Heart related problem
-
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్‌సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్‌లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్‌కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
Health Tips: నోరు అపరిశుభ్రంగా ఉంటే క్యాన్సర్తోసహా.. ఎన్నో సమస్యలు..
నోరు మంచిదైతే ఊరే కాదు... ఒళ్లూ మంచిదవుతుంది. ఈ కొత్త సామెత ఏమిటని ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు తెలుసా? అనేక అనారోగ్యాలకు మన నోరే రహదారి. అదెలాగంటే... ఎప్పుడూ నోరు శుభ్రంగా ఉంచుకుని, నోటి ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే గుండెజబ్బులూ, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి అనేక జబ్బులను నివారించుకోవచ్చు. గుండెకు కీడు చేసే ఇన్ఫెక్షన్లు నోరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు... అక్కడి నుంచి గుండెకు పాకి జబ్బును కలగజేస్తాయి. అంతేకాదు... నోరు పరిశుభ్రంగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఫలితంగా అనేక జబ్బులకు అదే కారణమవుతుంది. అంతేకాదు... అపరిశుభ్రమైన నోరు లేదా అక్కడ చేరే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అక్కడ వచ్చే కొద్దిపాటి సమస్యలైన పళ్లలో రంధ్రాలు (క్యావిటీస్), చిగుర్ల సమస్యలు (జింజివైటిస్, పెరియోడాంటైటిస్) వంటి వాటికి తేలికపాటి చికిత్సలు తీసుకుంటూ ఉంటే... పెద్ద పెద్ద జబ్బులను చాలా చవగ్గా నివారించివచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! అధ్యయనం తాలూకు కొన్ని గణాంకాలివి... ఇటీవలి కరోనా కారణంగా నోటి సమస్యలకు చికిత్స చేయించుకోవడం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు మొదటి లాక్డౌన్ దశలో దాదాపు 90 లక్షల మంది చిన్నారులు చిన్నపాటి దంతసమస్యల చికిత్సలకు సైతం పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఒక అధ్యయనం ప్రకారం... మన దేశంలో 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి దంతవైద్యుల దగ్గరికి వచ్చే చిన్నారుల శాతం 34% నుంచి 10% కి పడిపోయింది. యుక్తవయస్కుల విషయానికి వస్తే... చికిత్సకు వచ్చే పెద్దవారి సంఖ్య గత రెండేళ్లలో 32.6% నుంచి 23.6%కు పడిపోయింది. ఫలితంగా పెరుగుతున్న ముప్పు... దాంతో మునుపు తేలిగ్గా నివారితమైపోయే చాలా జబ్బుల ముప్పు ఇప్పుడు భారీగా పొంచి ఉన్నట్లు ఈ గణాంకాల వల్ల తేటతెల్లమవుతోంది. ప్రాథమికంగా చేసే స్క్రీనింగ్‌తో లేదా చిన్నపాటి సమస్య దశలోనే అంటే... పళ్లలోని రంధ్రా(క్యావిటీ)లకు చిన్నపాటి ఫిల్లింగులు, అరిగిన పళ్లకు క్రౌన్స్ అమర్చడం అనే కొద్దిపాటి చికిత్సలు, పళ్లను శుభ్రం చేసే స్కేలింగ్స్లతో తప్పిపోయే చాలా చాలా పెద్ద అనర్థాల ముప్పు ఇప్పుడు పొంచి ఉందని అర్థం. ఈ అధ్యయనాల ఆధారంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... నిన్నటి వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్యాండమిక్ ముప్పు ఇప్పుడు కొద్దిగా ఉపశమించినందువల్ల ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, చిగుర్ల సమస్యలు లేకుండా చూసుకోవడం, ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని మొగ్గ దశలోనే స్కేలింగ్, నోటి ఇన్ఫెక్షన్లకు సాధారణ చికిత్సతోనే కట్టడి చేస్తే ఎంతో పెద్ద జబ్బులనూ ముందే నివారించవచ్చన్న అవగాహనను పెంచుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ వికాస్ గౌడ్ సీనియర్ దంతవైద్యులు, ఈస్థటిక్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్! -
బార్లీతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నారా.. అయితే బార్లీ తినడం మొదలుపెట్టండి. బార్లీ అటు ఎల్డీఎల్తోపాటు నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను కూడా ఏడు శాతం వరకూ తగ్గించగలదని కెనెడాలోని సెయింట్ మైకేల్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు రకాల కొలెస్ట్రాల్‌లు గుండె జబ్బులకు కారణమవుతాయని అంటున్నారు. గుండెకు బార్లీ చేసే మేలు గురించి చాలాకాలంగా తెలిసినా... ఎల్డీఎల్, నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్లపై దీని ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది తమ అధ్యయనం ద్వారా వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ వ్లాదిమిర్ వుక్సన్ తెలిపారు. ఓట్స్‌తో పోలిస్తే బార్లీలో పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికే కాకుండా సాధారణ వ్యక్తులకూ ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. - సాక్షి, హైదరాబాద్