భూమిపై పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత శాస్త్రవేత్తలను ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల భూమిపై జీవావరణం దెబ్బతింటుందని, జీవులు అంతరించిపోతాయని వారు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది జీవులు పలు కారణాల వల్ల అంతరించిపోయాయి. భూమిపై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇతర గ్రహాల్లో మనుగడ సాగించేందుకు ఉన్న అవకాశాలపై చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
అలాగే సౌర కుటుంబంలో భూమికి సహజ ఉపగ్రహమైన జాబిలిపై ఇప్పటికే కాలు మోపి.. చాలా ఏళ్ల నుంచి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయితే ఇతర గ్రహాల వలే చంద్రుడు కూడా ప్రాణుల మనుగడకు అనుకూలం కాదని ఇప్పటి వరకూ నమ్ముతున్నారు. కానీ, మన విలువైన వనరులను భద్రపరచడానికి స్టోరేజీలా మూన్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. చంద్రుడిపై జీన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సైంటిస్టులు ప్రతిపాదన చేశారు.
మనుషులతో సహా సుమారు 67 లక్షల జీవులకు సంబంధించిన పునరుత్పత్తి కణాలు, వీర్యం, అండాలు ఆ లూనార్ బ్యాంక్‌లో భద్రపరచాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య మతగ్రంథాలలో జీవుల రక్షణకు ఉపయోగించిన ‘ఆర్క్’లాంటి ఈ బ్యాంకును మోడరన్ గ్లోబల్ ఇన్సూ్యరెన్స్ పాలసీగా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీర్ జెకన్ తంగ, అతని బృందం తయారు చేసిన ఓ రిపోర్టును ఇటీవల జరిగిన ఏరోస్పేస్ సదస్సులో సమర్పించారు. రక్షణ చర్యల్లో భాగంగా లక్షలాది జీవుల వీర్యం, అండాల శాంపిల్స్‌ను లూనార్ బ్యాంకుకు తరలించాలని ఆ రిపోర్టులో ప్రతిపాదించారు.
చంద్రుడి ఉపరితలం సేఫ్
ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూట్ (ఐఈఈఈ) వార్షిక ఏరోస్పేస్ సదస్సులో తంగ ప్రసంగిస్తూ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జీవుల నమూనాలను భద్రపరచడానికి భూమిపై భాండాగారం నిర్మాణం సరైంది కాదన్నారు. మరో గ్రహాన్ని లేదా చందమామపైనైనా జీవుల జన్యువులను భద్రపరిచే భాండాగారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నెలకొల్పాలని సూచించారు. ఒకవేళ భూగోళంపై ఎంతటి విధ్వంసం జరిగినా.. జీన్ బ్యాంక్‌లో భద్రపరిచిన జీవులను ఇప్పుడున్న శాస్త్రసాంకేతికత పురోగతితో పునరుత్పత్తి చేయవచ్చు అని ఆయన తన ప్రసంగంలో సూచించారు.
ఇటీవల చంద్రుడి ఉపరితలంపై కనుగొన్న లావా గోతుల్లో ఆ బ్యాంకును భద్రపరచవచ్చని తంగా అభిప్రాయపడ్డారు. ఆ గోతులు రెడీమేడ్ స్టోరేజీగా ఉపయోగించుకోవచ్చన్నారు. 80 నుంచి 100 మీటర్ల లోతుతో ఉండే ఈ గోతులు జీన్ బ్యాంక్ రక్షణకు సరిగ్గా సరిపోతాయని, ఈ గోతుల్లో భద్రపరిస్తే ఉల్కాపాతాలు, స్పేస్ రేడియేషన్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అయితే తంగ జీన్ బ్యాంక్ ప్రతిపాదన కొత్త కాదు. ఆర్కిటిక్ సముద్రంలోని స్పిట్స్ బర్గెన్ ఐల్యాండ్‌పై స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌ని భూమిపై ఇప్పటికే నెలకొల్పారు. దీనిలో మొక్కల విత్తనాలు, ఇతర సీడ్స్‌లకు చెందిన 9,92,000 శాంపిల్స్ భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment