ఓ తండ్రి ఆవేదన.. ‘ద లెఫ్ట్‌ హ్యాండ్‌ షాప్‌’ | The Left Hand Shop Is Special for Lefties | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 7:15 PM | Last Updated on Sat, Sep 8 2018 7:22 PM

The Left Hand Shop Is Special for Lefties - Sakshi

చెట్టు నుంచి యాపిల్‌ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి న్యూటన్‌కు ప్రేరణ అయింది. తన కొడుకు స్కూల్‌లో మిగతా విద్యార్థులకంటే ఎందుకు ఆలస్యంగా  రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన కొత్త ఉత్పత్తుల అంకురార్పణకు దారి తీసింది. అదే  ‘ద లెఫ్ట్‌ హ్యాండ్‌  షాప్‌’.

ఏమిటి దీని ప్రత్యేకత
మనకు స్టేషనరీ కావాలంటే షాష్‌కు వెళ్లి ఓ పెన్నో, పెన్సిలో, రబ్బరో, ఎరేజరో కొనుక్కుంటాం..అయితే మీకు ఎడమ చేతి వాటం ఉందా? ప్రతీ పనికి ఎక్కువగా మీరు ఎడమ చేతిని ఉపయోగిస్తారా? మన చేతికనుగుణంగా మనం సులభంగా ఆయా వస్తువులను వాడేందుకు వీలుగా ఇప్పుడు ‘లెఫ్ట్‌హ్యాండ్‌’ వస్తువులు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. లెప్ట్‌హ్యాండ్‌ పెన్, లెఫ్ట్‌హ్యాండ్‌ పెన్సిల్, లెఫ్ట్‌హ్యాండ్‌ సిజర్స్, స్కేళ్లు, ఏరేజర్స్, షార్ప్‌నర్స్‌...ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు.

మొత్తం  జనాభాలో పది శాతం ఎడమచేతి వాటం కలిగిన వారని ఓ అంచనా. అయితే మెజార్టీ కుడిచేతి వాటం కలిగిన వారే కావడంతో మనం ఉపయోగించే వస్తువులన్నీ కుడిచేతితో ఉపయోగించే విధంగానే తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎడమ చేతి వాటం కలిగిన వారు ఉపయోగించే విధంగా స్టేషనరీ, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఈ వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది. అయితే  విదేశీ వస్తువులే ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఎక్కువగా ఉండడంతో ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశీయంగా ఆయా వస్తువులు తయారు చేస్తున్నారు. అవి కూడా ఇప్పుడు మార్కెట్‌లోకి  అందుబాటులోకి రావడంతో తక్కువ ధరలకే దొరుకుతున్నాయి.

ఏమిటి తేడా
లెఫ్ట్‌హ్యాండ్‌ కత్తెరకు బ్లేడ్‌లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్‌ ఎప్పుడూ ఎడమ చేతి వైపు ఉంటుంది. దీని వల్ల కత్తిరించాలనుకున్న   భాగాన్ని సులభంగా కట్‌ చేసే వీలవుతుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. పెన్‌కు ఉండే నిబ్‌ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్‌ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్‌ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను  ఉంచి అపసవ్వ దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు వారి ఎడమ చేతి వాటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేయబడ్డాయి.  

ఎలా మొదలైంది
 పూణేకు చెందిన పవిత్తర్‌ సింగ్‌ తన కొడుకు స్కూల్‌లో మిగతా విద్యార్థులకంటే ఆలస్యంగా రాయడాన్ని గమనించాడు. పెన్సిల్‌తోనే కాదు పెన్‌తోనూ ఇలానే  రాస్తున్నాడు. దీనికి గల కారణాన్ని అతడు కనిపెట్టాడు. తన కొడుకుది ఎడమ చేతివాటం. అతడు వాడే వస్తువులన్నీ కుడిచేతి వాటం వాళ్లు రాయడానికి, వాడడానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆ వస్తువుల కోసం ఆన్‌లైన్‌లో వెతక్కా అందుబాటులో ఉన్నా ధర ఎక్కువగా ఉంది. ఒక్కో పెన్ను రూ. 1500 , షార్ప్‌నర్‌ రూ. 600 వరకు «దరలు ఉన్నాయి. దీంతో  ఎడమచేతి వాటం వారు ఉపయోగించే వస్తువుల కోసం సింగ్‌ ‘ ద లెఫ్ట్‌హ్యాండ్‌ షాప్‌’ పేరుతో దేశంలోనే మొట్టమొదటగా ఓ కంపెనీని ప్రారంభించారు..‘ మై లెఫ్ట్‌’ బ్రాండ్‌ పేరుతో స్కూల్‌ స్టేషనరీ, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించడం మొదలు పెట్టారు. రూ. 99కి స్కూల్‌ స్టేషనరీ కిట్‌ను అందుబాటులో తెచ్చారు. ఆన్‌లైన్, సోషల్‌ మీడియా ద్వారా ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. ఎడమ, కుడిచేతి వాటం కలిగిన ఇద్దరూ ఉపయోగించే విధంగా వస్తువుల తయారీపై తాజాగా దృష్టి పెట్టినట్లు సింగ్‌ తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ కూడా సింగ్‌తో టై అప్‌ అయింది. అయితే పూర్తిస్థాయిలో మార్కెట్‌ ఇంకా విస్తరించాల్సి ఉందని చెబుతున్నారు. ఇతర దేశాల్లోనూ ఈ వస్తువులు అమ్మేందుకు ప్రత్యేక స్టోర్‌లు ఉన్నాయి.


వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం
ఈ తరహా వస్తువులపై అవగాహన కల్గించేందుకు మహారాష్ట్రలో ఎడమ చేతి వాటం కల్గిన పిల్లల తల్లిదండ్రులు 160 మంది వరకు కలిసి ఓ వాట్సాప్‌ గ్రూప్‌నే క్రియేట్‌ చేసుకున్నారు. ఫేస్‌బుక్‌ గ్రూప్‌లు, లెఫ్ట్‌ హ్యాండర్స్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసుకుని వీటి గురించి విస్త్రతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ సాధారణ వస్తువులను వాడుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు అందుకే వీరికి అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నామని పూణే వాసి ఒకరు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement