ఆ ప్రాజెక్టుల్లో బాబు మనిషే ప్రధాన కాంట్రాక్టర్
దేవినేనిపై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రధాన కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనిషేనన్న విషయాన్ని పక్కనపెట్టి, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ జలదీక్ష చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ దీక్ష పట్ల దేవినేని అక్కసు వెళ్లగక్కడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రధాన కాంట్రాక్టరైన నవయుగ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి కాదా? ఆయనకు అవసరమైనవి సమకూర్చేది, విమానం ఏర్పాటు చేసేది వారి డబ్బుతోనే కదా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, దేవినేనికి దమ్ముంటే కేసీఆర్‌పై పోరాడి పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని ఆయన సవాలు విసిరారు. ఎంపీ మిథున్‌రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుల్లో రూ. వేల కోట్ల కాంట్రాక్టులు జగన్ ఇప్పించారని దేవినేని అబద్ధపు విమర్శలు చేయడం దుర్మార్గమని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. తాము చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైతం తాము రోడ్డు నిర్మాణ పనులు, హంద్రీ-నీవా సుజల స్రవంతిలో మూడు ప్యాకేజీల పనులు చేస్తున్నామని.. అలాగని సీఎంతో లాలూచీ పడినట్లా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.