మహిళా తహశీల్దార్‌పై దాడి సిగ్గుమాలిన చర్య
దాడి చేసిన ఎమ్మెల్యే సహా అందరిపై చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
విజయవాడ : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో రోజువారీ ముడుపులు అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలసు పార్థసారథి విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారికి మంత్రి ఉమా ప్రత్యక్షంగా కొమ్ముకాస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్థసారథి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముసునూరు మండల తహశీ ల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీధి రౌడీ తరహాలో దాడి చేయటం సిగ్గుమాలిన చర్యని దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీ నేతలు నిసిగ్గుగా ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడి అందరినీ బెదిరిస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ ఎంపీ ఒకరు దేశాన్ని రక్షించే సైన్యాన్ని కించపరిచేలా సిగ్గులేకుండా మాట్లాడారని, నేడు ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్ అక్రమాలను అడ్డుకోవడానికి వెళ్లిన తహశీల్దార్‌పై దాడిచేయడం గర్హనీయమన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం అవినీతిమయంగా మారిందని తాము కలెక్టర్‌కు విన్నవించినా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా పనిచేస్తోందని పేర్కొనారు. ఎమ్మెల్యే ప్రభాకర్, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
మంత్రి ఉమాకు ‘నీరు-చెట్టు’ ముడుపులు
Published Thu, Jul 9 2015 1:40 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement