
సాక్షి, హైదరాబాద్: భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ విభాగాల్లో సేవలందించేందుకు కొత్తగా స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టింది. దీనిని పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ నర్సింగ్– రెసిడెన్సీగా పిలుస్తారు. ఈ కోర్సులో చేరేవారికి ఏడాదిపాటు రెసిడెంట్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.
200 పడకలున్న ఆస్పత్రులు ఈ కోర్సును బోధించేందుకు అనుమతిస్తారు. కరోనా కాలంలో క్రిటికల్ కేర్ వైద్యం అనేది కీలకంగా మారింది. దీంతో క్రిటికల్ కేర్ మెడిసిన్ వేగంగా అభివృద్ధి చెందింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల సంరక్షణ కోసం నర్సుల నైపుణ్యాలను పెంచాల్సిన అవసరముందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం నొక్కి చెప్పింది. ఐసీయూ సేవలు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.
ఈ రోగులను చూసుకోవడానికి నర్సులు ఉండాల్సిన అవసరముందని తెలిపింది. రోగికి అవసరమైన పోషకాహారం, కమ్యూనికేషన్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మొదలైన అంశాలపై వీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏడాది రెసిడెన్సీ కోర్సులో 10 శాతం థియరీ, 90 శాతం స్కిల్ ల్యాబ్, క్లినికల్ అంశాల్లో అభ్యసనం ఉంటుంది. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన వారు ఈ కోర్సును చేయవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన నర్సులను మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏదైనా క్రిటికల్ కేర్ యూనిట్‌లో మాత్రమే నియమించాలి. క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన నర్సులు అవసరమని భావించి కేంద్రం ఈ కోర్సు ప్రవేశపెట్టిందని నర్సింగ్ నిపుణులు అనిల్‌కుమార్, రుఢావత్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment