అందరి చూపు ‘ఆంధ్రా’వైపే | Dream Of Students To Study In Andhra Medical College | Sakshi
Sakshi News home page

Andhra University: అందరి చూపు ‘ఆంధ్రా’వైపే

Published Mon, Sep 27 2021 4:28 AM | Last Updated on Mon, Sep 27 2021 11:54 AM

Dream Of Students To Study In Andhra Medical College - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన ఆంధ్రా మెడికల్‌ కాలేజీ (ఏఎంసీ)కి ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఇప్పటికీ వైద్యవిద్యార్థులు నీట్‌లో మంచి ర్యాంకు వస్తే ఎక్కడ సీటు తీసుకుంటావని అడిగితే టక్కున విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ అని చెబుతారు.  రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్యకాలేజీలు ఉండగా.. అభ్యర్థులు ఆంధ్రా మెడికల్‌ కాలేజీలోనే చదవాలని కలలుకంటారు. కొన్నేళ్లుగా ర్యాంకుల పరంగా చూసినా చివరి సీటు పొందిన అభ్యర్థుల కటాఫ్‌ చూస్తే ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో మంచి ర్యాంకులు వచ్చిన వారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో 250 సీట్లున్నాయి. ఏఎంసీలో సీటు రాకపోతే రెండో ఆప్షన్‌గా గుంటూరు మెడికల్‌ కాలేజీ వైపు చూస్తున్నారు.

గుంటూరు మెడికల్‌ కాలేజీలో చదివిన వందలాదిమంది విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నట్టు పలు నివేదికల్లోనూ వెల్లడైంది. మంచి ఫ్యాకల్టీ, మెరుగైన వైద్య వసతులు, ఔట్‌పేషెంట్లు ఎక్కువమంది రావడం, మౌలిక వసతులతో ఆయా కాలేజీలు వైద్యవిద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. జాతీయ కోటాలో భర్తీచేసే 15 శాతం సీట్లకు సైతం ఏఎంసీ, గుంటూరు వైద్యకళాశాలలకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. తరువాత కర్నూలులోని కర్నూలు మెడికల్‌ కాలేజీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సమ ఉజ్జీలుగా పోటీపడుతున్నాయి. మంచి ర్యాంకులు సాధించిన వారు ఏఎంసీ, గుంటూరు కాలేజీల్లో సీటు రాకపోతే కర్నూలు, కాకినాడ ప్రభుత్వ వైద్యకళాశాలల వైపు ఆసక్తి చూపుతున్నారు.

పుంజుకున్న రిమ్స్‌ 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ 4 రిమ్స్‌ (రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయాక ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌ ఏపీలో ఉన్నాయి. తాజాగా వైద్యుల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో మెరుగు పడ్డాయి. గతంతో పోలిస్తే రిమ్స్‌ భారీగా పుంజుకున్నాయి. ప్రైవేటులో పేరున్న నారాయణ, ఎన్‌ఆర్‌ఐ వంటి కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీటుకు కాకుండా రిమ్స్‌కు (ఇప్పుడు జీఎంసీలుగా మారాయి) వస్తున్నారు. నారాయణ కాలేజీలో 55,046 ర్యాంకు చివరి సీటు కాగా, అదే ఒంగోలు రిమ్స్‌లో 33,332కే ముగిసింది. సాధారణ కాలేజీలైనా ప్రభుత్వ వైద్యకళాశాలలపైనే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాకపోతేనే ప్రైవేటులో కన్వీనర్‌ సీటుకు వెళుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement