left hand writing
-
ఎడమ చేతి వాటం, ఎన్నో ప్రత్యేకతలు.. తెలివి తేటలు, గ్రహించే శక్తి అన్నీ ఎక్కువే
సాక్షి, కర్నూలు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది ఎడమ చేతి వాటం (లెఫ్ట్ హ్యాండర్స్) కలిగి ఉన్నారు. వీరెక్కడ కనబడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్ అన్నాడో సినీ కవి. ఎడమ చేతి వాటం కేవలం జన్యుప్రభావం వల్ల ఎర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్‌హ్యాండర్స్ డేగా జరుపుకుంటున్నారు. కుడి చేతి వాటం కలిగిన వారి కన్నా ఎడమ చేతి వాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని, వారికి తెలివి తేటలు, గ్రహించే శక్తితో పాటు మంచి అలోచన శక్తి ఉంటుందని అంటారు. అంతేకాదు ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎడమ చేతితోనే రాస్తారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బిల్‌క్లింటన్, సినీ నటుడు అమితాబ్, సావిత్రి ఇలా ఎందరో లెఫ్ట్‌హ్యాండ్ వాటం వారే. ఎడమ చేతి వాటం ఉన్న వారిలో క్రియేటివిటీ, మ్యూజిక్, ఆర్ట్స్ అధికంగా ఉంటాయి. వీరికి మాట్లడే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం మెండుగా ఉంటుంది. వీరి ప్రత్యేకతల్లో కొన్ని ►చేతులకు ఉన్నట్లే కాళ్లకు కూడా వాటం ఉంటుంది. కుడి చేతి వాటం ఉన్న వారిలో కుడికాలు వాడకం, ఎడమ చేతి వాటం ఉన్న వారు ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఎదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. ►మహిళలకు మాత్రం సృజనాత్మకతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ►ఎడమ చేతివాటం వారు వేగంగా, సులభంగా పనులు మంచి టెక్నిక్‌తో పూర్తి చేస్తారు. వీరికి మెమొరీ పవర్, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలు వెంటనే మరచిపోగలరు. వారికీ ఇబ్బందులు.. ఎడమ చేతి వాటం వాళ్లలో టైలర్లు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, సూయింగ్ మిషన్ డిజైన్ పూర్తిగా కుడి చేతి వారికి సరిపోయే విధంగా తయారై ఉంటాయి. కంప్యూటర్ మౌస్, డ్రైవింగ్ చేసేవారు ఇలా ఎందరో ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం వారి కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్లు తయారవుతున్నాయి. ►ఈ చిత్రంలో కపిస్తున్న బాలిక పేరు షాజిదాబి (లెఫ్ట్ హ్యాండర్). క్రిష్టిపాడు గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, ఉసేన్బీల రెండో కూతురు. బాలిక ప్రస్తుతం ఉయ్యాలవాడ మండలం హరివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుంది. చదువులో ముందంజలో ఉంటుంది. తెలుగు, ఆంగ్లం కంటే హిందీ రైటింగ్ బాగా రాస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బాలిక చెల్లెలు రిజ్వానతో పాటు మేనత్త కొడుక్కి ఎడమ చేతివాటం ఉండటం గమనార్హం. ►ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నోడి పేరు శివకేశవ (లెఫ్ట్ హ్యాండర్). దొర్నిపాడులోని ఎంపీపీ స్పెషల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. క్యారమ్స్ క్రీడలో చురుగ్గా రాణిస్తున్నాడు. చదువుతో పాటు క్రీడల్లో ముందుంటాడని టీచర్లు చెబుతున్నారు. ►ఇక్కడ చిత్రలేఖనం చేస్తూ కనిపిస్తున్న బాలిక పేరు మానస (లెఫ్ట్ హ్యాండర్). డబ్ల్యూ.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుంది. చదువుతో పాటు చిత్రలేఖనంలో రాణిస్తుంది. తమ కుటుంబంలో ఎవరికీ ఎడమ చేతి వాటం లేదని మానసకు మాత్రమే వచ్చిందని తండ్రి బాలచంద్రుడు పేర్కొన్నాడు. జన్యు మార్పులతోనే ఎడమ చేతివాటం ఒక మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీర భాగాన్ని మెదడు ఎడమవైపు భాగం నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం వస్తుంది. మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్‌గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దు. వయస్సు పెరిగే కొద్ది సాంప్రదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని మన పద్ధతులను బట్టి నడుచుకోగలరు. –డాక్టర్ నాగేంద్ర, దొర్నిపాడు పీహెచ్సీ -
ఎడమ చేతి అలవాటుకు కారణం ఇదేనా?
International Lefthanders Day 2021: ఈ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. వందలో 90 మంది కుడి చేతి వాటం వాళ్లే ఉండగా, ఎడమ చేతి వాటం వాళ్లు(లెఫ్ట్ హ్యాండర్స్) చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే వీరెక్కడ కనపడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నడో సినీ కవి. కానీ, లెఫ్ట్ హ్యాండర్స్ గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలు వాళ్లకే అనుకూలంగా ఉంటున్నాయి కూడా. ఈ తరహా లాభాన్ని సైంటిఫిక్‌గా ‘నెగటివ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సెలక్షన్’ అంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ జెనెటిక్ డిజార్డర్ అని చాలా మంది పొరపడుతుంటారు. అంతేకాదు వీళ్లు రోగ నిరోధక శక్తి సంబంధిత వ్యాధులతో త్వరగా చనిపోతారనే ఒక ప్రచారం నడిచేది అప్పట్లో. మనుషుల్లో ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుందో శాస్త్రీయమైన కారణాలను నేటికీ కనుగొనలేకపోవడం విశేషం. అది పుట్టుకతోగానీ, బలవంతంగాగానీ వచ్చే అలవాటు ఎంతమాత్రం కాదు. కానీ, శరీర అంతర్నిర్మాణ పనితీరుపై ఆధారపడుతుందన్న ఒక కారణం మాత్రం చెబుతుంటారు సైంటిస్టులు. మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్థ భాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీరాన్ని మెదడు ఎడమ అర్ధ భాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడమవైపు ఉండే శరీర భాగాన్ని మెదడులోని కుడి అర్థభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధ భాగం బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం రావొచ్చనే ఒక అభిప్రాయం మాత్రం చాలామంది సైంటిస్టుల్లో ఉండగా, జెనెటిక్ ఎఫీషియన్సీ మీద కూడా ఆధారపడి ఉండొచ్చని మరికొందరు సైంటిస్టులు భావిస్తున్నారు. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఈ భూమ్మీద ఏడు నుంచి పది శాతం జనాభా.. ఎడమ చేతి వాటం వాళ్లే ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డే ఉంది. ‘‘ఆగస్టు 13’’న జరుపుతున్నారు. 1976 నుంచి ప్రతీ ఏటా జరుపుతున్నారు. అమెరికా సైన్యంలో పని చేసిన డీన్ ఆర్ క్యాంప్‌బెల్ ఈ దినోత్సవానికి మూలం. ఈయనే లెఫ్ట్హ్యాండర్స్ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించాడు. ఈ రోజున లెఫ్టీస్ ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై అవగాహన కార్యక్రమాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. లెఫ్టీస్ క్లబ్‌లు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటాయి. మాన్పించడం మంచిదేనా? ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు ఎడమ? కుడి? చేతి వాటం వాళ్లు అన్నది గుర్తించవచ్చు. కానీ, కొందరు తల్లిదండ్రులు ఎడమ చేతి వాటాన్ని ఒక చెడు అలవాటుగా భావిస్తారు. బలవంతంగా ఆ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అది పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక వైద్యులు. బ్రెయిన్ డిసీజ్లతోపాటు నత్తి, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిని శరీర నిర్మాణ క్రమంలో భాగంగానే భావించాలి తప్పా... కీడుగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారిని కొందరైతే పరిశుభ్రత లేనివారుగా, వింతమనుషులుగానూ చూస్తుంటారు. లెఫ్టీస్లో హోమో సెక్సువల్స్ ఎక్కువనే అపోహ కూడా వెస్ట్రన్ కంట్రీస్‌లో నడుస్తుంటుంది. ఈరోజుల్లో ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు మాత్రం లెఫ్టీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాళ్లను తప్పుడు మనుషులుగా పొరపడేవాళ్లు. మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవాళ్లట. అదే అనుమానంతో కొందరిని చంపిన సందర్భాలూ చరిత్రలో చాలానే ఉన్నాయి. ఐక్యూ లెవెల్ ఎడమ చేతివాటం వాళ్లను లెఫ్టీ, సినిస్ట్రాల్, సౌత్ పా, లెఫ్ట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండర్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. నటుడు చార్లీ చాప్లిన్, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్, మైక్రోస్టాఫ్ అధినేత బిల్ గేట్స్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. మన దేశానికొస్తే.. మహాత్మా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు అమితాబ్ బచ్చాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, నిర్మాత కరణ్ జోహర్.. అబ్బో ఇలా చెప్పు కుంటూ పోతే లెఫ్ట్ హ్యాండ్ యూజర్ల లిస్ట్ పెద్దదే ఉంది. దీంతో ఎడమ చేతివాటం వాళ్లంతా తెలివిగలవాళ్లనే విషయం ప్రచారంలో ఉంది. అయితే కుడి చేతి వాటం వాళ్లతో పోలిస్తే లెఫ్టీస్లో ఐక్యూ లెవల్ నిజంగానే ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే శక్తి, వేగం, సామర్ధ్యం, అర్థం చేసుకోగల శక్తిసామర్థ్యాలు, భావప్రకటనలో స్పష్టత వీరిలోనే బాగుంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మెదడులో కుడి, ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే ‘కార్పస్ కల్లోజమ్’ ఎడమ చేతివాళ్లలో ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో బ్రెయిన్ చురుగ్గా, సమర్థవంతంగా పని చేయడానికి ఇదొక కారణమని వివరిస్తున్నారు. యాంబీడెక్సాట్రాస్ చేతి అలవాటును పెద్దయ్యాక కూడా కొందరు స్వచ్ఛందంగా మార్చుకుంటారు. ఆ అలవాటు చాలా మంచిదంటున్నారు వైద్యులు. దీని వల్ల ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ల మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్తున్నారు. మరింత చాకచక్యంగా తమ పనులను నిర్వహించుకోవడానికి వీలుంటుంది. రెండు చేతుల్ని సమానంగా, సునాయసంగా వినియోగించుకోగలుగుతారు. వీళ్లని ‘యాంబీడెక్సాట్రాస్’ అని పిలుస్తుంటారు. ప్రత్యేకంగా మార్కెట్ ‘లెఫ్టీస్’ కష్టాలు మాములుగా ఉండవు. నిత్యం ఉపయోగించే వస్తువులు అందుబాటులో ఉండవు. కొందరు ఆ సమస్యల్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో ఉండడం లేదు. అందుకే లెఫ్టీస్ కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు వెలిశాయి. అవి ప్రత్యేకంగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లకి మాత్రమే వస్తువుల్ని అమ్ముతున్నాయి. కత్తెరలూ, కప్పులూ, పెన్నులూ, పెన్సిళ్లూ, నోటు పుస్తకాలూ... ఇంకా చాలా వస్తువుల్ని ఎడమ చేతివాటం వాళ్లకు అనుకూలంగా డిజైన్ చేస్తాయి ఆ కంపెనీలు. వంట గదిలో ఉపయోగించే కప్పులూ, గరిటెలూ, స్పూన్లు కూడా దొరుకుతాయి. పెన్నులు, వాచీలు, గిటార్లు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా కొన్ని.. చేతులకు ఉన్నట్లే.. కాళ్ల వాటం కూడా ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్నవారిలో కుడికాలి వాడకం, ఎడమచేతి వాడకం ఉన్నవారిలో ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు ఏదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. అది అసంకల్పిత చర్య. జంతువులూ, పక్షులకు కూడా ఎడమ చేతివాటం ఉంటుంది. కాబట్టి కొన్ని పక్షులకు ఎడమవైపు రెక్కలు బలంగా ఉంటాయి. కుక్కలు, చింపాంజీలు, గుర్రాలు, తిమింగలాల్లో కూడా పిండదశలోనే జన్యుపరంగా ఎడమవాటం రూపుదిద్దుకుంటుంది. -సాక్షి, వెబ్‌డెస్క్ -
‘ఎడమ చేతి వాటం’ ఎందుకొస్తుందీ?
న్యూఢిల్లీ : సాధారణంగా మెజారిటీ మనుషులు కుడిచేతితోనే ఎక్కుమ పనులు చేస్తుంటారు. అందుకు కారణం వారిలో ఎడమ చేయి కొంత బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని మనం రైట్ హ్యాండర్స్ అని పిలుస్తుంటాం. కొంత మందికి ఏ పనికైనా మనం కుడిచేతిని వాడినట్లుగా వారు ఎడమ చేతిని వాడుతుంటారు. అందుకు కారణం వారిలో కుడి చేయి కాస్త బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని లñ ఫ్ట్ హ్యాండర్స్ (ఎడమ చేతి వాటంగల వాళ్లు) అని పిలుస్తారు. క్రికెట్ భాషలోనైతే ఇది చాలా పాపులర్. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అని, బ్యాట్స్‌మేన్ అని స్పష్టంగా పేర్కొంటారు. రైట్ హ్యాండ్ బాట్స్మేన్లు లెఫ్ట్‌హ్యాండ్ బౌలర్లను ఎదుర్కోవడం కొంత కష్టం కనుకనే అలా లెఫ్ట్ హ్యాండర్లకు ప్రాముఖ్యత వచ్చి ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో లెఫ్ట్ హ్యాండర్లను దురదృష్టవంతులుగా చిన్న చూపు చూస్తారు. ప్రపంచ భాషల్లోనూ రైట్కున్న మంచితనం లెఫ్ట్‌కు లేదు. ఇంగ్లీషు భాషలో రైట్ అంటే కరెక్ట్, సముచితమని అర్థం. అదే ఫ్రెంచ్‌లో లెఫ్ట్‌ను ‘గాచే’ అంటారు. అర్థం బాగోలేదు, గందరగోళంగా ఉందని అర్థం. లెఫ్ట్ హ్యాండర్లు వివిధ రంగాల్లో రాణించిన వారున్నారు. భాషా రంగంలో ఎడమ చేతి వాటంగల వాళ్లు రాణించినంతగా కుడిచేతి వాటంగాళ్లు రాణించలేరనే కొత్త విషయం కూడా ఈ తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. అసలు లెఫ్ట్ హ్యాండర్లు ఎందుకు అవుతారు? దానికి కారణాలేమిటి? పుట్టుకతోనే ఈ లక్షణాలు వస్తాయా? అలవాట్ల కారణంగా మధ్యలో వస్తాయా? లెఫ్ట్ వల్ల వచ్చే లాభ, నష్టాలేమిటి? అన్న అంశాలపై ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ఫెల్లోగా పనిచేస్తున్న డాక్టర్ అఖిర విబర్గ్ అధ్యయనం జరపగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రపంచంలో 90 శాతం మంది మనుషులు కుడిచేతి వాటంగల వాళ్లే ఉంటారు. కేవలం పది శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటంగాళ్లు పుడతారు. పుట్టుకతోనే వారికి ఎడమ చేతి వాటం వస్తుంది. వారి మెదడులో కొంత భాగం కొంత భిన్నంగా ఉంటుందట. ఎడమ చేయి వాటంగల వాళ్లకు తల్లి కడుపులో ఉండగానే మెదడు నిర్మాణంలో మార్పు వస్తుందట. భాషకు సంబంధించి వారి మెదడులో కుడి, ఎడమ భాగాలు మంచి అవగాహనతో పనిచేస్తాయట. అందుకనే వారికి భాషా ప్రావీణత ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాలను బ్రిటన్ బయోబ్యాంక్‌లో ఉన్న నాలుగు లక్షల మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో 38,332 మంది ఎడమ చేతి వాటంగల వాళ్లు ఉన్నారని తేలింది. ఎడమ చేతి వాటంగల వాళ్లలో మెదడులో నిర్మాణం ఒకే తీరుగా లేదని, కొందరిలోనే ఏక రీతి నిర్మాణం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఎడమ చేతి వాటం రావడానికి అసలు కారణం జన్యువులేనని, అధ్యయనంలో కచ్చితంగా ఆ జన్యువులను గుర్తించలేక పోయినప్పటికీ అవి ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామని వారు చెప్పారు. ఎడమ చేతి వాటంగల వాళ్లలో భాషా ప్రవీణత ఒకటే కాకుండా తర్కంలో కూడా వారిదే పైచేయి అవుతుందని వారు తెలిపారు. ఎడమ చేతి వాటంగల ప్రముఖులు : లియోనార్డో డావిన్సీ, పీలే, డియాగో మరడోనా, మట్ గ్రోనింగ్, కుర్త్ కొబేన్, టామ్ క్రూజ్, మార్లిన్ మాన్రో, నికొలే కిడ్మన్, జిమ్ కేరి, స్కార్లెట్ జొహాన్సన్, బ్రూస్ విల్లీస్, జెన్నిఫర్ లారెన్స్, సారా జెస్సికా పార్కర్ తదితరులు ఉన్నారు. -
ఓ తండ్రి ఆవేదన.. ‘ద లెఫ్ట్ హ్యాండ్ షాప్’
చెట్టు నుంచి యాపిల్ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి న్యూటన్‌కు ప్రేరణ అయింది. తన కొడుకు స్కూల్లో మిగతా విద్యార్థులకంటే ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన కొత్త ఉత్పత్తుల అంకురార్పణకు దారి తీసింది. అదే ‘ద లెఫ్ట్ హ్యాండ్ షాప్’. ఏమిటి దీని ప్రత్యేకత మనకు స్టేషనరీ కావాలంటే షాష్‌కు వెళ్లి ఓ పెన్నో, పెన్సిలో, రబ్బరో, ఎరేజరో కొనుక్కుంటాం..అయితే మీకు ఎడమ చేతి వాటం ఉందా? ప్రతీ పనికి ఎక్కువగా మీరు ఎడమ చేతిని ఉపయోగిస్తారా? మన చేతికనుగుణంగా మనం సులభంగా ఆయా వస్తువులను వాడేందుకు వీలుగా ఇప్పుడు ‘లెఫ్ట్‌హ్యాండ్’ వస్తువులు ఆన్లైన్లో లభిస్తున్నాయి. లెప్ట్‌హ్యాండ్ పెన్, లెఫ్ట్‌హ్యాండ్ పెన్సిల్, లెఫ్ట్‌హ్యాండ్ సిజర్స్, స్కేళ్లు, ఏరేజర్స్, షార్ప్నర్స్...ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మొత్తం జనాభాలో పది శాతం ఎడమచేతి వాటం కలిగిన వారని ఓ అంచనా. అయితే మెజార్టీ కుడిచేతి వాటం కలిగిన వారే కావడంతో మనం ఉపయోగించే వస్తువులన్నీ కుడిచేతితో ఉపయోగించే విధంగానే తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎడమ చేతి వాటం కలిగిన వారు ఉపయోగించే విధంగా స్టేషనరీ, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఈ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే విదేశీ వస్తువులే ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువగా ఉండడంతో ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశీయంగా ఆయా వస్తువులు తయారు చేస్తున్నారు. అవి కూడా ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. ఏమిటి తేడా లెఫ్ట్‌హ్యాండ్ కత్తెరకు బ్లేడ్లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడూ ఎడమ చేతి వైపు ఉంటుంది. దీని వల్ల కత్తిరించాలనుకున్న భాగాన్ని సులభంగా కట్ చేసే వీలవుతుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్వ దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు వారి ఎడమ చేతి వాటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేయబడ్డాయి. ఎలా మొదలైంది పూణేకు చెందిన పవిత్తర్ సింగ్ తన కొడుకు స్కూల్లో మిగతా విద్యార్థులకంటే ఆలస్యంగా రాయడాన్ని గమనించాడు. పెన్సిల్‌తోనే కాదు పెన్తోనూ ఇలానే రాస్తున్నాడు. దీనికి గల కారణాన్ని అతడు కనిపెట్టాడు. తన కొడుకుది ఎడమ చేతివాటం. అతడు వాడే వస్తువులన్నీ కుడిచేతి వాటం వాళ్లు రాయడానికి, వాడడానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆ వస్తువుల కోసం ఆన్లైన్లో వెతక్కా అందుబాటులో ఉన్నా ధర ఎక్కువగా ఉంది. ఒక్కో పెన్ను రూ. 1500 , షార్ప్‌నర్ రూ. 600 వరకు «దరలు ఉన్నాయి. దీంతో ఎడమచేతి వాటం వారు ఉపయోగించే వస్తువుల కోసం సింగ్ ‘ ద లెఫ్ట్‌హ్యాండ్ షాప్’ పేరుతో దేశంలోనే మొట్టమొదటగా ఓ కంపెనీని ప్రారంభించారు..‘ మై లెఫ్ట్’ బ్రాండ్ పేరుతో స్కూల్ స్టేషనరీ, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించడం మొదలు పెట్టారు. రూ. 99కి స్కూల్ స్టేషనరీ కిట్‌ను అందుబాటులో తెచ్చారు. ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. ఎడమ, కుడిచేతి వాటం కలిగిన ఇద్దరూ ఉపయోగించే విధంగా వస్తువుల తయారీపై తాజాగా దృష్టి పెట్టినట్లు సింగ్ తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ కూడా సింగ్‌తో టై అప్ అయింది. అయితే పూర్తిస్థాయిలో మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉందని చెబుతున్నారు. ఇతర దేశాల్లోనూ ఈ వస్తువులు అమ్మేందుకు ప్రత్యేక స్టోర్లు ఉన్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం ఈ తరహా వస్తువులపై అవగాహన కల్గించేందుకు మహారాష్ట్రలో ఎడమ చేతి వాటం కల్గిన పిల్లల తల్లిదండ్రులు 160 మంది వరకు కలిసి ఓ వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేసుకున్నారు. ఫేస్బుక్ గ్రూప్‌లు, లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకుని వీటి గురించి విస్త్రతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ సాధారణ వస్తువులను వాడుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు అందుకే వీరికి అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నామని పూణే వాసి ఒకరు తెలిపారు. -
కుడి ఎడమైతే..!
