ఆడా మగా కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్లు అసలు ఆనవాలే లేకుండా పోతే? పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే? అలాంటి సృష్టి వైపరీత్యమే దాపురించబోతోంది! కాకపోతే ఇప్పుడప్పుడే కాదు. ఓ కోటి సంవత్సరాల తర్వాత! అప్పటికల్లా మగవాళ్లలోని వై క్రోమోజోమ్ పూర్తిగా మటుమాయం కానుండటమే ఇందుకు కారణం!
నిజానికి జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తోందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95 శాతానికి పైగా కృశించిపోయినట్టు సైంటిస్టులు తేల్చడం విశేషం!! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్‌ను మరో కోటి ఏళ్ల తర్వాత మనం పూర్తిగా మర్చిపోవాల్సిందేనని వాళ్లు హెచ్చరిస్తున్నారు.
1,393 జన్యువులు ఇప్పటికే మాయం
ఎక్స్, వై క్రోమోజోములు లింగ నిర్ధారణ కారకాలన్నది తెలిసిందే. అందుకే వాటిని సెక్స్ క్రోమోజోములుగా పిలుస్తారు. ఆడవాళ్లలో రెండు ఎక్స్ క్రోమోజోములు, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. వై క్రోమోజోమ్ వల్ల వృషణాలు తదితర కీలక పురుష పునరుత్పాదక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే దాన్ని మేల్ క్రోమోజోమ్‌గా, ఎక్స్‌ను ఫీమేల్ క్రోమోజోమ్‌గా పిలుస్తారు. ఫలదీకరణ వేళ రెండు ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, ఎక్స్, వై క్రోమోజోములు కలయికతో అబ్బాయి పుడతారు.
ఎక్స్‌తో పోలిస్తే పరిమాణంలోనే గాక జన్యువుల సంఖ్యలో కూడా వై క్రోమోజోమే చిన్నది. అందులో ఒకప్పుడు 1,438 జన్యువులుండేవట. గత 30 కోట్ల ఏళ్లలో వాటిలో ఏకంగా 1,393 జీన్స్ లుప్తమైపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 45 జన్యువులు కూడా మరో కోటి ఏళ్లలో పూర్తిగా లుప్తమవుతాయని జెనెటిక్స్ ప్రొఫెసర్, సైంటిస్టు జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ వివరించారు. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్స్‌లో ప్రచురించారు.
ఆశ లేకపోలేదు...
వై క్రోమోజోమ్ అంతరించినా మగ జాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దానిలోని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్టు జపాన్‌లోని హక్కైడో వర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొచ్చి0ది.
‘‘ఒక రకం చిట్టెలుకల్లో ఇలాగే జరిగింది. వై క్రోమోజోమ్ లుప్తమైపోయినా దానిలోని మేల్ జీన్స్ ఇతర క్రోమోజోముల్లోకి చేరాయి’’ అని వివరించింది. కనుక వై క్రోమోజోమ్ క్షీణించినా దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరదాల్లో ఉంటుందని తెలిపింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment