Chromosomes
-
మాయమవుతున్న... మగ క్రోమోజోమ్
ఆడా మగా కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్లు అసలు ఆనవాలే లేకుండా పోతే? పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే? అలాంటి సృష్టి వైపరీత్యమే దాపురించబోతోంది! కాకపోతే ఇప్పుడప్పుడే కాదు. ఓ కోటి సంవత్సరాల తర్వాత! అప్పటికల్లా మగవాళ్లలోని వై క్రోమోజోమ్ పూర్తిగా మటుమాయం కానుండటమే ఇందుకు కారణం! నిజానికి జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తోందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95 శాతానికి పైగా కృశించిపోయినట్టు సైంటిస్టులు తేల్చడం విశేషం!! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్‌ను మరో కోటి ఏళ్ల తర్వాత మనం పూర్తిగా మర్చిపోవాల్సిందేనని వాళ్లు హెచ్చరిస్తున్నారు. 1,393 జన్యువులు ఇప్పటికే మాయం ఎక్స్, వై క్రోమోజోములు లింగ నిర్ధారణ కారకాలన్నది తెలిసిందే. అందుకే వాటిని సెక్స్ క్రోమోజోములుగా పిలుస్తారు. ఆడవాళ్లలో రెండు ఎక్స్ క్రోమోజోములు, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. వై క్రోమోజోమ్ వల్ల వృషణాలు తదితర కీలక పురుష పునరుత్పాదక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే దాన్ని మేల్ క్రోమోజోమ్‌గా, ఎక్స్‌ను ఫీమేల్ క్రోమోజోమ్‌గా పిలుస్తారు. ఫలదీకరణ వేళ రెండు ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, ఎక్స్, వై క్రోమోజోములు కలయికతో అబ్బాయి పుడతారు. ఎక్స్‌తో పోలిస్తే పరిమాణంలోనే గాక జన్యువుల సంఖ్యలో కూడా వై క్రోమోజోమే చిన్నది. అందులో ఒకప్పుడు 1,438 జన్యువులుండేవట. గత 30 కోట్ల ఏళ్లలో వాటిలో ఏకంగా 1,393 జీన్స్ లుప్తమైపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 45 జన్యువులు కూడా మరో కోటి ఏళ్లలో పూర్తిగా లుప్తమవుతాయని జెనెటిక్స్ ప్రొఫెసర్, సైంటిస్టు జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ వివరించారు. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్స్‌లో ప్రచురించారు. ఆశ లేకపోలేదు...వై క్రోమోజోమ్ అంతరించినా మగ జాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దానిలోని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్టు జపాన్‌లోని హక్కైడో వర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొచ్చి0ది. ‘‘ఒక రకం చిట్టెలుకల్లో ఇలాగే జరిగింది. వై క్రోమోజోమ్ లుప్తమైపోయినా దానిలోని మేల్ జీన్స్ ఇతర క్రోమోజోముల్లోకి చేరాయి’’ అని వివరించింది. కనుక వై క్రోమోజోమ్ క్షీణించినా దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరదాల్లో ఉంటుందని తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చచ్చేదాకా బతికేస్తాయి.. వీటి వయసు వందలు, వేల ఏళ్లు!
భూమ్మీద ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. ముసలితనం వచ్చేసి, శరీరం ఉడిగిపోయి చనిపోవడమో... ఏదో ప్రమాదం, రోగం వంటి కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు పోవడమో జరగొచ్చు. ఇందులో ప్రమాదం, రోగాలు వంటివేవీ లేకుండా.. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జీవి ఎంతకాలం బతకగలుగుతుందన్న దానిని దాని ఆయుష్షుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు ఉన్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ పెద్ద జీవి.. మళ్లీ పిండంగా మారి.. ఇది సముద్రంలో జీవించి ‘టుర్రిటోప్సిస్ డోహ్రిని’ రకం జెల్లీఫిష్. ఉండేది అర సెంటీమీటరే. పారదర్శక శరీరం, సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్‌తో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రకం జెల్లీఫిష్‌లకు వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా దశలు దశలుగా ఎదుగుతూ పూర్తిస్థాయి జీవిగా మారుతుంది. కానీ ఈ జెల్లీఫిష్ ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పూర్వరూపమైన ‘పాలిప్స్’గా (ఉదాహరణకు పిండం అనుకోవచ్చు) మారిపోతుంది. తర్వాత మళ్లీ జెల్లీఫిష్‌గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందని, సాంకేతికంగా దానికి సహజ మరణం లేనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చేపలో, ఇతర సముద్ర జీవులో వీటిని గుటుక్కుమని మింగేస్తాయి. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్‌లకు మెదడు, గుండె ఉండవట. ప్రతి కణం.. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ ఈ ఫొటోలో కనిపిస్తున్న మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఒక సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలు (స్టెమ్‌సెల్స్)తో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగా, ఏ కణాజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది. దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు. కానీ చేపలు, ఇతర సముద్ర జీవుల తినేయడం, రోగాలు వంటివాటితో హైడ్రాల పని ముగిసిపోతుంది. మానవ పిండం కూడా తొలిదశలో మూలకణాల సమాహారమే. ఆ కణాలే విభజన చెందుతూ.. వివిధ అవయవాలు, ఎముకలు, కండరాలుగా మారుతాయి. పూర్తిస్థాయి మనుషుల్లో ఎముక మజ్జలో మాత్రమే మూలకణాలు ఉంటాయి. వాటిని వివిధ అవయవాలుగా అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. వీటి వయసు వందలు, వేల ఏళ్లు.. ఇవి అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్ స్పాంజ్’లు. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10–15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉండే ‘ఓసియన్ క్వాహోగ్’ రకం ఆల్చిప్పలు. అమెరికా నేషనల్ మ్యూజియం శాస్త్రవేత్తలు 2006లో ఈ రకం ఆల్చిప్పపై పరిశోధన చేసి.. దాని వయసు 507 ఏళ్లు అని గుర్తించారు. 1499వ సంవత్సరంలో అది పుట్టి ఉంటుందని అంచనా వేశారు. ఇది గ్రీన్‌ల్యాండ్ షార్క్. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎనిమిది మీటర్ల పొడవు పెరిగే ఈ షార్క్‌లు 250 ఏళ్లకుపైనే జీవిస్తాయని తొలుత భావించేవారు. అయితే 2016లో వలకు చిక్కిన ఓ గ్రీన్‌ల్యాండ్ షార్క్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. దాని వయసు 392 ఏళ్లు అని తేల్చారు. తాబేళ్లు.. లెక్క తక్కువే.. మనకు స్కూళ్లు, కాలేజీల్లో పాఠాల్లో, ఇతర పుస్తకాల్లో.. భూమ్మీద ఎక్కువకాలం బతికే జంతువు తాబేలు అని చెప్తుంటారు. రెండు వందల ఏళ్లకుపైగా జీవిస్తాయని అంటుంటారు. కానీ వాస్తవంగా.. ఎక్కువకాలం బతికే జీవుల్లో తాబేలు ఓ లెక్కలోకే రాదని శాస్త్రవేత్తలు తేల్చారు. తాబేళ్లలో అన్నింటికన్నా జియాంట్ గలపాగోస్ రకం తాబేళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిలో ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అత్యధిక వయసు 192 ఏళ్లు మాత్రమే. అయితే ఈ తాబేళ్లు ఎలాంటి ఆహారం, నీళ్లు లేకున్నా ఏడాదిపాటు బతకగలవని.. వాటి శరీరంలో ఈ మేరకు నిల్వ ఏర్పాట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే సముద్ర జీవి ‘రెడ్సీ ఉర్చిన్’. పసిఫిక్ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట. తొండలా ఉండే ఈ జీవి పేరు ‘ట్వటరా’. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ఇవి. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. వృద్ధాప్యం ఎందుకొస్తుంది? జీవుల కణాల్లోని క్రోమోజోమ్‌లపై జన్యువులు, క్రోమోజోమ్‌ల అంచుల్లో సన్నని పోగుల్లాంటి టెలోమెర్లు ఉంటాయి. మన వయసు పెరిగిన కొద్దీ, శరీర కణాలు విభజన చెందినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతినడం, టెలోమెర్ల పరిమాణం తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కణాలకు పునరుత్పత్తి చెందే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనితో శరీరం, అవయవాలు బలహీనమై వృద్ధాప్యం వస్తుంది. ఇది సహజ మరణానికి దారితీస్తుంది. ఆయా జీవుల్లో జన్యువుల సామర్థ్యం, ఇతర అంశాల ఆధారంగా వాటి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం బతకడానికి కారణాలేమిటి? ►వయసు పెరిగినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతింటున్నా.. దానిని తిరిగి మరమ్మతు చేసుకునే సామర్థ్యం కొన్నిరకాల జీవుల్లో ఉంటుంది. వాటిలోని కొన్ని ప్రత్యేకమైన జన్యువులే దీనికి తోడ్పడుతుంటాయి. ►కొన్ని ప్రాణులు అవి జీవించే వాతావరణానికి తగినట్టుగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. కణాజాలాలను పునరుత్పత్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో వాటి జీవితకాలం పెరుగుతుంటుంది. ►కొన్నిరకాల షార్కులు, ఎండ్రకాయలు, ఇతర జంతువుల్లో ‘టెలోమెరేస్’ అనే ప్రత్యేకమై ప్రొటీన్ విడుదలవుతుంది. అది కణాల్లో టెలోమెర్లు పొడవు పెరగడానికి తోడ్పడి.. వాటి జీవితకాలం పెరుగుతుంది. ►అత్యంత మెల్లగా ఎదిగే జీవుల్లో చాలా వరకు ఎక్కువకాలం బతుకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో తరచూ కణాల విభజన జరగాల్సిన అవసరం లేకపోవడమే దానికి కారణమని చెప్తున్నారు. -
పెళ్లైన 9 ఏళ్లకు అమ్మాయి కాదని తెలిసింది
కోల్‌కతా: సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఓ మహిళకు అకస్మాత్తుగా షాకింగ్ నిజం తెలిసింది. కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" అని తేలింది. ఈ విచిత్ర ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని బీర్‌భమ్‌కు చెందిన ముప్పై యేళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెను పరీక్షించగా.. టెస్టిక్యులర్(వృషణ) క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో పాటు మరో షాకింగ్ నిజం తెలిసింది. మెడికల్ రిపోర్టులో ఆమె పురుషుడని తేలింది. సాధారణంగా మహిళల్లో XX క్రోమోజోములు ఉంటాయి. కానీ, ఆమెలో మాత్రం పురుషుని వలె XY క్రోమోజోములు ఉన్నాయి. (కరోనాకు భారతీయ మహిళలే ఎక్కువగా బలి!) ఈ విషయం గురించి ఆమెను పరీక్షించిన వైద్యులు డా.దత్త మాట్లాడుతూ.. "ఆమె చూడటానికి అచ్చంగా మహిళలాగే కనిపిస్తుంది. గొంతుతో పాటు అన్ని అవయవాలు అమ్మాయిలానే ఉంటాయి. శరీరంలోనూ మహిళల్లో ఉండే అన్ని హార్మోన్లు ఉన్నాయి. వీటివల్లే ఆమెకు స్త్రీ రూపం వచ్చింది. అయితే ఆమెలో పుట్టుకతోనే గర్భాశయం, అండాశయం లేవు. దీని వల్ల సదరు మహిళకు ఇప్పటికీ రుతుస్రావం జరగలేదు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. 22 వేల మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంది" అని తెలిపారు. (10 ఏళ్ల గ్యాప్‌తో కవలల జన్మ) ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ చేస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కాగా ఆమె పెళ్లి చేసుకుని 9 సంవత్సరాలు అవుతుండగా వీరికి పిల్లలు లేరు. దీని గురించి ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె 28 ఏళ్ల సోదరికి "ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్" ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే జన్యుపరంగా అబ్బాయిలా జన్మించినప్పటికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే కనిపిస్తుంది. వీరి రక్త సంబంధీకుల్లో ఇద్దరికి ఇలాంటి వ్యాధి ఉండటం వల్లే జన్యువుల ద్వారా వీరికి వ్యాపించిందని డా. దత్త తెలిపారు. (కన్నీటితో కడుపు నింపలేక.. ) -
ఈ హార్మోన్.. వయసు తగ్గిస్తుంది
నిత్యయవ్వనంతో జీవించాలని కోరుకోని వారెవరుంటారు చెప్పండి. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో తాజాగా బ్రెజిల్, అమెరికా శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలకమైన ముందడుగు వేశారు. మానవ కణాల్లో వయోభారాన్ని తిరోగమింపజేసే హార్మోన్ ఒకదాన్ని గుర్తించారు. అయితే దీంతో మనం చిరాయువులుగా చేయకపోయినా వయోభారంతో వచ్చే సమస్యలకు మరింత సమర్థంగా చికిత్స అందించడంలో ఉపయోగపడుతుందని అంచనా. ఇంతకీ ఆ హార్మోన్ ఏంటి..? అదెలా పనిచేస్తుంది..? అనే విషయాన్ని ఓ సారి చూద్దాం. ఇది ఓ పురుష హార్మోన్. పేరు డనాజోల్. కృత్రిమంగా తయారు చేసిన ఈ హార్మోన్.. టీలోమరేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. ఈ ఎంజైమ్ మన కణాల్లోని క్రోమోజోమ్‌ల చివరలో ఉండే టీలోమర్లు కుంచించుకుపోకుండా చేస్తాయి. వయసుతోపాటు ఈ టీలోమర్ల పొడవు తగ్గిపోతుందనే విషయం ఇప్పటికే గుర్తించారు. కణ విభజన జరిగిన ప్రతిసారి టీలోమర్ల పొడవు కొంత తగ్గుతుందని, అవి పూర్తిగా లేని స్థితి వచ్చినపుడు కణం చనిపోతుందని బ్రెజిల్‌లోని సా పాలో యూనివర్సిటీ శాస్త్రవేత్త రోడ్రిగో కలాడో చెబుతున్నారు. టీలోమరేజ్ ఎంజైమ్ ఈ ప్రక్రియను నిలిపేస్తుంది కాబట్టి కణ విభజన కొనసాగుతుందన్నమాట. ఈ ఆవిష్కరణతో అప్లాస్టిక్ అనీమియా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
డీఎన్ఏలో మరో సమాచార వ్యవస్థ
మన శరీర కణాల్లోని క్రోమోజోములపై ఉండే జన్యువులే మన రూపురేఖలు, ఆరోగ్య అంశాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నాం. కానీ ఈ నియంత్రణలో ఒక్క జన్యువులే గాకుండా మరో సమాచార వ్యవస్థ కూడా భాగం పంచుకుంటోందని లెయిడెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలన్నింటిలో ఉండే డీఎన్ఏ పోగులు, జన్యువులు ఒకేలా ఉన్నా... ఒక్కో అవయవం ఉత్పత్తి చేసే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు వేర్వేరుగా ఎందుకు ఉంటాయన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా పజిల్‌గానే ఉంది. జన్యు సమాచారానికి అదనంగా మరో సమాచార వ్యవస్థ ఏదో కణాల్లో ఉండి ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. దీనినే లెయిడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు ఈ రెండో సమాచార వ్యవస్థ ఏమిటో తెలుసా? ఒక్కో కణంలోని డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉండే తీరే. ఇలా చుట్టుకుని ఉండడం ద్వారా దానిలో కొన్ని జన్యువుల సమాచారం మాత్రమే చదివేందుకు వీలవుతుందని.. అందుకు అనుగుణంగానే ప్రొటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే కంటిలో ఉండే కణాల్లోని డీఎన్ఏ పోగు అక్కడ అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు మాత్రమే కనిపించేలా ఉండచుట్టుకుని ఉంటే... గుండె కణాల్లో ఆ అవయవానికి తగ్గట్టుగా ముడతలు పడి ఉంటుందన్నమాట! లెయిడెన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా బేకర్ ఈస్ట్, ఫిషన్ ఈస్ట్‌ల డీఎన్ఏలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్