పయ్యావులకు ‘పవర్’ కట్ ! | PAYYAVULA 'Power' Cut! | Sakshi
Sakshi News home page

పయ్యావులకు ‘పవర్’ కట్ !

Published Sat, Feb 27 2016 3:38 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

పయ్యావులకు ‘పవర్’ కట్ ! - Sakshi

పయ్యావులకు ‘పవర్’ కట్ !

మంత్రి పదవిపై ఏడాదిగా ఎమ్మెల్సీ కేశవ్ ఆశలు
పల్లె, పరిటాలలో ఒకరిని తప్పించి మంత్రి మండలిలో చేరే ఎత్తుగడ
ఆయన ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు
భూమాకు మంత్రి పదవికట్టబెట్టే యోచనతోనే అడ్డంకులు

 
సాక్షిప్రతినిధి, అనంతపురం మంత్రి పదవిపై ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు చల్లారా? మంత్రివర్గ విస్తరణలో కేశవ్‌ను కాదని భూమా నాగిరెడ్డి లేదా అఖిల ప్రియకు పదవి కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు మంత్రి కాలేకపోతే జీవితకాలంలో మరెప్పుడూ కాలేరని పయ్యావుల అనుచరులు ఇటీవల బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలే నిజమవుతున్నాయా?... తెలుగుదేశం పార్టీలో తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది.

 జిల్లా టీడీపీ సీనియర్ నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. రాష్ట్రస్థాయి నేతగా ఎదిగే క్రమంలో జిల్లా రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఉరవకొండ నియోజకవర్గాన్ని, అక్కడి ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో ఓడిపోయారని ఆ పార్టీ అధిష్టానం కూడా భావించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రిని అయ్యేవాడినని, పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో గెలవలేకపోయానని కేశవ్ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద వేదనపడినట్లు తెలిసింది. పల్లె ర ఘునాథరెడ్డి, పరిటాల సునీతకు జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు దక్కడంతో కేశవ్ గత 20 నెలలుగా జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మినహా మరే కార్యక్రమంలోనూ కన్పించలేదు.

ఇదిలావుండగా.. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కేశవ్ వ్యూహరచన చేశారు. జిల్లా మంత్రులు పల్లె, పరిటాలలో ఎవరినో ఒకరిని కేబినెట్ నుంచి తప్పించి, తాను వెళ్లాలని చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించారని తెలుస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి వద్దనున్న విద్యుత్ శాఖను అనధికారికంగా కేశవ్ ఇన్నాళ్లూ పర్యవేక్షించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఉండే మంత్రివర్గ విస్తరణలో మంత్రి కాబోతున్నానని, పోర్టుపోలియో ‘పవర్’ అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ఓ టీడీపీ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. తాజా  పరిణామాల నేపథ్యంలో కేశవ్ ఎత్తులు చిత్తయ్యాయని తెలుస్తోంది.

 కేశవ్‌పై చంద్రబాబుకు సన్నగిల్లిన నమ్మకం
 పయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే సందర్భంలో మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. భూమా కూడా పార్టీలోకి చేరుతున్న సందర్భంలో విద్యుత్‌శాఖను డిమాండ్ చేయడం, దానికి సీఎం అంగీకారం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి కేశవ్ నేరుగా చంద్రబాబును కలిసి తన మంత్రి పదవిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘పార్టీ బలోపేతం కోసం కొన్ని త్యాగాలు తప్పవు. ఎమ్మెల్యేగా ఓడిపోయావు. ఎమ్మెల్సీ ఇచ్చాం. ఈ ‘సారి’కి అంతటితో తృప్తి పడు’ అని కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేశవ్ మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ‘అనంత’ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement