమాతో చర్చలు విఫలం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఏపీఆర్‌ఎస్‌ఏ, ఎన్జీవో నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చింతమనేని ప్రభాకర్‌తో పాటు తహశీల్దార్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే అంగరక్షకులు, అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనను చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించిన ముసునూరు ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే, ఇందులో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులను అరెస్ట్ చేసేందుకు, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకుమ మాత్రమే మంత్రి హామీ ఇవ్వడంతో చర్యలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లు శుక్రవారం సాయంత్రానికి అమలు కావాలని యూనియన్ నేతలు మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే అరెస్ట్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సీఎంతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వనజాక్షి, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజుతో కూడా జరిగిన సంఘటనపై సీఎంతో మాట్లాడారు. దాడిని ఖండించిన ఆయన ఇటువంటి సంఘటనలు బాధాకరమన్నారు. దీనిపై తాను సోమవారం చర్చిస్తానని హామీ ఇచ్చారు.
సోమవారం నుంచి ఆందోళన ఉధృతం
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం నుంచి ఆందోళనా కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. అయితే, ముఖ్యమంత్రి సోమవారం అసోసియేషన్‌తో చర్చించేందుకు హామీ ఇచ్చినందున అంతవరకు వేచి చూడాలనే ధోరణి ఉద్యోగ సంఘాల నేతల్లో ఉంది. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వేదన తహశీల్దార్‌లో ఉన్నట్లు మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద శుక్రవారం రెండు గంటల పాటు జరిగిన పరిణామం స్పష్టం చేసింది.
మంత్రి దేవినేనితో చర్చలు విఫలం కాగానే బయటకు వచ్చిన వనజాక్షి నేరుగా కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కారు తలుపు రాకపోవడంతో ఏపీఆర్‌ఎస్‌ఏ నాయకులు వనజాక్షికి నచ్చజెప్పి మీడియాతో మాట్లాడించారు. చర్చల్లో మంత్రి వ్యవహరించిన తీరు నచ్చక ఆమె బాధతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడి ఉద్యమ నాయకులు ఆమెను వారించి అందరితో పాటు తీసుకువెళ్లారు.