లండన్: ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియాల నుంచి గత 50,000 ఏళ్లలో వచ్చిన వేర్వేరు వలసల కారణంగానే భారత సంతతి ప్రజలు ఏర్పడ్డారని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపఖండంలో వ్యక్తుల జన్యువుల్ని విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హడ్డర్స్‌ఫీల్డ్ పరిశోధకులు వెల్లడించారు.
వేట ఆధారంగా జీవించే జాతి ఒకటి దాదాపు 50 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి ఉపఖండానికి వలస వచ్చిందని పరిశోధకులు చెప్పారు. అనంతరం దాదాపు 10–20 వేల ఏళ్ల క్రితం అంటే మంచు యుగం ముగిశాక ఇరాన్ ప్రాంతం నుంచి వలసలు ప్రారంభమయ్యాయని వారు తెలిపారు. ఇక మధ్య ఆసియా జాతులు గత 5,000 ఏళ్లలోనే ఉపఖండానికి వలస వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.