బుధవారం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని (పసుపు వృత్తంలోని తలపాగా వ్యక్తి) దాడి చేసినప్పుడు ఇసుకలో పడిపోయిన ముసునూరు తహసీల్దార్ వనజాక్షి (ఎరుపు ర
తహసీల్దార్‌పై దాడి కేసును నీరుగార్చే యత్నం
* పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
* మంత్రి ఉమ రాజీయత్నాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి వ్యవహారం రోజురోజుకీ ఉద్ధృత రూపం దాలుస్తుండడం, ప్రభుత్వం పరువు బజారున పడడంతో సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బయటపడేసేందుకు రక్షగా నిలిచిన బాబు అధికారులను దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దాలని మంత్రి దేవినేని ఉమకు సీఎం బాధ్యతలు అప్పగించారు.
సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి ఉమ శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నేతలు మోడల్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి ఉమతో చర్చల్లో పాల్గొన్నారు. వనజాక్షికి నచ్చజెప్పి కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. పుష్కరాల విధులకు హాజరు కావాలని, ఆందోళన విరమించాలనే ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఆందోళన విరమించాలి: మంత్రి ఉమ
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని దేవినేని ఉమ మీడియాతో అన్నారు. తహసీల్దార్‌పై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు. చర్చల్లో రెవెన్యూ అసోసియేషన్ నేతలు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టారు. చింతమనేని అరెస్టు, ఆయన అనుచరుల అరెస్టు, సంఘటన స్థలంలో ఉండి మహిళా అధికారిపై దాడి జరుగుతున్నా పట్టించుకోని ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్ చేశారు.
చింతమనేని అరెస్టు మినహా మిగిలిన రెండు డిమాండ్లను నెరవేర్చేందుకు మంత్రి.. కృష్ణా, పశ్చిమ గోదావరి ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. చింతమనేనిని అరెస్టు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. సోమవారం వరకు ఆగాలని, సీఎం నిర్ణయం తీసుకుంటారని ఉమ నచ్చజెప్పారు.
సోమవారం రండి మాట్లాడుకుందాం
జరిగిన ఘటనపై సోమవారం మాట్లాడుకుందామని, హైదరాబాద్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు సూచించినట్లు సమాచారం. బాధితురాలు వనజాక్షి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ఆయన వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా, మహిళా అధికారిపై దౌర్జన్యం చేసిన ఘటనలో ముసునూరు పోలీస్ స్టేషన్‌లో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైన సంగతి తెల్సిందే. నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసు నమోదైనప్పటికీ చింతమనేనిని అరెస్టు చేయకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు దాటవేస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు
వనజాక్షిపై దాడికి నిరసనగా కృష్ణా జిల్లాలో అన్ని తహసీల్దార్ కార్యాలయాకు శుక్రవారం తాళాలు వేశారు. సోమవారం నాటికి చింతమనేనిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు వనజాక్షిపై చింతమనేని దాడి ఘటనపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగ సంఘాలు, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలు చింతమనేనిని అరెస్టు చేసి విప్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.