కొత్తగా పరిచయమైన వ్యక్తి ఎవ్వరైనా పెన్నందుకొని ఏదైనా రాస్తున్నారంటే, వాళ్లు రాస్తున్నప్పుడు చూస్తూ అడగగల ప్రశ్నలు మహా అయితే ఏముంటాయ్? ‘‘ఏం రాస్తున్నావ్?’’ అని అడుగుతారేమో! నాకు మాత్రం ఎన్ని ప్రశ్నలొస్తాయో తెల్సా.. ‘‘హే నువ్వు లెఫ్ట్హ్యాండరా?’’ ఆశ్చర్యంగా! ‘‘అయ్యా! నువ్వు లెఫ్ట్‌హ్యాండ్‌తో రాస్తావా?’’ మరింత ఆశ్చర్యంగా! వీటికి చాలాసార్లు ‘‘అవును’’ అని కాస్తంత గర్వంగా సమాధానం ఇస్తూంటా. ఇంతవరకు బాగుంది. చాలా బాగుంది. ఆ తర్వాతే కొన్ని వెటకారపు ప్రశ్నలు కూడా రావొచ్చు. సినిమాల్లో విలన్ పాత్రలకే ఎడమచేతి వాటం ఎక్కువగా పెడుతుంటారు. డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా ఎడమ చేతిని వాడొద్దని వారిస్తూంటారు. ఎంత తక్కువ చూపో కదా? మరేం పర్లేదు. మాకు కూడా చెప్పుకోవడానికి ఓ రోజు (ఆగస్టు 13) ఉంది. మాలాగే ప్రపంచం మొత్తమ్మీద 10 శాతం జనాభా ఉన్నారు. మాకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ (నిజంగానే!) ఉంది. మా కథ ఇది.. ఎప్పుడు తెలుస్తుంది? ఎడమ చేతి వాటమా, కుడి చేతి వాటమా అన్నది ఎప్పుడు తెలుస్తుందీ? చిన్నప్పుడే ఏ చెయ్యిని ఎక్కువగా వాడుతున్నామో దాన్నిబట్టి చెప్పేస్తాం కానీ, ఏ చెయ్యితో రాస్తామన్నదే కచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ప్రామాణికంగా చేసుకున్నాం(రు). నిజానికి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ ఏ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంటుందో గమనించి ఏ చేతివాటమో చెప్పేయొచ్చు. సైన్స్ ఎప్పట్నుంచో ఎడమ చేతి వాటంపై పరిశోధనలు చేస్తూనే ఉంది. మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్, జీన్స్‌లో చిన్న చిన్న మార్పులు దీనికి కారణమని ప్రస్తుతానికి ఒక దగ్గర ఆగారు. ఎన్నెన్ని ఇబ్బందులో! ‘‘వీడేంటీ ఎడమచేతి వాటంలా ఉన్నాడు?’’ అని ఇంట్లో వాళ్లు అనుకోవడం దగ్గర్నుంచి మొదలవుతాయి ఇబ్బందులు. కొంతమంది ‘మా పిల్లలు స్పెషల్’ అని సంబరపడతారు. ఇంకొందరు ‘చెయ్యి మార్చు.. చెయ్యి మార్చు’ అని బాధపెడతారు. ఇప్పుడైతే బాధపెట్టడం తగ్గిందనే చెప్పొచ్చు. సో, ఎడమచేతి వాటాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసేసింది సమాజం! ఇబ్బందులు యాక్సెప్ట్ చేయడంతో ఆగిపోవు కదా.. కొన్ని ఉన్నాయి అలాంటివి. మరీ చిన్న వయసులో అంటే పెన్సిల్, షార్ప్‌నర్ తెగ ఇబ్బంది పెట్టే వస్తువులు. ఇక కొంచెం పెద్దయ్యాక డోర్లు తెరవడం కాస్త ఇబ్బంది పెట్టేదే! రైట్ హ్యాండెడ్ కుర్చీలు ఉంటాయి.. ఎంత కష్టంగా ఉంటుందో! కంప్యూటర్ నేర్చుకునే కొత్తలో మౌస్ వాడడం అంటే ఏదో యుద్ధంలోకి దిగినట్టు చెయ్యి వణికిపోతుంది (కుడి చెయ్యే వాడాలి కదా!). కత్తెర.. బాబోయ్ ఇదీ అసలైన పరీక్షంటే! కుడిచేత్తో తినడం బాగానే అలవాటైపోతుంది కానీ, స్పూన్ పట్టుకుంటే మాత్రం ఎడమ చెయ్యి వాడాల్సిందే! (చూసేవాళ్లు వింతగా చూస్తారే!!) వడ్డించమని ఎవరైనా అడిగితే నవ్వును సమాధానంగా ఇస్తాం చూడూ.. ఇందుకే! చెప్పుకుంటూ పోతే ఎదిగే ప్రతి దశలో ఓ సవాల్ ఉంటుందంటారు. వాడే వస్తువుల్లో, అలవాటైన చిన్న చిన్న పనుల్లోనూ సవాళ్లుంటాయని ఎడమచేతి వాటం పరిచయం చేస్తుంది. అందుకే ఓ సెపరేట్ మార్కెట్! లెఫ్ట్హ్యాండర్స్కు ఓ మార్కెట్ ఉంది తెల్సా? ఇది వింతగానే కనిపించినా నిజం. కుడిచేతి వాటం వారికి తయారు చేసిన వస్తువులన్నీ వాడలేక ఇబ్బంది పడే ఎడమచేతి వాటం గాళ్ల కోసం ప్రత్యేకంగా అన్ని వస్తువులూ తయారు చేస్తున్నారు. కత్తెర, గిటార్ దగ్గర్నుంచి ఎన్నో వస్తువులు ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కొంచెం స్పెషల్ ప్రోడక్ట్స్ కదా.. ఖర్చూ ఎక్కువే మరి!! ఇదీ స్పెషల్! మెదడులో కుడి, ఎడమ అని రెండు భాగాలుంటాయి. కుడి చేత్తో చేసే పనుల వల్ల ఎడమ వైపుండే భాగం యాక్టివేట్ అవుతుంది. ఎడమ చేత్తో చేసే పనుల వల్ల కుడివైపుండే భాగం యాక్టివేట్ అవుతుంది. ఇందుకే ఎడమచేతి వాటం వాళ్లలో కుడి వైపు భాగం చురుగ్గా పనిచేస్తుంది. ఈ భాగం షార్ప్‌గా, క్రియేటివ్‌గా ఆలోచింపజేసేలా చేస్తుందని అంటారు. ఇది స్పెషలే మరి! వీళ్లు టాప్.. వీళ్లు స్పెషల్ కూడా! ప్రతి రంగంలో టాప్ అనిపించుకున్న వారిలో లెఫ్ట్ హ్యాండర్స్ చాలామందే ఉన్నారు. సినిమాల్లో ఒక అమితాబ్ బచ్చన్, క్రికెట్లో ఓ సచిన్ టెండూల్కర్, బిజినెస్‌లో బిల్‌గేట్స్, మార్క్ జూకర్బర్గ్, పాలిటిక్స్‌లో బరాక్ ఒబామా, నరేంద్ర మోదీ.. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్లంతా టాప్.. అదే వీళ్లంతా స్పెషల్ అనే జాబితా పెద్దదే! చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. లెఫ్ట్ హ్యాండర్స్గా పుట్టడం అనేదేం పెద్ద నేరం కాదు. పిల్లాడు ఎడమ చెయ్యి పట్టాడని ఏ తండ్రో చెయ్యి కాల్చి, కుడి చెయ్యిని పట్టించాడట. ఇంత స్పెషల్ పిల్లలను అలా చూడడం తప్పు కదూ..! సవాళ్లను ఎదుర్కొని మరీ టాప్ అనిపించుకోవట్లేదూ..!! లెఫ్ట్ హ్యాండర్స్ పడే ఇబ్బందులను, వారి ఆలోచనలను, చుట్టూ ఉండే పరిస్థితులను ప్రపంచానికి పరిచయం చేయడానికి లెఫ్ట్ హ్యాండర్స్ డే పుట్టింది. దీన్ని1976లో మొదటిసారిగా నిర్వహించారు. – వి. మల్లికార్జున్