వైఎస్సార్‌సీపీ పంచాయతీలకు ‘నీరు-చెట్టు’ దూరం
పెళ్లకూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ‘నీరు-చెట్టు’ పనులు వైఎస్సార్‌సీపీ పంచాయతీలకు దూరమయ్యాయి. మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం కింద రూ. 5.78 కోట్లు, ఇరిగేషన్ కింద రూ. 38.81 లక్షల నీరు-చెట్టు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి.
‘నీరు-చెట్టు’ పనులను జన్మభూమి కమిటీ సభ్యులు చేపట్టడంతో మండలంలోని చిల్లకూరు, జీలపాటూరు, ముమ్మారెడ్డిగుంట, పెళ్లకూరు, కలవకూరు, పుల్లూరు, అర్ధమాల గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు ఉన్నందున నిధులు కేటాయించలేదు. శిరసనంబేడు, చావలి, రోసనూరు, కానూరు, పెన్నేపల్లి, పాలచ్చూరు, బంగారంపేట, నందిమాల, చెన్నప్పనాయుడుపేట, కొత్తూరు గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా స్థానిక టీడీపీ నాయకులు ‘నీరు-చెట్టు’ పనులు చేస్తున్నారు.
అధికారపార్టీ నాయకులకు అధికారుల దాసోహం
పార్టీలకతీతంగా నీరు-చెట్టు పనులను చేపట్టి గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన అధికారులు అధికారపార్టీ నాయకులకు దాసోహం అంటున్నారు. చిల్లకూరు, పెళ్లకూరు, నెలబల్లి, రోసనూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణల్లో వర్షపునీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జీలపాటూరు, రోసనూరు, పుల్లూరు చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి సాగునీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. ‘నీరు-చెట్టు’ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ సర్పంచులు ఉన్న చోట జన్మభూమి కమిటీలు ‘నీరు-చెట్టు’ పనులను దూరం చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అన్ని పంచాయతీల్లో పార్టీలకతీతంగా ‘నీరు-చెట్టు’ పనులు చేపట్టి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.