‘ఎడమ చేతి వాటం’ ఎందుకొస్తుందీ? | What Causes Left Handedness? | Sakshi
Sakshi News home page

‘ఎడమ చేతి వాటం’ ఎందుకొస్తుందీ?

Published Thu, Sep 5 2019 7:48 PM | Last Updated on Thu, Sep 5 2019 8:15 PM

What Causes Left Handedness? - Sakshi

న్యూఢిల్లీ : సాధారణంగా మెజారిటీ మనుషులు కుడిచేతితోనే ఎక్కుమ పనులు చేస్తుంటారు. అందుకు కారణం వారిలో ఎడమ చేయి కొంత బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని మనం రైట్‌ హ్యాండర్స్‌ అని పిలుస్తుంటాం. కొంత మందికి ఏ పనికైనా మనం కుడిచేతిని వాడినట్లుగా వారు ఎడమ చేతిని వాడుతుంటారు. అందుకు కారణం వారిలో కుడి చేయి కాస్త బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని లñ ఫ్ట్‌ హ్యాండర్స్‌ (ఎడమ చేతి వాటంగల వాళ్లు) అని పిలుస్తారు. క్రికెట్‌ భాషలోనైతే ఇది చాలా పాపులర్‌. లెఫ్ట్‌ హ్యాండ్‌ బౌలర్‌ అని, బ్యాట్స్‌మేన్‌ అని స్పష్టంగా పేర్కొంటారు. రైట్‌ హ్యాండ్‌ బాట్స్‌మేన్‌లు లెఫ్ట్‌హ్యాండ్‌ బౌలర్లను ఎదుర్కోవడం కొంత కష్టం కనుకనే అలా లెఫ్ట్‌ హ్యాండర్లకు ప్రాముఖ్యత వచ్చి ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో లెఫ్ట్‌ హ్యాండర్లను దురదృష్టవంతులుగా చిన్న చూపు చూస్తారు. ప్రపంచ భాషల్లోనూ రైట్‌కున్న మంచితనం లెఫ్ట్‌కు లేదు. ఇంగ్లీషు భాషలో రైట్‌ అంటే కరెక్ట్, సముచితమని అర్థం. అదే ఫ్రెంచ్‌లో లెఫ్ట్‌ను ‘గాచే’ అంటారు. అర్థం బాగోలేదు, గందరగోళంగా ఉందని అర్థం.

లెఫ్ట్‌ హ్యాండర్లు వివిధ రంగాల్లో రాణించిన వారున్నారు. భాషా రంగంలో ఎడమ చేతి వాటంగల వాళ్లు రాణించినంతగా కుడిచేతి వాటంగాళ్లు రాణించలేరనే కొత్త విషయం కూడా ఈ తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. అసలు లెఫ్ట్‌ హ్యాండర్లు ఎందుకు అవుతారు? దానికి కారణాలేమిటి? పుట్టుకతోనే ఈ లక్షణాలు వస్తాయా? అలవాట్ల కారణంగా మధ్యలో వస్తాయా? లెఫ్ట్‌ వల్ల వచ్చే లాభ, నష్టాలేమిటి? అన్న అంశాలపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో మెడికల్‌ రీసర్చ్‌ కౌన్సిల్‌ ఫెల్లోగా పనిచేస్తున్న డాక్టర్‌ అఖిర విబర్గ్‌ అధ్యయనం జరపగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రపంచంలో 90 శాతం మంది మనుషులు కుడిచేతి వాటంగల వాళ్లే ఉంటారు. కేవలం పది శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటంగాళ్లు పుడతారు.

పుట్టుకతోనే వారికి ఎడమ చేతి వాటం వస్తుంది. వారి మెదడులో కొంత భాగం కొంత భిన్నంగా ఉంటుందట. ఎడమ చేయి వాటంగల వాళ్లకు తల్లి కడుపులో ఉండగానే మెదడు నిర్మాణంలో మార్పు వస్తుందట. భాషకు సంబంధించి వారి మెదడులో కుడి, ఎడమ భాగాలు మంచి అవగాహనతో పనిచేస్తాయట. అందుకనే వారికి భాషా ప్రావీణత ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాలను బ్రిటన్‌ బయోబ్యాంక్‌లో ఉన్న నాలుగు లక్షల మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో 38,332 మంది ఎడమ చేతి వాటంగల వాళ్లు ఉన్నారని తేలింది. ఎడమ చేతి వాటంగల వాళ్లలో మెదడులో నిర్మాణం ఒకే తీరుగా లేదని, కొందరిలోనే ఏక రీతి నిర్మాణం కనిపించిందని పరిశోధకులు తెలిపారు.

ఎడమ చేతి వాటం రావడానికి అసలు కారణం జన్యువులేనని, అధ్యయనంలో కచ్చితంగా ఆ జన్యువులను గుర్తించలేక పోయినప్పటికీ అవి ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామని వారు చెప్పారు. ఎడమ చేతి వాటంగల వాళ్లలో భాషా ప్రవీణత ఒకటే కాకుండా తర్కంలో కూడా వారిదే పైచేయి అవుతుందని వారు తెలిపారు.

ఎడమ చేతి వాటంగల ప్రముఖులు : లియోనార్డో డావిన్సీ, పీలే, డియాగో మరడోనా, మట్‌ గ్రోనింగ్, కుర్త్‌ కొబేన్, టామ్‌ క్రూజ్, మార్లిన్‌ మాన్రో, నికొలే కిడ్మన్, జిమ్‌ కేరి, స్కార్‌లెట్‌ జొహాన్సన్, బ్రూస్‌ విల్లీస్, జెన్నిఫర్‌ లారెన్స్, సారా జెస్సికా పార్కర్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement