సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌సీ) కోర్సులో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో జోసా నిర్వహించిన ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది. ప్రధాన ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల కటాఫ్ ర్యాంకులు ఊహించని విధంగా ఉన్నాయి.
బాలికలకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించడంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఓపెన్ కేటగిరీలో కొన్ని సంస్థల్లో వందలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కలేదు. ముంబై, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలలో పోటీ ఈసారి తీవ్రంగా ఉంది. పాలక్కడ్, భిలాయ్ ఐఐటీల్లో 5 వేల పైన ర్యాంకు వచ్చిన వారికీ సీటు దక్కడం విద్యార్థులకు కాస్తా ఊరటనిచ్చింది.
ఎన్‌ఐటీల్లోనూ అదే జోరు..
జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో (ఎన్‌ఐటీలు) ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకే డిమాండ్ కొనసాగింది. ఇతర బ్రాంచీలకన్నా సీఎస్‌సీ కోర్సులకు విద్యార్థులు 10 రెట్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ ఎన్‌ఐటీలను మొదటి ఐచ్చికంగా ఎంచుకున్నారు. దీంతో వరంగల్ నిట్‌లో ఓపెన్ కేటగిరీలో బాలురకు 2 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు దక్కాయి. తిరుచనాపల్లిలో వెయ్యిలోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఏపీ, కాలికట్, జలంధర్, సిక్కిం, హమీర్‌పూర్ ఎన్‌ఐటీల్లో 10 వేల పైబడ్డ ర్యాంకుల వరకు సీట్లు లభించాయి.
బాలికలకు కొంత మెరుగు
తాజాగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో కటాఫ్ తీరును పరిశీలిస్తే బాలురకన్నా, బాలికల పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపించింది. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తర్వాత ముంబై ఐఐటీలో బాలికలకు 305 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరుపతిలో 5,901 వరకూ, భిలాయ్‌లో 7,176 వరకూ సీటు వచ్చింది. ఎన్‌ఐటీల విషయానికి వస్తే హమీర్‌పూర్ ఎన్‌ఐటీలో 18 వేల వరకూ కటాఫ్ ఉంటే, తిరుచనాపల్లిలో 1,852 బాలికల కటాఫ్‌గా ఉంది. దీంతో ఓపెన్ కేటగిరీలో బాలికలు సాధారణ పోటీతో సీట్లు దక్కించుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. కోవిడ్ తర్వాత జరిగిన జేఈఈ మెయిన్స్ పేపర్లు కఠినంగానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ర్యాంకుల సాధనలోనూ ఈసారి పోటీ వాతావరణం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment