డీఎన్‌ఏలో మరో సమాచార వ్యవస్థ
మన శరీర కణాల్లోని క్రోమోజోములపై ఉండే జన్యువులే మన రూపురేఖలు, ఆరోగ్య అంశాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నాం. కానీ ఈ నియంత్రణలో ఒక్క జన్యువులే గాకుండా మరో సమాచార వ్యవస్థ కూడా భాగం పంచుకుంటోందని లెయిడెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలన్నింటిలో ఉండే డీఎన్‌ఏ పోగులు, జన్యువులు ఒకేలా ఉన్నా... ఒక్కో అవయవం ఉత్పత్తి చేసే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు వేర్వేరుగా ఎందుకు ఉంటాయన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా పజిల్‌గానే ఉంది.
జన్యు సమాచారానికి అదనంగా మరో సమాచార వ్యవస్థ ఏదో కణాల్లో ఉండి ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. దీనినే లెయిడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు ఈ రెండో సమాచార వ్యవస్థ ఏమిటో తెలుసా? ఒక్కో కణంలోని డీఎన్‌ఏ ఉండ చుట్టుకుని ఉండే తీరే. ఇలా చుట్టుకుని ఉండడం ద్వారా దానిలో కొన్ని జన్యువుల సమాచారం మాత్రమే చదివేందుకు వీలవుతుందని.. అందుకు అనుగుణంగానే ప్రొటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంటే కంటిలో ఉండే కణాల్లోని డీఎన్‌ఏ పోగు అక్కడ అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు మాత్రమే కనిపించేలా ఉండచుట్టుకుని ఉంటే... గుండె కణాల్లో ఆ అవయవానికి తగ్గట్టుగా ముడతలు పడి ఉంటుందన్నమాట! లెయిడెన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా బేకర్ ఈస్ట్, ఫిషన్ ఈస్ట్‌ల డీఎన్‌ఏలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్