Parthasarathy kolasu
-
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
సాక్షి, తాడేపల్లి/ విజయవాడ: వ్యవసాయం దండగ అని, రైతులపై కాల్పులు జరిపించిన వ్యక్తి.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్సీపీ నేత పార్థసారథి చంద్రబాబుపై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు హయాంలో రైతులను గాలికొదిలేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీని తమ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. విత్తనాలు నాటిన రోజే మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. రాష్ట్రంలో కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారం పోయినప్పుడల్లా మారిన మనిషినంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడని, ఈసారి ప్రజలు ఆయనను విశ్వసించే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎందుకు ఓడిపోయారో ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారని, ఓటమిని విశ్లేషించుకోలేని వ్యక్తి రాజకీయాలకు పనికిరారని అన్నారు. ఈ విషయంలో ట్రంప్‌కు, చంద్రబాబుకు పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. కాగా, 2019 ఎన్నికల్లోనే ప్రజలు.. టీడీపీకి చితిపెట్టి కాలగర్భంలో కలిపేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. జనం కట్టిన సమాధిలో నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఫలించవని ఆయన అభిప్రాయపడ్డారు. బాబు నేతృత్వంలోని టీడీపీని ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని, ఇక టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రజలు భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారని జోగి రమేష్ తెలిపారు. -
మంత్రి ఉమాకు ‘నీరు-చెట్టు’ ముడుపులు
మహిళా తహశీల్దార్‌పై దాడి సిగ్గుమాలిన చర్య దాడి చేసిన ఎమ్మెల్యే సహా అందరిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విజయవాడ : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో రోజువారీ ముడుపులు అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలసు పార్థసారథి విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారికి మంత్రి ఉమా ప్రత్యక్షంగా కొమ్ముకాస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్థసారథి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముసునూరు మండల తహశీ ల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీధి రౌడీ తరహాలో దాడి చేయటం సిగ్గుమాలిన చర్యని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు నిసిగ్గుగా ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడి అందరినీ బెదిరిస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ ఎంపీ ఒకరు దేశాన్ని రక్షించే సైన్యాన్ని కించపరిచేలా సిగ్గులేకుండా మాట్లాడారని, నేడు ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్ అక్రమాలను అడ్డుకోవడానికి వెళ్లిన తహశీల్దార్‌పై దాడిచేయడం గర్హనీయమన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం అవినీతిమయంగా మారిందని తాము కలెక్టర్‌కు విన్నవించినా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా పనిచేస్తోందని పేర్కొనారు. ఎమ్మెల్యే ప్రభాకర్, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు