కోల్‌కతా : 30 ఏళ్లుగా మహిళగానే ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా సాధారణ జీవనం సాగిస్తున్న మనిషి మహిళ కాదు అచ్చంగా పురుషుడేనని వైద్యులు తేల్చి చెబితే సదరు వ్యక్తి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ విచిత్రం బయటపడింది. బీర్భమ్ పట్టణానికి చెందిన ఈ మహిళకు తొమ్మిదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇంకా సంతానం కలగలేదు. ఇటీవల పొత్తి కడుపు నొప్పి రావడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె అసలు రూపాన్ని గుర్తించారు. మహిళ కాదు పురుషుడని స్పష్టం చేశారు. పైకి స్త్రీ లక్షణాలే ఉన్నప్పటికీ వృషణాలు శరీరం లోపలే ఉండిపోయాయని, అవి పూర్తిగా అభివృద్ధి చెందలేదని, ఆమెకు నెలసరి రాలేదని చెప్పారు. ప్రతి 22 వేల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆమె(అతడు) టెస్టిక్యులర్ క్యాన్సర్(సెమినోమా)తో బాధపడుతున్నందున కీమోథెరపీ చేస్తున్నామన్నారు. ఆమెకు, అతడి భర్తకు కౌన్సేలింగ్ ఇచ్చామని, ఇష్టమైతే ఎప్పటిలాగే కలిసి జీవించాలని సూచించామని వివరించారు. పురుషుడిగా జన్మించినా భౌతికంగా మహిళ లక్షణాలు ఉండడాన్ని ఆండ్రోజెన్ ఇన్‌సెన్సివిటీ సిండ్రోమ్ అంటారని వైద్యులు తెలిపారు. విచిత్రం ఏమిటంటే.. బాధిత మహిళ ఇద్దరు మేనత్తలు, ఆమె చెల్లెలు(28) కూడా చాలాకాలం తర్వాత పురుషులని స్పష్టంగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment